ఇంటర్, డిగ్రీల్లోనూ మధ్యాహ్న భోజనం
ABN , First Publish Date - 2020-07-18T21:39:21+05:30 IST
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి వెళ్లిపోతున్నారని, భోజనం అందిస్తే రెండోపూట కూడా కళాశాలల్లోనే ఉంటారని అన్నారు. ఇంటర్‌లో 1.60 లక్షల మంది, డిగ్రీలో లక్ష మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల డిగ్రీ కళాశాలలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి గురించి చర్చ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న విషయాన్ని సీఎం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఙప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని బాటనీ అధ్యాపకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేసే కార్యాచరణను రూపొందించాలని సీఎం ఆదేశించారు.
కోనప్ప హర్షం
మధ్యాహ్న భోజనం ప్రకటనపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హర్షం వ్యక్తం చేశారు. కోనప్ప సిర్పూరు నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థులకు ఆరేళ్లుగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దేశంలోనే మొదటిసారి ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం ప్రకటించారని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.