‘సంపద సృష్టి కర్తలు’ ఎవరు?

ABN , First Publish Date - 2020-02-12T07:14:24+05:30 IST

ప్రభుత్వం, ప్రతి యేటా తనకు వచ్చే ఆదాయాల్నీ, అందులోనించి తన జనం కోసం తను పెట్టబోయే ఖర్చుల్నీ, ‘బడ్జెట్’ పేరుతో, తన డబ్బు ముచ్చట్లని తన జనాభాకి వినిపించాలనుకుంటుంది. ఏటా దీని పని ఇదే!..

‘సంపద సృష్టి కర్తలు’ ఎవరు?

ప్రభుత్వం ప్రశంసించిన ‘సంపద సృష్టి కర్తలు’ ఎవరు? ప్రపంచం లో ‘శత కోటీశ్వరుల జాబితా’ను, ప్రచురించే ‘ఫోర్బ్స్’ పత్రిక గుర్తించిన భారత దేశపు పెట్టుబడి దారులే ఆ సంపద సృష్టి కర్తలు.

ప్రభుత్వం, ప్రతి యేటా తనకు వచ్చే ఆదాయాల్నీ, అందులోనించి తన జనం కోసం తను పెట్టబోయే ఖర్చుల్నీ, ‘బడ్జెట్’ పేరుతో, తన డబ్బు ముచ్చట్లని తన జనాభాకి వినిపించాలనుకుంటుంది. ఏటా దీని పని ఇదే!

బడ్జెట్‌కి కొన్ని రోజుల ముందు, గత సంవత్సరంలో, దేశంలో ఆర్ధిక పరిస్తితులు ఎలా ఉండినాయో, రాబోయే సంవత్సరంలో ఎటువంటి ఆర్ధిక విధానాలు పాటించాలో తెలిపే, ఒక నివేదికని తయారు చేయిస్తుంది ప్రభుత్వం. ఆ నివేదికే ‘ఆర్ధిక సర్వే’. ఆ ఆర్ధిక సర్వేని, బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ఒక రోజు ముందు, ఆర్ధిక మంత్రి పార్లమెంటులో పెట్టడం ఒక ఆనవాయితీ. ఆ సర్వే నివేదికలోనూ, బడ్జెట్టులోనూ వున్న అంకెలూ, శాతాలూ, అన్నీకూడా గందరగోళంగా ఉంటాయి. అందుకే, వాటి సమర్ధకులు ఒక రకంగానూ, వ్యతిరేకులు ఇంకో రకంగానూ వాటికి అర్ధాలు చెప్పుకుంటారు. ‘‘ఈ అర్ధం గాని గోల మనకెందుకులే’’ అని జనాలు క్రికెట్ మ్యాచో, డైలీ సీరియలో, స్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారమో చూస్తూ గంటలు గడుపుతుంటారు. పనుల కోసం పోయే వాళ్ళ సంగతి సరే. 

కానీ, తమ నిత్యజీవితాల మీద ప్రభావం చూపే ఆర్ధిక విషయాల గురించి జనాలు -అంటే లాభాలూ, కౌళ్ళూ, వడ్డీలూ, వగైరాల మీద కాక, జీతాల మీదా, స్వంత శ్రమల మీదా బతికేవాళ్ళు– తెలుసుకుని తీరాలి.

బడ్జెట్, ప్రజలకు ఎలా అనుకూలమో పాలక పార్టీ వాళ్ళూ, ఎలా వ్యతిరేకమో ప్రతి పక్ష పార్టీల వాళ్ళూ, ఎంతో కొంత చెబుతూనే వుంటారు. కానీ, రెండు పక్షాలవాళ్ళకూ ఉమ్మడిగా వున్న లక్షణం: ‘శ్రమ దోపిడీ’ అనే సత్యాన్ని అంగీకరించకపోవడం. ఆ సత్యాన్ని గ్రహించి, జనాలకందరికీ అర్ధమయ్యేలా చెప్పడం ఒక్క కమ్యూనిస్టులే చెయ్యగలరు. కానీ, ఓట్లకీ సీట్లకీ మాత్రమే పరిమితమయ్యే రాజకీయాల్లో మునిగి పోయే కమ్యూనిస్టులు ఆ పని చేయలేరు. అందుకే, ప్రభుత్వాలు ఆర్ధిక సర్వేలోనూ, బడ్జెట్టులోనూ అనేక అసత్యాలు రాయగలుగుతున్నాయి. వాటిని వివరించాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది. ప్రస్తుతానికి, కేవలం ఒకే ఒక అసత్యం గురించే ఈ వ్యాసంలో చెప్పుకుందాం. అదే ‘సంపద సృష్టి’. 

