‘అమ్మఒడి’కి అందని నగదు

ABN , First Publish Date - 2020-01-14T15:48:49+05:30 IST

అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సోమవారం చుక్కలు కనిపించాయి. ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉదయం నుంచే లబ్ధిదారులు భారీగా క్యూ కట్టారు. తొలుత ఏటీఎంలకు వెళ్లి.. అక్కడ నగదు లేకపోవడంతో తిరిగి బ్యాంకులను ఆశ్రయించారు.

‘అమ్మఒడి’కి అందని నగదు

బ్యాంకుల్లో సొమ్ములు నిల్‌
అరకొరగానే చెల్లింపులు
ఏటీఎంల వద్ద భారీ క్యూలు
కొంతమంది ఖాతాలకు జమకాని నగదు
 
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)
 అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సోమవారం చుక్కలు కనిపించాయి. ప్రభుత్వం వేసిన డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉదయం నుంచే లబ్ధిదారులు భారీగా క్యూ కట్టారు. తొలుత ఏటీఎంలకు వెళ్లి.. అక్కడ నగదు లేకపోవడంతో తిరిగి బ్యాంకులను ఆశ్రయించారు. ఏటీఎం కార్డులు లేనివారు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. వాస్తవంగా 9,10 తేదీల్లో అమ్మఒడి పథకం ప్రారంభమయ్యింది. ఈ రెండు రోజుల్లోనూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము చేసింది. 11,12 తేదీల్లో బ్యాంకులకు సెలవు. 14 నుంచి సంక్రాంతి పండగ. దీంతో సోమవారంనాడు బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు అమ్మఒడి లబ్ధిదారులు క్యూ కట్టారు. అంతసొమ్ము తమ వద్ద లేదంటూ చాలా ప్రాంతాల్లో బ్యాంకర్లు చేతులెత్తేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో బ్యాంకులు తెరవకముందే క్యూ కట్టిన లబ్ధిదారులను చూసి బ్యాంకర్లు నివ్వెరపోయారు. బ్యాంకుల్లోనూ అంతంతమాత్రంగా నిల్వలు ఉండటంతో మేనేజర్లు ఖాతాదారులతో బేరసారాలకు దిగారు.
 
‘బ్యాంకులో నగదు తక్కువగా ఉంది. దయ ఉంచి పది వేల రూపాయలలోపు మాత్రమే ఇస్తాం. మిగిలిన మొత్తం పండగ తర్వాత ఇస్తామంటూ అందరినీ బతిమిలాడారు. మొండికేసిన వారికి పూర్తి నగదు ఇచ్చి, మిగతా వారికి పది వేలలోపు మాత్రమే చేతిలోపెట్టారు. జంగారెడ్డిగూడెంలోని ఆంధ్రాబ్యాంకులో మూడు నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బ్యాంకుల్లో నగదు ఇచ్చేది లేదని, ఏటీఎంల్లో తీసుకోవాలని ఖరాఖండిగా చెప్పేశారు. పండగ సమయంలో ఇలాంటి నిబంధనలు ఏమిటని కొందరు నిలదీయగా.. అటువంటి వారికి నగదు చెల్లించారు. మరికొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లినా చాలాచోట్ల నగదు లేదు. నగదు ఉన్న కొద్దిచోట్లా.. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడ్డారు. మరోవైపు కొన్ని బ్యాంకుల్లో రూ.500 ఇన్సూరెన్స్‌ చేయాలని మేనేజర్లు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇన్సూరెన్స్‌ చేస్తే.. ఏడాదిలో ఏదైనా ప్రమాదంలో మరణిస్తే రూ.లక్ష వరకు పరిహారం వస్తుందని, ఈ విషయంలో లబ్ధిదారులను ఒత్తిడి చేయడం లేదని బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు.
 
విశాఖ జిల్లాలోనూ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు మహిళలు పోటెత్తారు. ఉదయం ఏడు గంటల నుంచే బ్యాంకుల వద్ద బారులుతీరారు. పలువురు మహిళలు చంటి బిడ్డలను చంకన వేసుకుని గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. తీరా కౌంటర్‌ వద్దకు వెళ్లేసరికి, మీ ఖాతాలో డబ్బులు పడలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో పలువురు మహిళలు నిరాశ చెందారు. కాగా ఇంతవరకు డబ్బులు జమకాని వారికి మంగళవారం పడతాయని, లేనిపక్షంలో సంక్రాంతి తర్వాత జమవుతాయని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-01-14T15:48:49+05:30 IST