ఇంగ్లిష్ మీడియం కావాలి!
ABN , First Publish Date - 2020-02-05T14:17:06+05:30 IST
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ వ్యవహారంలో తమ వాదనలు వినాలని కోరుతూ..

- హైకోర్టులో తల్లిదండ్రుల కమిటీ ఇంప్లీడ్ పిటిషన్
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ వ్యవహారంలో తమ వాదనలు వినాలని కోరుతూ జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ హైకోర్టును అభ్యర్థించింది. ఆంగ్లమాధ్యమం వ్యవహారంలో కోర్టు ఎలాంటి వ్యతిరేక ఆదేశాలు ఇవ్వరాదని, తమవైపు వాదనలు వినిపించేందుకు అనువుగా పిటిషన్‌లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలని కోరింది. ఈ మేరకు కమిటీ తరఫు న్యాయవాది మహేశ్ మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందు హాజరై ప్రస్తావించారు.
ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెడుతూ ప్రభుత్వం గత నవంబరు 20న జీవో 85ని జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ మేరకు కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులు బి.శ్వేతా భార్గవి దాఖలు చేసిన పిటిషన్‌లో.. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులంతా సంతోషంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులు చెల్లించి పిల్లల్ని చదివించేంత స్థోమత మాకు లేదు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో మాలాంటి కుటుంబాలన్నీ లబ్ధి పొందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల బిడ్డలకు ఆంగ్లమాధ్యమం వరం లాంటిది’’ అని పేర్కొన్నారు.