‘సంపద సృష్టి’ గురించి ఆర్ధిక సర్వేలోనూ, బడ్జెట్ ప్రసంగంలోనూ చాలా చెప్పారు. అంతకు ముందు, ఆగస్టు 15 నాటి ప్రధాని ప్రసంగంలో ఇదే వుందని గుర్తు చేశారు. ‘పెట్టుబడి దారులే సంపద సృష్టి కర్తలు (‘వెల్త్ క్రియేటర్స్’). వారిని    మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాల సృష్టి కర్తలు (జాబ్ క్రియేటర్స్ కూడా).’ – ఇదీ ప్రధాని అన్నది.

సంపద సృష్టి గురించి మాట్లాడేటప్పుడు, ఇద్దరు తత్వవేత్తల్ని పట్టుకొచ్చారు. రెండు వేల సంవత్సరాల నాటి తిరువళ్ళువార్ అనే తమిళ తత్వవేత్తనీ,  సంస్కృతంలో రాసిన కౌటిల్యుడనే ఆయన్నీ, వాళ్ళు రాసిన పద్యాలతో, శ్లోకాలతో సహా చూపించారు. 

శత్రువు అహాన్ని దెబ్బతీయాలంటే, ‘డబ్బు సంపాదించడాన్ని’ (‘‘మేకింగ్ మనీ’’) మించిన పదునైన ఆయుధం లేదని- తిరువళ్ళువార్, తన ‘తిరుక్కురళ్’ లో 76వ అధ్యాయంలో, 759వ పద్యంలో చెప్పాట్ట! నువ్వు, నీ శత్రువుని దెబ్బతియ్యాలనుకుంటే, ఆ శత్రువు కూడా నిన్ను దెబ్బతియ్యాలనుకోడా తిరువళ్ళువార్?ఈ దెబ్బ తియ్యడాల్ని నేర్పడం గొప్ప సంగతి ప్రభుత్వానికి నచ్చింది. 

ఇక కౌటిల్యుడైతే,  సంపద సృష్టి– అనేది, మానవ ప్రయత్నాలలో చాలా గొప్ప విషయం అన్నాట్ట! అసలు, మానవులు, సుఖంగా బ్రతకడానికి పనికొచ్చేది ఏది చేసుకున్నా, అది అవసరాలు తీరడంతో సరిపోతుంది, ‘సంపద’ దాకా వెళ్ళదు.

గత కాలపు తత్వవేత్తలు చెప్పిన దానిలో ప్రజలకు పనికి వచ్చేది ఏదైనా వుంటే తప్పక నేర్చుకోవలిసిందే. కానీ, ఈ తత్వవేత్తలు చెప్పిన ఈ తత్వాలలో పాలకులకు పనికి వచ్చేది వుంది తప్ప, ప్రజలకి పనికి వచ్చేది ఏమీ లేదు. ‘శ్రమ దోపిడీ’ అనే సత్యాన్ని గ్రహించని, వ్యతిరేకించని తత్వవేత్తలూ, ఆర్ధిక వేత్తలూ ఎన్ని చెప్పినా ప్రజలకు ఏమీ వొరగదు. 

ప్రభుత్వం ప్రశంసించిన ‘సంపద సృష్టి కర్తలు’ ఎవరు? ప్రపంచంలో ‘శత కోటీశ్వరుల జాబితా’ను, ప్రచురించే ‘ఫోర్బ్స్’ పత్రిక గుర్తించిన భారత దేశపు పెట్టుబడి దారులే ఆ సంపద సృష్టి కర్తలు.  

