ఉద్యోగులకు పండగపూట పస్తేనా!

ABN , First Publish Date - 2020-01-10T16:18:55+05:30 IST

కొత్త సంవత్సరం.. తొమ్మిదో తేదీ దాటినా జీతాలు అందలేదు. మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండగ వస్తోంది అంటూ రాష్ట్రంలోని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ స్థాయిలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు అందినా కార్పొరేషన్లు

ఉద్యోగులకు పండగపూట పస్తేనా!

పదో తేదీ వచ్చినా జీతాలు పడలేదు
సాంకేతిక కారణాలు చెబుతున్న అధికారులు
అమ్మఒడి కోసమేనని ఉద్యోగుల ఆరోపణ

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరం.. తొమ్మిదో తేదీ దాటినా జీతాలు అందలేదు. మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి పండగ వస్తోంది అంటూ రాష్ట్రంలోని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ స్థాయిలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు అందినా కార్పొరేషన్లు, హెచ్‌ఓడీ ఉద్యోగులు, కొందరు టీచర్లకు డిసెంబరు జీతాలు ఇంకా ఖాతాల్లో జమకాలేదు. ఈ జాబితాలో సెర్ప్‌, పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌, సర్వే డైరెక్టరేట్‌, ఎస్సీ కార్పొరేషన్‌, ఇతర కార్పొరేషన్ల ఉద్యోగులు ఉన్నారు. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో సగంమందికే వేతనాలు అందాయి. దీంతో ఉద్యోగులు ఆర్థికశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే వేతనాలు ఆలస్యమయ్యాయని ఆర్థికశాఖ చెప్తున్నప్పటికీ.. అమ్మఒడి కోసమే తమకు వేతనాలు ఆపారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలకు పంచడం కోసం తమకు వేతనాలు ఆపితే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతినెలా వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.5,600కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. ఇందులో జనవరి ఒకటి, రెండు తేదీల్లో దాదాపు రూ.3,000కోట్లు వరకు మాత్రమే ఆర్థికశాఖ విడుదల చేసినట్టు సమాచారం. మిగిలిన డబ్బు 14వ తేదీ నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తెచ్చుకునేందుకు కేంద్రంనుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో వచ్చే మంగళవారం ఆర్‌బీఐ ద్వారా బాండ్లను వేలంవేసి నిధులు సమీకరించి వాటితో మిగిలిన ఉద్యోగుల వేతనాలు చెల్లించే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-01-10T16:18:55+05:30 IST