ఓబీసీల వర్గీకరణ ఎప్పుడు?
ABN , First Publish Date - 2020-08-20T06:08:53+05:30 IST
సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాలపరంగా వెనుకబడిన తరగుతుల వారికి స్వాతంత్య్రం 1990 ఆగస్టు 7న లభించింది. ఆనాటి ప్రధానమంత్రి వి.పి.సింగ్ మండల్ కమీషన్ నివేదికలోని...

ఇతర వెనుకబడిన కులాల వర్గీకరణకు సంబంధించి ఉత్తర్వుల కోసం దేశవ్యాప్తంగా ఓబీసీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ తన నివేదికను ఇంతవరకు ఇవ్వలేదు. ఈ కారణంగా తమకు వర్గీకరణ లబ్ధి మృగతృష్ణే అవుతుందేమోనని ఓబీసీలు ఆందోళన చెందుతున్నారు.
సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాలపరంగా వెనుకబడిన తరగుతుల వారికి స్వాతంత్య్రం 1990 ఆగస్టు 7న లభించింది. ఆనాటి ప్రధానమంత్రి వి.పి.సింగ్ మండల్ కమీషన్ నివేదికలోని ఒకే ఒక సిపారసు- ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) వారికి జాతీయస్థాయి ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సుదినమది. ఈ నిర్ణయం మూలంగా విపి.సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. ఈ రిజర్వేషన్ల అమలును పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. ఆర్థిక వెనుకబాటు తనం ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని గగ్గోలు పెట్టాయి. మండల్ కమీషన్ నివేదికను పూర్తిగా అమలు చేయాలని కాన్షీరాం డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలను చైతన్యపరిచి సోషలిస్ట్ బహుజన్ ఉద్యమాలకు బహుజన్ సమాజ్ పార్టీ ఊపిరి పోసింది.
ఓబీసీ రిజర్వేషన్ల అమలును సంపన్న వర్గాలు పూర్తిగా వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టాయి. కాంగ్రెస్, బిజెపి, ఉన్నతవర్గ ఆచార్యులు, శాస్త్రవేత్తలు విద్యార్థులను ఉసికొల్పి రోడ్లమీదకుతెచ్చి ఆత్మబలిదానాలకు ప్రోత్సహించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ ఓబీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మొక్కుబడిగా కమిషన్ ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టి, ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని మొండిగా వాదించారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగానైనా రిజర్వేషన్లు కల్పించాలన్న రాజ్యాంగ ప్రమాణాలకు బిజెపి మాత్రం వ్యతిరేకంగా నిలబడింది. ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని ఏకంగా ప్రచారం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లు న్యాయపరమైనవే అంటూ కమ్యూనిస్టులు మద్దతు తెలిపారు. అయితే అదే క్రీమీ లేయర్ ఇప్పుడు ఓబీసీల పాలిట శాపంలా మారింది 1950 నుండి సోషలిష్టులు కుల ఆధారిత రిజర్వేషన్లకు మద్దతునిచ్చారు. మండల్ సిఫారసులను అమలుచేయాలని ఉద్యమించారు. అప్పటి ప్రదాని విపి.సింగ్ పై ఒత్తిడి పెంచారు. మండల్ కమిషన్‌లోని అన్ని అంశాలను అమలు చేయక పోవడాన్ని తప్పుపట్టినారు.
