వైజ్ఞానిక జగత్తులో వనితలు

ABN , First Publish Date - 2020-02-27T06:34:03+05:30 IST

రేపు జరుపుకునే ‘జాతీయ విజ్ఞాన దినోత్సవ’ (నేషనల్ సైన్స్ డే) సందర్భంలో సైన్సులో మహిళల ప్రాతినిధ్యాన్ని, శాస్త్ర విజ్ఞాన ప్రగతిలో వారి భాగస్వామ్యం గురించి చర్చించుకోవటం ఎంతైనా అభిలషణీయం. ఏటా ఏదో ఒక విషయాన్ని ప్రధానాంశంగా...

వైజ్ఞానిక జగత్తులో వనితలు

చదువులో, వృత్తిలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు మనకేం చెబుతున్నాయి? అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని మరీ మరీ విశదం చేస్తున్నాయి. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్ష రహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తుంది.


రేపు జరుపుకునే ‘జాతీయ విజ్ఞాన దినోత్సవ’ (నేషనల్ సైన్స్ డే) సందర్భంలో సైన్సులో మహిళల ప్రాతినిధ్యాన్ని, శాస్త్ర విజ్ఞాన ప్రగతిలో వారి భాగస్వామ్యం గురించి చర్చించుకోవటం ఎంతైనా అభిలషణీయం. ఏటా ఏదో ఒక విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని ‘సైన్స్ డే’ జరపటం ఆనవాయితీ. ఈ ఏడాది సైన్స్ డే ఇతివృత్తం ‘వైజ్ఞానిక రంగంలో స్త్రీలు’ (ఉమెన్ ఇన్ సైన్స్) అటువంటి చర్చకు విశేష ప్రేరణ నిస్తుందనడంలో సందేహం లేదు. కేవలం రెండు వందల రూపాయల వ్యయంతో గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణ చేసి భారతదేశానికి సైన్సులో తొలి నోబెల్‌ బహుమతి తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త సి.వి.రామన్‌. ఆయన తన పరిశోధనా ఫలితాలను వెల్లడించిన ఫిబ్రవరి 28 వ తేదీని (భావి పౌరుల్లో వైజ్ఞానిక స్ఫూర్తి విప్పారేందుకు) ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’ గా పాటిస్తున్నాము.


శాశ్వత కమిషన్‌, కమాండ్‌ పోస్టులకు మహిళా సైనికాధికారులు అర్హులేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమయింది. భారత సైన్యంలోని మహిళా సైనికాధికారులు సహజంగానే ఆ తీర్పుకు జేజేలు పలికారు. సైన్యంలోని మహిళలు దేశం గర్వించే ఎన్నో సేవలను అందించి దేశగౌరవాన్ని ఇనుమడింపజేశారని సుప్రీం కోర్టు న్యాయమార్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. జెండర్ ఆధారంగా శక్తియుక్తుల్ని అంచనావేయటం సరికాదని, ఇది మహిళల సేవలను అవమానించినట్లవుతుందని న్యాయమూర్తులు అన్నారు. మహిళా యోధులకు సమానావకాశాలు కల్పించకపోవడం స్త్రీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేకాదు సైన్యంలోని ప్రతి మహిళను అగౌరవపరచడమే అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పు స్త్రీ, పురుష వివక్ష లేకుండా సమానావకాశాలు కల్పించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇంతకూ ఈ తీర్పు ఇప్పుడెందుకు అవసరమైంది? దీని నేపథ్యం ఏమిటి? స్వల్పకాలిక సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌కు అర్హత కల్పిస్తూ దశాబ్దం క్రితమే ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. శరీర ధర్మాల రీత్యా స్ర్తీలు, పురుషుల కంటే బలహీనురని పేర్కొంటూ ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు ఒకటి దాఖలయింది. సర్వోన్నత న్యాయస్థానం ఆ అప్పీలును కొట్టివేస్తూ శాశ్వత కమిషన్, కమాండ్ పోస్టులకు మహిళా సైనికాధికారులు అర్హులేనని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును మూడు నెలల్లోగా అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఆధునికులమనీ, అంతరిక్ష యుగం, కంప్యూటర్‌ యుగమనీ గొప్పలు చెప్పుకొనే మనం స్త్రీలపై కొనసాగుతున్న వివక్షకు ఏం సమాధానం చెబుతాము? ఇదేదో సగటు మనిషిలో ఉన్న దురభిప్రాయం మాత్రమే కాదు. పాలకులు, ప్రభుత్వాలే స్త్రీ– పురుష సమానత్వాన్ని నిరాకరిస్తుంటే రాజ్యాంగం ఏమవుతున్నట్లు? దేశం ఎటు పోతున్నట్లు? మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో వేళ్లూనుకుని ఉందో ఈ సందర్భం చెప్పక చెబుతున్నది. పురుషాధిక్య భావజాలం, ఆలోచనలు ఊడలుదిగి అన్ని రంగాలనూ శాసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.


