వైద్య కాలేజీలంటే వ్యాపారం కాదు

ABN , First Publish Date - 2020-01-31T16:00:58+05:30 IST

ప్రైవేటు వైద్య కళాశాలలంటే వ్యాపారమనే కోణంలో కాకుండా ప్రజలకు సేవ చేయడమనే ఆలోచనతో ఉండాలని వాటి యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

వైద్య కాలేజీలంటే వ్యాపారం కాదు

సేవా దృక్పథంతో ఉండాలని సూచించాం
వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌
మల్లారెడ్డి కేన్సర్‌ ఆస్పత్రి ప్రారంభం
హైదరాబాద్‌ సిటీ/షాపూర్‌నగర్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్య కళాశాలలంటే వ్యాపారమనే కోణంలో కాకుండా ప్రజలకు సేవ చేయడమనే ఆలోచనతో ఉండాలని వాటి యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసి, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య కళాశాల, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. గురువారం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్‌ సిటీలో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి కేన్సర్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను కార్మిక మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. మల్లారెడ్డి తన ఆస్పత్రుల్లో పేదలకు అతి తక్కువ ఫీజుతో సేవలు అందించాలని కోరారు. ‘‘గతంలో వైద్య విద్య ఎంతో ఖరీదైనదిగా ఉండేది.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభు త్వ, ప్రైవేటు వైద్య కళాశాలలతో సీట్ల సంఖ్య చాలా పెరిగిం ది. ఒకప్పటి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు వేరు, ఇప్పటివి వేరు. ‘నీట్‌’ వచ్చాక దేశంలో మెరిట్‌ ఉన్న విద్యార్థులకే వైద్య కళాశాలల్లో సీట్లు లభిస్తున్నాయి. పేద, మధ్య తరగతికి చెందిన వారు సైతం వైద్య విద్య అభ్యసిస్తున్నారు’’ అని చెప్పారు. ఈహెచ్‌ఎస్‌ కింద ఏడాదికి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద 250 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. హెల్త్‌ సిటీలో రోజూ ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని మల్లారెడ్డి చెప్పారు.

Updated Date - 2020-01-31T16:00:58+05:30 IST