ధోనీ ఎందుకు స్పెషల్?

ABN , First Publish Date - 2020-08-20T06:14:12+05:30 IST

మనక్రికెట్‌లో తరానికొక్కరుగా సికె నాయుడు, గవాస్కర్, కపిల్, సచిన్ లాంటి సూపర్‌స్టార్లు కనిపిస్తారు. వీరందరికీ పూర్తిగా భిన్నమైన స్పెషల్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్‌కు సంబంధించి అప్పటివరకూ...

ధోనీ ఎందుకు స్పెషల్?

సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టేనాటికి ధోనీ వయసు ఎనిమిదేళ్ళు. మిగతావారి లాగానే అతను కూడా సచిన్ బొమ్మ పెట్టుకుని క్రికెట్ ఆడినవాడే. కానీ ఆ క్రికెట్ దేవుడున్న జట్టుకు కెప్టెన్సీ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ పడలేదు. సచిన్ ఒక్కడే కాదు; గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే లాంటి మాజీ కెప్టెన్లు జట్టులో ఉన్నా కూడా సాఫీగా సారథ్యం వహించాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదయినా కొండంత ఆత్మవిశ్వాసం ధోనీ ప్రధాన ఆయుధం. ఒత్తిడిని తట్టుకోవడంలో అతను జెన్ మాస్టరే. గెలిచినప్పుడు ఉప్పొంగిపోడు, ఓటమికి కుంగిపోడు. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా కూల్‌గా డీల్ చేయడంలో అతని తరువాతే ఎవరైనా. మరే భారత కెప్టెన్ సాధించనన్ని ఘన విజయాలు ధోనీ తన ఖాతాలో వేసుకున్నాడంటే అందుకు ఈ ప్రత్యేక లక్షణమే ప్రధాన కారణం.


మనక్రికెట్‌లో తరానికొక్కరుగా సికె నాయుడు, గవాస్కర్, కపిల్, సచిన్ లాంటి సూపర్‌స్టార్లు కనిపిస్తారు. వీరందరికీ పూర్తిగా భిన్నమైన స్పెషల్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్‌కు సంబంధించి అప్పటివరకూ ఉన్న స్టీరియోటైప్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఒక కొత్త ఒరవడికి, కొత్త ధోరణికి నాంది పలికినవాడతను. ఆనాటి క్రికెటర్ల స్టయిల్‌కి భిన్నంగా పొడవాటి జులపాలతో జట్టులోకి అడుగుపెట్టిన ధోనీ, ప్రతీ విషయంలోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. టీ20 క్రికెట్ ఆవిర్భావం, టీమిండియాలోకి ధోనీ ఎంట్రీ దాదాపుగా ఒకేసారి జరగడం కాకతాళీయం కాదేమో. ఈ కొత్త ఫార్మాట్ వల్ల ఈ ఆటకు మరింత మాస్ అప్పీల్ వచ్చింది. ఆ ట్రెండ్‌కు అతికినట్టుగా సరిపోయాడు ధోనీ. సచిన్ క్లాస్ హీరో అయితే ఇతను మాస్ మహారాజు.  


ఒకప్పుడు మన దేశంలో క్రికెట్ కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరబాద్ లాంటి పెద్ద నగరాల నుంచి వచ్చిన క్రికెటర్లే భారత జట్టుకు ఆడేవారు. అలాంటి నగరాల్లోని సంపన్న, మధ్య తరగతి కుటుంబాలనుంచి ఈ క్రికెటర్లు వచ్చేవారు. కానీ ధోనీ సంగతి వేరు. అతను క్రికెట్లో ఎలాంటి చరిత్ర లేని జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చాడు. అక్కడ హాకీ, ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడతారు. ఒకే ఒక టెస్ట్ ఆడిన రమేష్ సక్సేనా మినహా అతనికి ముందు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వేరే క్రికెటర్ ఎవరూ ఇండియాకు ఆడలేదు. ధోనీది దిగువ మధ్య తరగతి కుటుంబం, తండ్రి ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. వారి కుటుంబంలో క్రికెటర్లెవరూ లేరు. ధోనీకి గాడ్‌ఫాదర్లు కూడా లేనే లేరు. అయినా సరే, ఆ మారుమూల ప్రాంతంలోని తన ధనాధన్ బ్యాటింగ్ సౌండు ప్రపంచానికంతా వినబడేలా చేయగలిగాడు. అతను టీమిండియాకు ఆడటమే కాకుండా కెప్టెన్ కూడా కాగలగడం నిజంగా ఓ అద్భుతమే. ధోనీ ఎదుగుదల చిన్న పట్టణాలలోని క్రికెటర్లకు స్పూర్తినిచ్చింది. వాళ్ళలో ధైర్యం నింపింది. ఆ స్ఫూర్తితోనే మురాద్ నగర్ నుంచి సురేష్ రైనా; మీరట్ నుంచి ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్; అలీగఢ్ నుంచి పియూష్ చావ్లా; బరోడా నుంచి ఇర్ఫాన్ పఠాన్; ఎర్నాకులం నుంచి శ్రీశాంత్ టీమిండియా తలుపు తట్టగలిగారు. మెట్రో నగరాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడింది. ఇదంతా ఒక నిశ్శబ్ద విప్లవమే.


