‘రీయింబర్స్’ ఇక ఈజీకాదు!
ABN , First Publish Date - 2020-01-02T14:48:26+05:30 IST
‘‘డిగ్రీ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల్లో 40 శాతం మంది పరీక్షలు రాయడం లేదు. చాలా మంది విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కనీస అటెండెన్స్‌తో పాటు..

- ఉత్తీర్ణతా శాతం, హాజరుపై నిఘా.. సంతృప్తిగా ఉంటేనే ఫీజులు చెల్లింపు
- 2020-21 నుంచి ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లు
- క్వాలిటీ అసె్‌సమెంట్ సెల్ ఏర్పాటు
- ప్రతి వర్సిటీలో డేటాబేస్ సెంటర్
- ఓపెన్ వర్సిటీగా ‘అప్పారావు వర్సిటీ’
- ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వెల్లడి
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘డిగ్రీ అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల్లో 40 శాతం మంది పరీక్షలు రాయడం లేదు. చాలా మంది విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కనీస అటెండెన్స్‌తో పాటు ఉత్తీర్ణతా శాతం ఆధారంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలన్న ప్రతిపాదన ఉంది’’ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్(సీజీపీ) సగటును ప్రాతిపదికగా తీసుకుని రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్న సిఫారసు ఉన్నప్పటికీ ఎంతో కొంత ఉత్తీర్ణత శాతాన్ని పెడితేనే మంచిదని భావిస్తున్నామని చెప్పారు. డిగ్రీ కోసం 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో సగం కూడా భర్తీ కావడం లేదని, 25ు కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కాలేజీలను మూసేయమని సూచించామని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అఫిలియేషన్ లేని డిగ్రీ కళాశాలలకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు.
ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు బుఽధవారం ఆయన తాడేపల్లిలోని తన కార్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరంలో మండలి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి డిగ్రీలో నాలుగో ఏడాది పూర్తిగా స్కిల్ కోసం, ఇంటర్న్‌షిప్ కోసం ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 25 స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్ల డిగ్రీ కోసం యూజీసీకి లేఖ రాశామన్నారు. బీఎస్సీ(ఇంజనీరింగ్) కోసం కరిక్యులమ్ సిద్దం చేస్తున్నామని తెలిపారు. బోధనపై అవగాహన కోసం ఫ్యాకల్టీకి 2 నెలల పాటు శిక్షణా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. 2021 నుంచి స్కిల్ డెవల్‌పమెంట్ ప్రొగ్రామ్స్ అమలు చేస్తామని చెప్పారు. అన్ని వర్సిటీల్లోనూ విద్యార్థులు, లెక్చరర్‌ల డేటాబేస్ తయారు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని, సీఎంఐఎ్‌సలో అడ్మిషన్లు, ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ తదితర అన్ని అంశాలు అందులో ఉంటాయని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వర్సిటీల అనుబంధ కళాశాలలన్నీ త్వరలో ఏర్పాటయ్యే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం తీసుకునే ప్రతిపాదన ఉందన్నారు. వర్సిటీల్లో దశల వారీగా ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో క్వాలిటీ అసె్‌సమెంట్ సెల్ ఏర్పాటు చేస్తామని, కళాశాలలు జాతీయ ప్రమాణాలు సాధించే లా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు. డిగ్రీ కళాశాలలకు అక్రెడిటేషన్ తప్పనిసరని చెప్పారు. ఉమ్మడి ఆస్తుల్లో మన వాటా కింద రూ.55 కోట్లు రావాల్సి ఉందని, దీనిలో ఉన్నత విద్యా మండలికి రావాల్సిన నిధులపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని తెలిపారు. గురజాడ అప్పారావు వర్సిటీని ఓపెన్ వర్సిటీగా మార్చే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను 35ు నుంచి 70 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని, దీనికిగాను ఓపెన్ విద్యను ప్రొత్సహిస్తామని వివరించారు.