‘బెకా’ ఒప్పందంతో లాభమెవరికి?

ABN , First Publish Date - 2020-11-13T05:42:15+05:30 IST

భారత్‌–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ఇటీవల అమెరికాతో భారత్ చేసుకున్న ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్’ (బెకా) అత్యంత కీలకమైనది...

‘బెకా’ ఒప్పందంతో లాభమెవరికి?

అమెరికాతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ‘బెకా’ ఒప్పందంతో భారత్‌ భుజాల మీద తుపాకి పెట్టి చైనామీదకు బుల్లెట్ ప్రయోగించడంలో అమెరికా సఫలమైంది. ఈ ఒప్పందం భారతదేశానికి లబ్ధి చేకూర్చేదే అయినప్పటికీ, అంతకంటే ముఖ్యమైన మన రక్షణ సంబంధమైన కీలక సమాచారం అమెరికాకు చేరదని నమ్మకం ఏమిటి? ఈ రహస్యాలు అమెరికా ద్వారా మన దేశ శత్రువులకు చేరదనే నమ్మకం కూడా లేదు. ఇది మన రక్షణ వ్యవస్థకే అతిపెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు.


భారత్‌–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ఇటీవల అమెరికాతో భారత్ చేసుకున్న ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్’ (బెకా) అత్యంత కీలకమైనది. గతంలో చేసుకున్న జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (జిసోమియా), లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (లెమోవా), కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (కామ్కాసా)లతో కలిపి, రక్షణరంగంలో అమెరికాతో చేసుకున్న నాలుగవ ఒప్పందం ఇది. రెండు దేశాల మధ్య లోతైన ఈ సైనిక సహకారం చైనాకు హెచ్చరిక వంటిది. 


ఈ ఒప్పందం భారతదేశానికి జియోస్పేషియల్ డేటాతో పాటు, గణనీయమైన సైనిక సమాచారాన్ని స్వీకరించడానికి అవకాశం కలిపిస్తుంది. స్వయంచాలక వ్యవస్థలు, క్షిపణులు, సాయుధ డ్రోన్‌ల వంటి ఆయుధాల ఖచ్చితత్వాన్ని పెంచే అమెరికన్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్‌కు రియల్ టైమ్ యాక్సెస్ పొందడానికి బెకా మనకు సహాయం చేస్తుంది. పటాలు, ఉపగ్రహ చిత్రాలపై సమాచారాన్ని పంచుకోవడం ద్వారా స్థలాకృతి, ఏరోనాటికల్ డేటా, నావిగేషన్‌ల ఖచ్చితమైన సమాచార సేకరణకు సహాయపడే అధునాతన ఉత్పత్తులను పొందడానికి ఇది భారతదేశానికి సహాయపడుతుంది. భారతీయ క్షిపణులను నావిగేట్ చేయడానికి అధిక నాణ్యత గల జిపిఎస్ వ్యవస్థ ఉపకరిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడంలోనూ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకం. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధనౌకల కదలికలను నిశితంగా పరిశీలించగల సామర్థ్యాన్నీ భారత్‌ పొందుతుంది. వాస్తవానికి దశాబ్దం పాటు ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలలో బెకా అనేకసార్లు ప్రస్తావనల్లోకి వచ్చింది. కాని దేశంలో వర్గీకృత సమాచారం రక్షణ, ప్రయోగశాలలను నిర్వహించడంపై భద్రతా దళాలు లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న గత యుపిఎ ప్రభుత్వం ఈ ఒప్పందంపై శ్రద్ధ చూపలేదు. కాలక్రమేణా అనేక దఫాలుగా చర్చలు జరిగి అనుమానాలు నివృత్తి అయ్యాయి. లెమోవ ఒప్పందం రెండు దేశాల మధ్య నమ్మకాన్ని ఇనుమడింపజేసి, తదనంతర కాలంలో మరో రెండు ఒప్పందాలపై సంతకాలకు మార్గం సుగమం చేసింది. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో బొంబాయిలో అమెరికన్ విమానాలకు ఇంధనం నింపడానికి సహాయపడడం, తరువాత కాలంలో సెప్టెంబర్ 11 దాడుల అనంతరం ఉగ్రవాదంపై అమెరికా నిర్వహించిన యుద్ధ సమయంలో ఆ దేశ యుద్ధనౌకలను భారతీయ ఓడరేవులలోకి అనుమతించడం వంటి అంశాలు లెమోవా, కోంకాసా ఒప్పందాలకు ముందస్తు అనుకూల చర్యలు.


ఆర్టికల్ 370 రద్దు అనంతరం చైనా, పాకిస్తాన్‌లు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డాయి. ఈ జూన్‌లో 20 మంది భారత సైనికులను హతమార్చి చైనా కయ్యానికి కాలు దువ్వింది. ఉభయదేశాల మధ్యా ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో భారతదేశం రాఫెల్ యుద్ధ విమానాలను సైతం సత్వరంగా రప్పించుకుంది. చైనాపై అసహనంతో ఉన్న అమెరికాకు ఆ దేశం మీద పై చేయి సాధించటానికి బెకా ఒప్పందం పరోక్షంగా ఉపకరిస్తుంది. లద్దాఖ్‌లోని 38,000 చదరపు కిలోమీటర్ల భారతభూభాగాన్ని టిబెట్‌ ఆక్రమించడంతో పాటు, అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ చైనాగా తన జాతీయ పటాలలో మార్పులు చేసుకుంది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ను సవాలు చేయడానికి చైనాకు వ్యతిరేకంగా జపాన్, యుఎస్, ఆస్ట్రేలియాతో కలసి భారత్ (క్వాడ్‌) పనిచేస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా విశ్వసనీయత పెంచడానికి భారతదేశం వంటి భాగస్వాములు దానికి అవసరం. అమెరికా ఒక దేశానికి అతిగా సహాయపడుతోందంటే భవిష్యత్తులో సదరు దేశం నుండి పెద్ద మొత్తంలో ఏదో ఆశిస్తున్నదనే అర్థం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఫిబ్రవరిలో ఇండియా సందర్శించినప్పుడు ట్రంప్ భారతదేశాన్ని ఎన్నో రకాలుగా కొనియాడాడు. కానీ, మొన్నటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారతదేశాన్ని రష్యా, చైనాలతో కలిపి దుమ్మెత్తిపోశాడు. అమెరికాతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ‘బెకా’ ఒప్పందంతో భారత్‌ భుజాల మీద తుపాకి పెట్టి చైనామీదకు బుల్లెట్ ప్రయోగించడంలో అమెరికా సఫలమైంది. ఈ ఒప్పందం భారతదేశానికి లబ్ధి చేకూర్చేదే అయినప్పటికీ, అంతకంటే ముఖ్యమైన మన రక్షణ సంబంధమైన కీలక సమాచారం అమెరికాకు చేరదని నమ్మకం ఏమిటి? ఈ రహస్యాలు అమెరికా ద్వారా మన దేశ శత్రువులకు చేరదనే నమ్మకం కూడా లేదు. ఇది మన రక్షణ వ్యవస్థకే అతిపెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు. అమెరికా గతంలో భారతదేశంతో చేసుకున్న లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంటునే లెమోవాగా, సిస్మోవాను అవసరాలకు అనుగుణంగా కోంకాసాగా మార్చారు. ఇక్కడ ఏ మార్పైనా అమెరికా అభీష్టా నికి అనుగుణంగానే జరుగుతోంది.

జయప్రకాశ్ అంకం

Updated Date - 2020-11-13T05:42:15+05:30 IST