పోలీసు కొలువు మాకొద్దు..!

ABN , First Publish Date - 2020-01-18T15:50:32+05:30 IST

కానిస్టేబుళ్ల శిక్షణపై 1,370 మంది నిరాసక్తత లిఖిత పూర్వకంగా చెప్పిన 500 మంది పత్రాలు సమర్పించని వారి సంఖ్య 750

పోలీసు కొలువు మాకొద్దు..!

కానిస్టేబుళ్ల శిక్షణపై 1,370 మంది నిరాసక్తత
లిఖిత పూర్వకంగా చెప్పిన 500 మంది
పత్రాలు సమర్పించని వారి సంఖ్య 750
 
హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎంతో శ్రమకోర్చి.. ఎన్నో అవరోధాలు దాటి.. ఒక్కో పరీక్షలో నెగ్గుకొచ్చి.. నియామక పత్రాలు సాధించిన పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. తమకు ఆ కొలువు వద్దని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ శిక్షణకు ఎంపికవ్వగా.. వారిలో 1,370 మంది చివరి నిమిషంలో నిరాసక్తత కనబర్చారు. వీరిలో 500 మంది ఏకంగా తమకు పోలీసు కొలువు ఇష్టం లేదని, శిక్షణకు రాలేమంటూ అధికారులకు రాతపూర్వకంగా సమాచారం అందించారు. మరో 750 మంది నిర్ణీత ధ్రువపత్రాలు సమర్పించలేదు. ఇంకో 120 మంది చివరి అంకమైన వైద్యపరీక్షలకు గైర్హాజరయ్యారు.
 
ఉన్నతాధికారులు కూడా పలు కారణాలతో కొందరు అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషంలో ఆపేశారు. వీరిలో 400 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు.. 500 మందిపై క్రిమినల్‌ కేసులు గుర్తించారు. కేసుల తీవ్రతను పరిశీలించి వారిని ఇదే బ్యాచ్‌లో శిక్షణకు ఎంపిక చేస్తామని చెప్పారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 28 పీటీసీలు, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్లు, ఇతర కేంద్రాల్లో 9 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమైంది. వీరిలో సివిల్‌, ఏఆర్‌, సాంకేతిక విభాగాలకు చెందినవారు ఉన్నారు. మరో 3,800 మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్ల (టీఎ్‌సఎ్‌సపీ) అభ్యర్థుల శిక్షణ కొద్ది రోజుల కిందటే మొదలైంది. ఇక ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్‌), జైళ్ల శాఖ, అగ్నిమాపకం విభాగాలకు సంబంధించిన అభ్యర్థులకు ఆయా శాఖలు సొంతంగా శిక్షణనిస్తున్నాయి.

Updated Date - 2020-01-18T15:50:32+05:30 IST