ఇప్పుడు మనం, సంపద అంటే ఏమిటో, అది ఎలా సృష్టి అవుతుందో ముందు చూసి, ప్రభుత్వం చెప్పే పెట్టుబడిదారులు నిజంగానే సంపద సృష్టి కర్తలేనా చూద్దాం. 

పెట్టుబడిదారీ సమాజంలో సంపద సరుకుల గుట్టల రూపంలో వుంటుంది. ఏ సరుకు తయారు కావాలన్నా (ఆ సరుకు వస్తువు రూపంలో వున్నా, ‘పని’ రూపం లో వున్నా, ఎలావున్నా), కావలిసింది ఏమిటి? భూమీ, గనులూ, ఫాక్టరీలూ వంటి ‘ఉత్పత్తి సాధనాలు’. కాని అవి అక్కడ ఉండగానే సరిపోదు. వాటిని ఉపయోగించి, సరుకుల్ని ఉత్పత్తి చెయ్యాలంటే, ‘శ్రమలు’ చేసే మనుషులు కావాలి. ఆ శ్రమల్లో కొన్ని శారీరక శ్రమలూ, కొన్ని మేధాశ్రమలూ. 

ఇప్పుడు సంపదని సృష్టించేది ఎవరో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. 

పెట్టుబడిదారుడు, ఒక ఉత్పత్తిని, ‘అమ్మకం కోసమే’ తయారు చేయించే టప్పుడు, దానికి అవసరమైన ఉత్పత్తి సాధనాలన్నిటినీ డబ్బుతోనే కొంటాడు. వాటి విలువలన్నీ స్పష్టంగా తెలుస్తూ వుంటాయి. దాన్ని 80 అనుకుందాం. అలాగే, ఇక్కడ శ్రామికులకు ఇచ్చే జీతాలు కూడా డబ్బు లెక్కలతో వుంటాయి. వాటిని 20 అనుకుందాం. ఆ ఉత్పత్తి కోసం అవసరమైనవి, ఆ 2 అంశాలే. అక్కడ మూడో అంశం ఏదీ వుండదు. ఆ 2 అంశాలూ కలిసి - పెట్టుబడి. అది, 80+20 = 100. అంటే, పెట్టుబడిగా ఎంత డబ్బు ఖర్చయిందో కూడా తెలుస్తూ వుంటుంది. ఆ ఉత్పత్తిని అమ్మితే ఎంత డబ్బు వచ్చిందో అది కూడా తెలుస్తుంది. అది 120 అనుకుందాం. లెక్కలన్నీ ఇలా వున్నప్పుడు, శ్రామికులు చేసిన శ్రమకి ఎంత విలువ వుండవచ్చో తెలుసుకోవడం చాలా తేలిక. కొత్త ఉత్పత్తి విలువలో నించి (120లో నించి), ఉత్పత్తి సాధనాల ఖర్చుని తీసివేస్తే (80ని తీసివేస్తే), మిగిలేది ఎంత? - 40. ఇదే, పని స్తలంలో శ్రామికులందరూ కలిసి చేసిన శ్రమకు విలువ. అందులో నించి శ్రామికులకు అందిన జీతాల్ని తీసివేస్తే (20ని తీసివేస్తే), మిగిలేది, శ్రామికుల అదనపు విలువ. అది 20.ఈ అదనపు విలువ పెట్టుబడి దారుడికి ఆదాయం. అదే అతనికి సంపద. ఒక పెట్టుబడిదారుడికి వర్తించే ఈ సూత్రం పెట్టుబడిదారులందరికీ వర్తిస్తుంది.

ఒక సంవత్సరంలో తయారైన మొత్తం ఉత్పత్తే ఆ సంవత్సరపు ‘సామాజిక సంపద’. 

