శిరోజాలు అమ్మి.. బిడ్డల ఆకలి తీర్చి..

ABN , First Publish Date - 2020-01-11T15:31:18+05:30 IST

చేసిన అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటే.. ముగ్గురు పిల్లల పట్టెడన్నం కూడా పెట్టే పరిస్థితి లేక.. తన శిరోజాలు అమ్మి వారి ఆకలి తీర్చిందో పేద తల్లి. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది.

శిరోజాలు అమ్మి.. బిడ్డల ఆకలి తీర్చి..

చెన్నై, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చేసిన అప్పులు తీర్చలేక భర్త ఆత్మహత్య చేసుకుంటే.. ముగ్గురు పిల్లల పట్టెడన్నం కూడా పెట్టే పరిస్థితి లేక.. తన శిరోజాలు అమ్మి వారి ఆకలి తీర్చిందో పేద తల్లి. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది.
 
సేలం పొన్నమ్మపేటకు చెందిన సెల్వం, ప్రేమ దంపతులకు ముగ్గురు కుమారులు. తాను పనిచేసే ఇటుకబట్టీ యజమాని, మరికొందరి వద్ద సెల్వం రూ.5 లక్షల వరకు అప్పు చేశారు. అప్పులవారు ఒత్తిడి చేయడంతో 7 నెలల క్రితం సెల్వం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత బిడ్డల పోషణ కోసం ప్రేమ ఇటుకబట్టీలో పనికి వెళ్లింది. అప్పులిచ్చిన వారంతా డబ్బుల కోసం ప్రేమను వేధించడం మొదలుపెట్టారు.
 
దీంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దాంతో ఆమెను పనిలో నుంచి కూడా తీసేశారు. పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బుల్లేక ఆమె మానసిక వేదనకు గురైంది. దీంతో ఒక రోజు ఆమె శిరోజాలను అమ్మేసింది. వచ్చిన రూ.150తో పిల్లలకు అన్నం వండి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు సామాజిక వేత్తలు ఫేస్‌బుక్‌ ద్వారా నిధులు సేకరించి ప్రేమ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.

Updated Date - 2020-01-11T15:31:18+05:30 IST