ఆరేళ్లలో వెయ్యికి పైగా గురుకులాలు

ABN , First Publish Date - 2020-11-06T16:19:20+05:30 IST

తెలంగాణలో గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో 17 బీసీ గురుకులాలు స్థాపిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఆరేళ్లలో వెయ్యికి పైగా గురుకులాలు

బీసీలకు ఆత్మగౌరవ భవనాలు: శ్రీనివాస్‌ గౌడ్‌


హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో 17 బీసీ గురుకులాలు స్థాపిస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలోనే వెయ్యికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర అబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు గురువారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్‌ పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారంటూ గతంలో బీసీ సంఘాల నేతలు ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఒక్కో విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని వివరించారు.


దేశంలో 60 కోట్ల మంది బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టక పోవడం దుర్మార్గమని, మోదీ సర్కారు బీసీలను నిర్లక్ష్యం చేస్తోందని శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు.  బీజేపీ సర్కారు ఢిల్లీలో బీసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. బీసీల జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే.. పార్లమెంటులో బీసీల బిల్లు పెట్టకుండా బీజేపీ ప్రభుత్వం వారిని అణిచేస్తోందని ఆరోపించారు. బీసీల ఆరాధ్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలన్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో స్థల సేకరణ జరుపుతున్నామన్నారు. 


Updated Date - 2020-11-06T16:19:20+05:30 IST