సైన్యం కాబట్టి ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చు కాని సైన్సు, టెక్నాలజీ వంటి ఇతర రంగాల్లో వివక్షకు తావుండదనుకునే వాళ్లు ఉండవచ్చు. పురుషులతో పోల్చిచూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్త్రీల స్ధాయి ప్రపంచ వ్యాపితంగానే తక్కువగా ఉన్నదన్నది ఎవరూ కొట్టివేయలేని ఒక వాస్తవం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ అసమానతలు మరీ ఎక్కువ. విద్యాభ్యాస స్థాయిలోనే కాలేజీల్లో బాలికల ప్రవేశాలు ముఖ్యంగా సైన్సు టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, వైద్య (stem)కోర్సుల్లో తగినంత ఉండ టం లేదు. ఒకవేళ సైన్సులో పట్టభద్రులయినా, డాక్టరేట్లు చేసినా సైన్సును వృత్తిగా కొనసాగించటం దుర్లభంగా ఉంది. ప్రాథమిక స్థాయిలో, కొంత వరకు సెకండరీ విద్యలో కూడా జెండర్ వివక్ష సమసిపోయిందని మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ 2016లో వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. పోస్టు గ్రాడ్యుయేటు స్ధాయి వరకు మహిళల శాతం ఒకింత మెరుగ్గానే ఉన్నా ఆపై పరిశోధనా పరమైన చదువుల్లో (ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి) వారి నిష్పత్తి పడిపోతున్నది. ఉపాధి ఉద్యోగాల్లో వీరికి తగిన ప్రోత్సాహం కొరవడటమే కొంతమేరకు కారణం. వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ప్రపంచ వ్యాపితంగా మహిళలు 30శాతం కంటే తక్కువగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్‌ ఎత్తి చూపారు. మహిళల పట్ల కొనసాగుతున్న వివక్ష ప్రపంచమంతటా ఉన్నా భారతదేశం వంటి వర్ధమాన దేశాల్లో మరీ ఎక్కువ. మన దేశంలోని శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, ఇంజనీర్లలో మహిళలు కేవలం 14శాతమే (ప్రపంచ సరాసరి 28.4 శాతం). నిజానికి అమెరికాలో సైతం పరిస్ధితి ఇంతకంటే మెరుగ్గా ఏమిలేదు. అక్కడి ఇంజనీర్లలో మహిళలు కేవలం 11శాతం మాత్రమే. అలాగే STEM ఉద్యోగాల్లో 12శాతం మహిళలే ఉన్నారు. వీటి ప్రవేశాల్లో సైతం మహిళల శాతం దారుణంగా ఉండటం శోచనీయం. జీవశాస్త్రంలో ఐదు శాతం, ఇంజనీరింగ్‌లో 8శాతం, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ చదువుల్లో కేవలం 3శాతం మంది మాత్రమే మహిళలు. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ సిబ్బందిలో కూడ మహిళలు 8శాతానికి మించి లేరు. ఇక అటువంటి సంస్థలకు నేతృత్వం వహించే డైరెక్టర్లుగా మహిళలను ఊహించగలమా? పురస్కారాలు, ప్రోత్సాహకాల విషయంలో కూడా మహిళల పట్ల చిన్నచూపే. మన దేశంలో పద్మశ్రీ అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్‌. ఆమెకు ఆ పురస్కారాన్ని 1977లో ఇచ్చారు. ప్రతిష్ఠాత్మక సైన్సు అకాడమీ ఫెల్‌షిప్పుల్లో కూడా సైన్సును వృత్తిగా ఎంచుకుని దీటైన పరిశోధనలు చేస్తున్న మహిళా శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు.