మహి ఓ ‘మేనేజ్‌మెంట్ గురు’ లాంటివాడు. నాయకుడు ఎలా ఉండాలి, సహచరులతో ఎలా వ్యవహరించాలి అన్నవి అతన్ని చూసే నేర్చుకోవాలి. సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టేనాటికి ధోనీ వయసు ఎనిమిదేళ్ళు. మిగతావారి లాగానే అతను కూడా సచిన్ బొమ్మ పెట్టుకుని క్రికెట్ ఆడినవాడే. కానీ ఆ క్రికెట్ దేవుడున్న జట్టుకు కెప్టెన్సీ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ పడలేదు. సచిన్ ఒక్కడే కాదు; గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే లాంటి మాజీ కెప్టెన్లు జట్టులో ఉన్నా కూడా సాఫీగా సారథ్యం వహించాడు. తన బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదయినా కొండంత ఆత్మవిశ్వాసం ధోనీ ప్రధాన ఆయుధం. అదే అతన్ని ముందుకు నడిపించింది. జట్టు నాయకత్వం వదిలేశాక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఎలాంటి బాదరబందీ లేకుండా జట్టులో ఒదిగిపోయాడు. కొత్త కెప్టెన్‌తో అతను ఎంత బాగా కలగలిసిపోయాడంటే, ధోనీ లేకుండా బరిలోకి దిగడం కోహ్లీకి కష్టమైపోయింది. ఇక వత్తిడిని తట్టుకోవడంలో అతను జెన్ మాస్టరే. గెలిచినప్పుడు ఉప్పొంగిపోడు, ఓటమికి కుంగిపోడు. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా కూల్‌గా డీల్ చేయడంలో అతని తరువాతే ఎవరైనా. మరే భారత కెప్టెన్ సాధించనన్ని ఘన విజయాలు ధోనీ తన ఖాతాలో వేసుకున్నాడంటే అందుకు ఈ ప్రత్యేక లక్షణమే ప్రధాన కారణం. ‘మహి వెంట ఉంటే యుద్ధానికి వెళ్ళడానికైనా సిద్ధమే’ అంటాడు భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కర్‌స్టెన్. 


మహి దగ్గర మంత్ర దండమేదో ఉంది. సాదాసీదాగా కనిపిస్తూ అసాధారణ ఫలితాలు రాబట్టగల ‘మహేంద్ర జాలం’ అతనికి తెలుసు. ప్రపంచ కప్ ఫైనల్లో, ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ని పక్కనబెట్టి తాను బ్యాటింగ్‌కెళ్ళి గెలిపించగలడు. ఇంకో ఫైనల్లో అనామకుడి చేత ఆఖరు ఓవర్ వేయించి ఒప్పించగలడు. మ్యాచ్‌ని ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్ళి ఫినిషింగ్ టచ్ ఇవ్వగలడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇండియా ఆడుతున్నప్పుడు క్రికెట్ స్కోర్ అడుగుతుండేవారట. మన టీమ్ కొంచెం కష్టాల్లో ఉందని చెబితే, ‘‘ధోనీ ఉన్నాడుగా అతను చూసుకుంటాడులే’’ అనేవారట. ఆయనే కాదు, వంద కోట్ల మంది అభిమానులు కూడా అదే మ్యాజిక్ కోసం చూసేవారు.


వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడకపోవడం ధోనీ మరో స్పెషాలిటీ. సచిన్ గురించి మాట్లాడేటప్పుడు అతని బ్యాటింగ్ రికార్డులు గుర్తుకొస్తాయి. కానీ ధోనీ గురించి చెప్పినప్పుడు అతను గెలిచిన ట్రోఫీల ప్రస్తావనే వస్తుంది. ఆ ట్రోఫీలు అందుకున్నాక కూడా వాటిని జూనియర్ ఆటగాడికి ఇచ్చేసి, గ్రూప్ ఫోటోలో ఓ మూలన నిలబడేవాడు. అతను 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. వంద పూర్తి చేయాలని ప్రయత్నం చేయలేదు. వన్‌డేల్లో కూడా 199 మ్యాచ్‌లకు సారథ్యం వహించాక కెప్టెన్సీ వదిలేశాడు (అయితే రెండేళ్ళ క్రితం 200వ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది) ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమణ టైములో కూడా ఫేర్‌వెల్ మ్యాచ్ లేదు, ఫేర్‌వెల్ స్పీచ్ లేదు. రెండే రెండు వాక్యాల్లో రిటైర్మెంట్ ప్రకటించి పడమటి సంధ్య వైపు పయనమైపోయాడు. దటీజ్ ధోనీ. అతని రూటే వేరు... మై వే, మహి వే.


సి.వెంకటేష్‍

(వ్యాసకర్త క్రీడా వ్యాఖ్యాత)

Updated Date - 2020-08-20T06:14:12+05:30 IST