కొందరికే జీతాలు!

ABN , First Publish Date - 2020-01-01T12:59:44+05:30 IST

కొందరికే జీతాలు!

కొందరికే జీతాలు!

  • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాలకు ముడి
  • వారి బిల్లులు అప్‌లోడ్‌ చేశాకే పర్మినెంట్‌ వాళ్లవి
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఒకటో తేదీ అంటే ఉద్యోగులకు ఎంతో ప్రత్యేకమైంది. జీతాలు అందే రోజు. కానీ నూతన సంవత్సరం ప్రారంభంలో రెగ్యులర్‌ ఉద్యోగులందరూ ఒకటో తేదీనే జీతాలు పొందే పరిస్థితి లేదు. తమ శాఖలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందాకే తాను జీతం తీసుకుంటానని సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గతంలో తన డీడీవో (డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ ఆఫీసర్‌)కు లేఖ రాశారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఇదే బాటపట్టారు. దీంతో ముందు గా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేసిన తర్వాతే రెగ్యులర్‌ ప్రభుత్వోద్యోగుల బిల్లులను డీడీవోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు.
 
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల బిల్లులను అప్‌లోడ్‌ చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో రెగ్యులర్‌ ఉద్యోగుల బిల్లులు అప్‌లోడ్‌ చేయడం ఆలస్యమవుతోందని డీడీవోలు చెప్తున్నారు. అలాగే, ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి జీతాలకు సంబంధించిన నంబరు స్టేట్‌మెంట్లు సమర్పిస్తేనే డిసెంబరు నెల బిల్లులు చెల్లిస్తామని ఆర్థికశాఖ గతంలోనే అన్ని శాఖలను ఆదేశించింది. ఈ నంబరు స్టేట్‌మెంట్లను ఎస్‌టీవో (సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌)లు పరిశీలించిన తర్వాతే జీతాలు అందుతాయని పేర్కొంది. బిల్లులు సమర్పించడంలో జాప్యం కూడా ఈ సమస్యకు కారణమని తెలుస్తోంది. ఈ నెల 25 ఉదయం 8గంటల తర్వాత అప్‌లోడ్‌ అయిన బిల్లులను డీడీవోలు అందరూ ఒకసారి క్రాస్‌చెక్‌ చేసుకోవాలని, ఒకవేళ ఎస్‌టీవో వాటిని నిర్ధారించకపోతే ఈ బిల్లులను తిరిగి అప్‌లోడ్‌ చేయాలని ఆర్థికశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
అప్‌లోడ్‌ అయిన బిల్లుల చెల్లింపులు యథాతథంగా జరిగిపోతాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31వ తేదీన మూడో త్రైమాసికానికి చివరి రోజు కావడంతో ఆర్‌బీఐ వద్ద లావాదేవీలు నిలిచిపోతాయని, ఏపీలో ఒకటో తేదీన జీతాల చెల్లింపు కొంత జాప్యం కావొచ్చని చెప్పారు. ఇక ఎప్పట్లాగే ఈ నెలలో కూడా జీతాల చెల్లింపులకు అప్పులు తీసుకోకతప్పని పరిస్థితి నెలకొంది. ట్రెజరీ బిల్లులు రూ.1000 కోట్లు ఉండగా, ఎస్‌డీఎఫ్‌ కింద రూ.1500 కోట్లు, వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.1500 కోట్లు ఆర్‌బీఐ నుంచి అప్పుతీసుకునే వేతనాలు చెల్లించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
నెల నెల గండం.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సేవలు మరో నెల పొడిగింపు
రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి నెలనెల గండంలా తయారైంది. తాజాగా 2020 జనవరి 31 వరకూ వీరి సర్వీసు గడువు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 31వ తేదీని డెడ్‌లైన్‌గా పేర్కొంటూ, ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ గతంలో ఒక జీవో ఇచ్చింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా ఈ కార్పొరేషన్‌లో నమోదు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. ఈ ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. ఆగస్టు 31తో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలు ముగియడంతో అప్పటి నుంచి ప్రతి నెలా పొడిగిస్తూ జీవోలు ఇస్తున్నారు.
 
ఈ పరంపరలో ఇది నాలుగో జీవో. తాజాగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ తెరపైకి రావడం, సచివాలయాన్ని విశాఖకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఒక్క నెల మాత్రమే పొడిగింపు ఇవ్వడంపై ఆ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు విశాఖకు తరలే పక్షంలో తమను అక్కడకు తీసుకెళ్తారా?.. లేదా అక్కడే స్థానికంగా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొత్త ఉద్యోగులను చేర్చుకుంటారా అనే అంశంపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

Updated Date - 2020-01-01T12:59:44+05:30 IST