ఇదలావుంచితే దశాబ్దాల క్రితమే సామాజిక కట్టుబాట్లను, కష్టాలను ఎదుర్కొని సైన్స్‌లో తమదైన ముద్రవేసిన మహిళలు స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్నారు. తొమ్మిదేళ్ల బాల్యంలోనే పెళ్లి చేస్తే, 14ఏళ్ల వయసుకే తల్లై, కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి డాక్టర్‌ కావాలని సంకల్పించిన అపూర్వ విద్యావతి ఆనందీబాయి జోషి. అమెరికాలోని పెన్సిల్వేనియా మెడికల్‌ కాలేజీలో 1886లోనే పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళ ఆనందీబాయి. సైన్స్ చదవాలని, పరిశోధనలు చేయాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌్సలో ప్రవేశానికి కమలా సోహ్ని ఆరాట పడితే కేవలం మహిళ అన్న కారణంగా ఆమెకు ప్రవేశం నిరాకరించబడింది. సి.వి.రామన్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె డాక్టరేట్‌ పూర్తి చేశారు. రామన్‌ మార్గదర్శకత్వంలో మొట్టమొదటి పిహెచ్‌.డి పొందిన ప్రప్రథమ మహిళా శాస్త్రవేత్త కమలా సోహ్ని. సత్యేంద్రనాథ్ బోస్‌, ప్రఫుల్లచంద్ర రే వంటి ఉద్దండుల మార్గదర్శనలో రసాయన శాస్త్రంలో పిహెచ్‌.డి చేసిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందిన ఆసిమా ఛటర్జీ మొక్కల్లో ఉండే ఔషధాలను కనుగొన్నారు. కర్ణాటకలో తొలి మహిళా ఇంజనీరుగా పనిచేసిన రాజేశ్వరి ఛటర్జీ ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో మిచిగాన్‌ యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పొందారు. భారత వైజ్ఞానిక సంస్ధలో తన భర్తతో కలిసి ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేసిన విజ్ఞానవేత్తగా ఆమె సువిఖ్యాతులయ్యారు. భారతదేశంలో గణిత పరిశోధికుల్లో మేటిగా పేరుగాంచిన మంగళ నార్లీకర్‌ గణితాన్ని సులభతరం జేసి మనసుకు హత్తుకునేలా బోధించేవారు. పెళ్లయిన పదహారు సంవత్సరాలకు ఆమె గణితశాస్త్రంలో పిహెచ్‌.డి చేశారు. వీరేగాక ఇటీవలి కాలంలో ఎందరో మహిళలు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఇస్రో రాకెట్‌ శాస్త్రవేత్త నందిని హరినాథ్‌ తన ఇరవై సంవత్సరాల సర్వీసులో 14మిషన్స్‌లో పనిజేశారు. మంగళ్‌యాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రక్షణ రంగ పరిశోధనల్లో పరిశోధనలు చేసి ‘అగ్ని’ క్షిపణి ప్రాజెక్టులకు నేతృత్వం వహించిన మహిళ టెస్సీ థామస్‌. క్షిపణి ప్రయోగాలను విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన టెస్సీని ‘క్షిపణి మహిళ’, ‘అగ్నిపుత్రి’గా పిలుస్తారు. మహికో విత్తన సం స్థలో పరిశోధనలు చేసిన ఉషా బార్వాలే తొలి జన్యుమార్పిడి ఆహారపంట వంగను ఉత్పత్తి చేస్తే.. జన్యుమార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి వచ్చే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచలనం సృష్టించింది సుమన్‌ సహాయ్‌. ఈమే ‘జీన్‌ క్యాంపేయిన్‌’ను స్థాపించి స్థానిక ప్రజల, రైతుల హక్కుల కొరకు, కార్పొరేట్ల నుండి వారికి రావలిసిన వాటా రాబట్టేందుకు విశేష కృషి చేశారు. అంటార్కిటికాను సం దర్శించిన తొలి మహిళా శాస్త్రవేత్త అదితి పంత్‌. కృత్రిమ గర్భధారణ పిండాల ప్రక్రియలను సుసాధ్యం చేసిన వారు ఇందిర హిం దూజా. అంతరిక్షనౌక కొలంబియా ప్రయోగ ప్రమాదంలో చనిపోయిన మిషన్‌ స్పెషలిస్టు కల్పనా చావ్లా... ఇలా ఎందరెందరో మహిళా శాస్త్రవేత్తలు వైజ్ఞానిక పరిశోధనలను సమున్నతం చేసి ప్రఖ్యాతిగాంచారు.


చదువులో, వృత్తిలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు మనకేం చెబుతున్నాయి? అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని మరీ మరీ విశదం చేస్తున్నాయి. స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత వుందో అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగంగా ఉన్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా సైన్సేకాదు ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయటానికి సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించవలసి ఉంది. బాలికలను సైన్స్ పట్ల ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవటం ఎంతైనా అవసరం. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్ష రహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి చేయూతనిస్తుంది. 

ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్‌

(రేపు జాతీయ సైన్స్‌ దినోత్సవం)

Updated Date - 2020-02-27T06:34:03+05:30 IST