పారా మెడికల్‌ బోర్డు రద్దు! కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో విలీనం

ABN , First Publish Date - 2020-01-17T16:02:38+05:30 IST

నాణ్యమైన విద్యను అందించకపోవడం వల్లే డిప్లొమాల స్థానంలో డిగ్రీ కోర్సులు రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం

పారా మెడికల్‌ బోర్డు రద్దు! 
కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో విలీనం

నాణ్యమైన విద్యను అందించకపోవడం వల్లే
డిప్లొమాల స్థానంలో డిగ్రీ కోర్సులు
రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం
 
హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ పారా మెడికల్‌ బోర్డును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోధనలో నాణ్యతా ప్రమాణాలు లేనందున దీనిని రద్దు చేసి.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో పారా మెడికల్‌ బోర్డు ఏర్పాటు కాగా.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ, 210 ప్రైవేటు పారా మెడికల్‌ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలోని ఒక్కో కోర్సుకు 60 సీట్ల చొప్పున ఉన్నాయి.
 
కొన్ని కాలేజీలు నాలుగైదు కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 30 వేల సీట్లున్నాయి. వాటిలో ఎక్కువగా ప్రైవేటులోనే ఉన్నాయి. ఇవన్నీ పారా మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కాగా ప్రస్తుతం పారా మెడికల్‌లో 18 రకాల డిప్లొమా కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ నుంచి అనస్తీషియా టెక్నీషియన్స్‌ దాకా రకరకాల డిప్లొమా కోర్సులున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విద్యలో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో విద్యార్థులు కనీస అవగాహన లేకుండానే సర్టిఫికెట్లతో బయటికి వస్తున్నారు.
ప్రైవేటు కాలేజీల్లో చాలావరకు సరైన అఽధ్యాపకులు లేకుండానే కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులు కూడా కాలేజీలకు సరిగా వెళ్లడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు పారా మెడికల్‌ బోర్డు రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఉపాధి అవకాశాలు తగ్గడం వల్లే..
 
పారా మెడికల్‌ బోర్డును రద్దు చేసి దానిని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కలిపేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల డిప్లొమా కోర్సుల స్థానంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇక డిప్లొమా కోర్సులనేవి ఉండవు. పైగా ప్రస్తుతం 30 వేలకు పైగా డిప్లొమా సీట్లుంటే వాటిలో సగం కూడా నిండని పరిస్థితి ఉంది. దానికితోడు డిప్లొమా కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు కూడా ఉండటం లేదన్న అభిప్రాయంలో సర్కారు ఉంది.
వీటి స్థానంలో పారా మెడికల్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల నాణ్యమైన విద్య అందడంతోపాటు డిగ్రీ పట్టాతో మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
అయితే డిప్లొమా కోర్సులను ఉన్నపళంగా రద్దు చేయలేరని, కనీసం రెండేళ్లయినా సమయం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సులను కేంద్రం రద్దు చేసి.. వాటి స్థానంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు ఉండవని తేల్చి చెప్పింది. అలాగే డిప్లొమా కోర్సులను రద్దు చేయాలన్నా ముందుగానే అధికారికంగా ప్రకటించి.. ఫలానా ఏడాది నుంచి వాటిలో ప్రవేశాలుండవని తెలపాల్సి ఉంటుంది.
 
రెండంకెల సంఖ్యనూ గుర్తించలేని 1వ తరగతి విద్యార్థులు.. ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ
 
దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఒకటో తరగతి చదువుతున్న ప్రతి 10 మంది విద్యార్థుల్లో నలుగురు ఐదేళ్ల కంటే తక్కువ లేదా ఆరేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు ఉన్నారని తన వార్షిక నివేదిక 2019(ఏఎస్‌ఈఆర్‌)లో పేర్కొంది. 4-8 ఏళ్ల పిల్లల్లో 56.8 శాతం మంది అమ్మాయిలు, 50.4 శాతం మంది అబ్బాయిలు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారని పేర్కొంది. ‘‘ఒకటవ తరగతి చదివే పిల్లలలో 41.1 శాతం మంది మాత్రమే రెండంకెల సంఖ్యలను గుర్తించగలు గుతున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల ప్రకారం ఒకటో తరగతిలోనే 99 వరకు అంకెలని గుర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి’’ అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 1514 గ్రామాల్లోని 36,930 మంది పిల్లలపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్‌, శ్రీకాకుళం జిల్లాలో ఈ సర్వే నిర్వహించారు.

Updated Date - 2020-01-17T16:02:38+05:30 IST