2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు కొంత ఊరట లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ కావడం, సార్వత్రక ఎన్నికలలో హమీ ఇవ్వడమే అందుకు ప్రధాన కారణం. బిజెపి ఒక అడుగు ముందుకేసి బీసీల పక్షాన నిలిచి, చట్టబద్ధతలేని జాతీయ బీసీ కమీషన్‌కు రాజ్యంగ హోదా, అధికారాలను కల్పించినప్పటికీ ఫలితం కానరాలేదు. 1993 నుండి అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లపై మళ్ళీ కుట్ర మొదలయింది. ఉత్తర భారతదేశంలోని ఉన్నత కులాలు జాట్‌లు, పటేళ్ళు, మరాఠాలు; ఆంధ్రప్రదేశ్లోని కాపులు ఇతర అగ్రుకులాల వారు తమ ఓబీసీ జాబితాలో చేర్చాలని, సీజన్ల వారిగా రాజకీయ ఉద్యమాలు చేస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక 2019లో 103వ రాజ్యంగ సవరణ ద్వారా ఉన్నతవర్గాలలోని పేదలకోసం 10% శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.
ఓబీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం అందించే ప్రక్రియలను అడ్డుకునే చర్యలకే ప్రభుత్వాలు, కోర్టులు ప్రాముఖ్యతనిచ్చాయి ఇందులో భాగంగానే క్రీమీ లేయర్ అంశాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్నవారి ఆశలను వమ్ముచేసారు. క్రీమీ లేయర్ అమలును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇప్పటివరకు లభిస్తున్న సమాచారం ప్రకారం ఏ రంగంలో కూడా ఆయా బీసీ కులాల వారు తమ జనాభా దామాషా ప్రకారం అవకాశాలు పొందడం జరుగలేదు. మరోవైపు క్రీమీ లేయర్ సూత్రం వల్ల ఉన్నత విద్యా వ్యవస్థల్లో అభ్యర్థులు లేక రిజర్వేషన్ల సీట్లు నిండక అగ్రకులాల వారికే అదనపు కేటాయింపులు జరుగుతున్నాయి. బీసీలకు రాజ్యాధికారం కావాలి అనే నంగనాచి మాటలు చెప్పే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో 52% వున్న ఓబీసీలను ఎస్‌సి, ఎస్‌టిల మాదిరిగానే క్రిమిలేయర్ ఉపసంహరించుకొని విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలను కల్పించాలి, న్యాయపరమైన అడ్డంకులు వున్నా ఐక్యంగా ఉద్యమించి, ఎస్సీ, ఎస్టీ మాదిరిగానే బీసీల్లోని వివక్షను ఎదుర్కొంటున్న కులాలకు రక్షణగా అట్రాసిటీయాక్టు తీసుకు రావల్సిన అవసరం వుంది, దానికి కావాల్సిన రాజ్యాంగపరమైన అడ్డంకులను తొలగించాలి అని మేధావి వర్గం కోరుచున్నది.
బీసీల జనాభా గణాంకాలను శాస్త్రీయంగా రూపొందించి, రిజర్వేషన్ల శాతాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉందని కోర్టులు పదే, పదే చెప్పుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. బీసీ వ్యతిరేక దృష్టితో బీసీ జనాభా లెక్కలను గాని లేదా ప్రత్యేకంగా గణాంకాల సేకరణగాని జరిపేందుకు ఏ ప్రభుత్వమూ పూనుకోలేదు ఇది తేలేవరకు రిజర్వేషన్లపై సందిగ్ధత వీడే పరిస్థితి కానరావడం లేదు. ఇతర వెనుకబడిన కులాల విభజనకు సంబంధించి ఉత్తర్వుల కోసం దేశవ్యాప్తంగా ఓబీసీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జాబితాలోని అన్నికులాలకు న్యాయం జరిగే విధంగా 2017లో ఓబీసీలను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. రిటైర్డ్ జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. దాదాపు మూడు సంవత్సారాలు పూర్తయినా ఆ కమిషన్ తన నివేదిక ఇవ్వకపోవడం వల్ల ఓబీసీలకు వర్గీకరణ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అంతేకాదు జస్టిస్ రోహిణి కమిషన్ నిర్ణయాలపై సంపన్న శ్రేణుల ప్రభావం పడిందేమో అనే అనుమానం బీసీ విద్యావంతులలో మొదలయింది.
డా. సంగని మల్లేశ్వర్
జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం