‘ఇంగ్లిష్‌ మీడియం’లో నిర్బంధించలేం

ABN , First Publish Date - 2020-01-28T16:10:32+05:30 IST

ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకోవాలని విద్యార్థులను ని

‘ఇంగ్లిష్‌ మీడియం’లో నిర్బంధించలేం

ముందుకెళ్తే అధికారులపై చర్యలు తప్పవు
బాధ్యుల నుంచి సొమ్ము రాబట్టి తీరతాం
అవసరమైతే ఏసీబీ, సీబీఐ విచారణ : హైకోర్టు
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
8 వరకు మాతృభాషలోనే బోధన మా విధానం : కేంద్రం
 
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకోవాలని విద్యార్థులను ని ర్బంధించలేమని, అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించడమేనని స్పష్టం చేసింది. ఇంగ్లిష్‌ మీడియం అ మలు కోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతుల నిర్వహణకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో అధికారులు ముందడుగు వేస్తే.. ఆ ఖర్చును వారి నుంచే రాబడతామని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ అవసరమైతే ఏసీబీ, సీబీఐ విచారణకు ఆదేశించి డబ్బును వెనక్కి రప్పిస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌లను ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయనిపక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి స్వయం గా హాజరు కావాలని పేర్కొంది. అంతేగాక ఇచ్చిన గడువులోగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతే ఇంగ్లిష్‌ మీడియం అమలుపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యల ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాంభొట్ల శ్రీనివాస సుధీష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సో మవారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు తాము అడ్డు చెప్పడం లేదని, ఈ వ్య వహారంపై వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం కావాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ కృష్ణమోహన్‌ వాదనలు వినిపిస్తూ.. విద్యాహక్కు చట్టప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యాభ్యాసం ఉండాలని విద్యార్థులను బలవంతపెట్టలేమని పేర్కొంది. పిటిషనర్‌ శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఇంగ్లిష్‌ మీడియం అమలు దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తూనే ఉందని, అధికారులు వివిధ రకాల సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు. దీంతో ధర్మాసనం అధికారులపై తీవ్రంగా స్పందించింది.

Updated Date - 2020-01-28T16:10:32+05:30 IST