మొలకెత్తే నువ్వు

ABN , First Publish Date - 2020-04-24T05:40:10+05:30 IST

ఆ దృశ్యం ఉండి ఉండి నా లోపల ఎగిసిపడుతూనే ఉంది ఎగిసినప్పుడల్లా నొప్పి సలుపుతూనే ఉంది ఎవరికి తెలుసు...

మొలకెత్తే నువ్వు

ఆ దృశ్యం

ఉండి ఉండి

నా లోపల ఎగిసిపడుతూనే ఉంది 

ఎగిసినప్పుడల్లా 

నొప్పి సలుపుతూనే ఉంది 


ఎవరికి తెలుసు

ఎన్ని కలలు అక్కడ 

సమాధి అయ్యాయో 

ఎన్ని గుండె చప్పుళ్ళు 

గుండెలవిసేలా అక్కడ రోదిస్తున్నాయో


ఎవరు లెక్క పెట్టగలరు 

ఎన్ని బంధాలు జ్ఞాపకాలై 

గుమ్మాలకు వేలాడుతున్నాయో 

ఎన్ని చివరి చూపులు 

కను కొనల నుంచి జారిపోతున్నాయో


అంటరాని ఆ దేహాల్ని 

మూటగట్టి 

నాలుగు చక్రాల 

బళ్ళు బారులు కట్టి 

జాగ్రత్తగా మోసుకుపోతున్నాయి 


జీవం జాడలేని 

దిగంతాలకు ఆవల 

కుప్పలుగా పోగైన 

ఆ సమాధులు 

కరోనా కాటుకు ఇక ఆనవాళ్లు 


కలిసి పంచుకున్న కాలం 

ఎక్కడెక్కడ ముక్కలై పడి ఉందో

ఇప్పుడు ఏరుకోవాలి

చెప్పుకున్న బాసల్ని

పెరట్లో మట్టి దున్ని విత్తాలి

మొలకెత్తే ప్రతి చిగురు ఇక నువ్వేగా...

రెహాన

(అమెరికాలో కరోనా మృతుల సామూహిక ఖననం దృశ్యం

కలచివేసింది)

Updated Date - 2020-04-24T05:40:10+05:30 IST