ఒక సంవత్సరపు ‘సామాజిక ఉత్పత’ని 120 అనుకుందాం. (120ని 120 లక్షలు అనుకోవచ్చు, 120 కోట్లు అనుకోవచ్చు. సంఖ్యల్ని వీలైనంత తక్కువ స్థాయిలో తీసు కుంటేనే విషయాలు తేలిగ్గా అర్ధమవుతాయి.) సమాజంలో వున్న పెట్టుబడిదారులందరూ కలిసి తయారు చేయించిన ఉత్పత్తి అది. దాని పెట్టుబడి 100 అనుకుందాం. అందులో ఉత్పత్తి సాధనాల భాగం80. కార్మికుల జీతాల భాగం20. అదనపు విలువ20. మొత్తం ఉత్పత్తి విలువ 120.

పెట్టుబడిదారులు వాడే ‘గ్రాస్‌ నెట్‌’ అనే మాటలు వాడుతూ, మన అర్ధాలతో ఈ విషయాల్ని చెప్పుకుంటే, ఈ 120 విలువ గల మొత్తం ఉత్పత్తి'గ్రాస్‌' ఉత్పత్తి. ఇందులోంచి, దాని కోసం ఖర్చయిన 100 పెట్టుబడిని తీసేస్తే, మిగిలిన 20 విలువ గల ఉత్పత్తి 'నెట్‌' ఉత్పత్తి. ఈ సంపదని స్రుష్టించినది కార్మిక వర్గం. చేజిక్కించుకునేది పెట్టుబడిదారీ వర్గం. ‘సామాజిక సంపద’కి ఇంకో పేరు 'జాతీయ సంపద'. కానీ ఈ 2 మాటలూ కూడా అసలు నిజాన్ని మరుగు పరుస్తాయి. ఎలాగంటే: ‘సామాజిక సంపద’ అనే మాట, ఆ సంపద, సమాజానికంతటికీ సంబంధించి నది అనే అర్ధాన్ని ఇస్తుంది. అలాగే, ‘జాతీయ సంపద’ అనే మాట కూడా, ఆ సంపద, జాతి కంతటికీ సంబంధించినది అనే అర్ధాన్ని ఇస్తుంది. నిజానికి ఆ సంపదలో శ్రామికవర్గానికి అందేది జీతాల భాగం మాత్రమే. మిగిలిన దంతా పెట్టుబడిదారీ వర్గానికే. కానీ ‘సామాజిక సంపదా జాతీయ సంపదా’ అనే మాటల్లో ఆ తేడా లేమీ కనపడవు.

‘సంపద’ అనేది, శ్రమ చేసే జనాభాకి ‘జీతాల’ భాగం గానూ, శ్రమ చెయ్యని జనాభాకి ‘అదనపు విలువ’ భాగం గానూ విడిపోయే సమాజంలో, ఈ సామాజిక సంపదా, జాతీయ సంపదా అనే మాటలు, పూర్తిగా అర్ధ రహితమైన మాటలే! 

ఈ సత్యాన్ని గ్రహించనంతకాలమూ, ఆర్ధిక సర్వేలూ, బడ్జెట్టులూ మనల్నీ, తర్వాత తరాల్నీ మోసగిస్తూనే వుంటాయి. ఆ మోసాన్ని గ్రహించడమే వర్గ చైతన్యానికి గుర్తు. వర్గ చైతన్యం లేకపోతే,  అప్పటి దాకా, పెట్టుబడిదారీ ఆర్ధిక సర్వేలే, ఆర్ధిక శాస్త్రాలే నిలిచి వుంటాయి. అందుకే అంటాడు మార్క్సు, ‘కాపిటల్’ కి రాసిన ఒక ముందు మాటలో: ‘‘వర్గ పోరాటం ఇంకా గుప్తంగానే ఉన్నప్పుడు, లేదా అది అడపాదడపా మాత్రమే బయట పడుతున్న కాలంలో, పెట్టుబడిదారీ రాజకీయ ఆర్ధికశాస్త్రం, ఒక శాస్త్రంగా ఇంకా ఉండ గలుగుతుంది.’’ ‘సంపద సృష్టి కర్తలు’ ఎవరో తెలిసిందా ఇప్పుడు?

రంగనాయకమ్మ

Updated Date - 2020-02-12T07:14:24+05:30 IST