చదువు ఇంజనీరింగ్‌.. వృత్తి బిచ్చగాడు

ABN , First Publish Date - 2020-01-20T15:03:56+05:30 IST

క్షావాలాతో గొడవలో పోలీస్‌స్టేషన్‌కు చక్కని ఇంగ్లిషులో ఫిర్యాదు.. షాకైన పోలీసులు ఇదేమని అడిగితే వ్యక్తిగత విషయమని జవాబు పూరీ జగన్నాథ ఆలయ మెట్లే ఆవాసం.. గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగం

చదువు ఇంజనీరింగ్‌.. వృత్తి బిచ్చగాడు

రిక్షావాలాతో గొడవలో పోలీస్‌స్టేషన్‌కు చక్కని ఇంగ్లిషులో ఫిర్యాదు..
 షాకైన పోలీసులు ఇదేమని అడిగితే వ్యక్తిగత విషయమని జవాబు
పూరీ జగన్నాథ ఆలయ మెట్లే ఆవాసం..
 గతంలో హైదరాబాద్‌లో ఉద్యోగం
పూరీ, జనవరి 19: ‘బిచ్చగాడు’ సినిమా గుర్తుందా! చావుబతుకుల్లో ఉన్న తన తల్లి కోలుకోవాలనే ఆకాంక్షతో ఓ ఆగర్భ శ్రీమంతుడు కొన్ని నెలలపాటు బిచ్చగాడిగా మారి.. బిచ్చగాళ్లలో ఒకడిగా కలిసిపోయి.. వారితో తింటూ, ఉంటూ రోడ్ల మీద అడుక్కుతింటూ గడిపే దైన్యం! ఒడిసాలోనూ ఇలానే ఓ ‘బిచ్చగాడు’ కనిపించాడు. ఆయన పేరు గిరిజా శంకర్‌ మిశ్రా (51). పూరిలోని జగన్నాథ్‌ ఆలయం వద్ద అడుక్కొంటూ బతుకుతున్నాడు.
 
మాసిన బట్టలు, నెరిసిన గడ్డంతో దొరికిన రోజు తింటూ.. దొరకని రోజు పస్తులుంటూ చలి, వానను లెక్కచేయకుండా రాత్రుళ్లు ప్లాట్‌ఫాంపైనే నిద్రిస్తున్నాడు. అయితే, ఆయనో ఇంజనీర్‌. బడా సంస్థల్లో మంచి ఉద్యోగాలూ చేశాడని తేలింది! ఇటీవల బిచ్చమడుక్కుంటున్న మిశ్రాతో ఓ రిక్షావాలా గొడవపడ్డాడు. స్థానికులు ఆ ఇద్దరినీ పోలీసుల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో రిక్షావాలా తనకు రాయడం రాదని చెప్పాడు. మిశ్రా మాత్రం పెన్ను, పేపర్‌ తీసుకొని ఇంగ్లిషులో చకచకా ఫిర్యాదు రాశాడు.
 
ఆరులైన్లతో కూడిన దస్తూరిని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఆ రాత ముత్యాల్లా ఉండటం, వ్యాకరణపరంగానూ గొప్పగా ఉండటం, అందులో ఒక్కతప్పూ లేకపోవడం చూసి అతడు బిచ్చగాడయితే కాదని ఫిక్సయ్యారు. మిశ్రాను వివరాలు అడిగితే ‘సినిమా కథ’కు మించి థ్రిల్‌ కలిగేలా పూర్వాశ్రమంలో తాను గడిపిన జీవితాన్ని చెప్పుకొచ్చాడు.
మిశ్రాది భువనేశ్వర్‌. ఆయనది ఉన్నత కుటుంబం. తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన తండ్రి పోలీసు అధికారిగా పనిచేశాడు.
 
బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత సెంట్రల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ)లో మిశ్రా ఇంజనీరింగ్‌ చదివాడు. ముంబైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి మిల్టన్‌ కంపెనీలో పనిచేశాడు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ.. పూరీకొచ్చి బిచ్చగాడిగా మారిపోయాడు.
ఇంజనీర్‌గా ఉన్న నువ్వు ఇలా ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నావ్‌ అని పోలీసులు ప్రశ్నిస్తే.. ‘సారీ.. ఇది నా పర్సనల్‌ మ్యాటర్‌’ అంటూ వెళ్లిపోయాడు! మిశ్రా మనసులో ఏ బలమైన ఆకాంక్ష ఉందో ఎవరికి తెలుసు?

Updated Date - 2020-01-20T15:03:56+05:30 IST