పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీతో ఉన్నత వైద్యం

ABN , First Publish Date - 2020-01-17T15:12:12+05:30 IST

: పీఈఎస్‌ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వైద్యకళాశాల ద్వారా అన్ని వర్గాలకు అత్యున్నత వైద్యం లభించనుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప

పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీతో ఉన్నత వైద్యం

భూమిపూజలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప
 
బెంగళూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పీఈఎస్‌ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వైద్యకళాశాల ద్వారా అన్ని వర్గాలకు అత్యున్నత వైద్యం లభించనుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభిప్రాయపడ్డారు. బెంగళూరు ఎలక్ర్టానిక్‌ సిటీలోని పీఈఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో గురువారం మెడికల్‌ కళాశాలకు ఆయన భూమి పూజ చేశారు. గుణాత్మక విద్యకు మారుపేరుగా సంస్థలను దొరస్వామి తీర్చిదిద్దారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. మెడికల్‌ కళాశాల ద్వారా మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు సాధ్యం కాగలవని ఆకాంక్షించారు.
 
ఐదు దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్నామని పీఈఎస్‌ గ్రూపు విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్‌, యూనివర్సిటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ దొరస్వామి చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ఆంద్రప్రదేశ్‌ సీఎం సూచనల మేరకు కుప్పంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసి 700 గ్రామాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాల నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక, ప్రొ.చాన్సలర్‌ జవహర్‌, కుప్పం మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ సురేష్‌ క్రిష్ణమూర్తి, సహాయ మెడికల్‌ డైరెక్టర్‌ రూపాసురేష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-01-17T15:12:12+05:30 IST