లాక్‌డౌన్ తరువాత ఏమిటి?

ABN , First Publish Date - 2020-05-09T06:13:53+05:30 IST

మే 17న లాక్‌డౌన్ 3.0 ముగిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయవలసినదేమిటి? ఆయన ముందు రెండు ప్రత్యామ్నాయాలు వున్నాయి. ఒకటి- లాక్‌డౌన్ 4.0ని....

లాక్‌డౌన్ తరువాత ఏమిటి?

మే 17న లాక్‌డౌన్ 3.0 ముగిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయవలసినదేమిటి? ఆయన ముందు రెండు ప్రత్యామ్నాయాలు వున్నాయి. ఒకటి- లాక్‌డౌన్ 4.0ని ప్రకటించడం; రెండు- లాక్‌డౌన్ ఎత్తివేయడం. లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిపోవచ్చు. లాక్‌డౌన్ ఎత్తివేత ఆర్థిక వ్యవస్థకు లబ్ధిని సమకూర్చినా ప్రజారోగ్యానికి హాని సంభవిస్తుంది.


లాక్‌డౌన్‌కు నేడు 46వ రోజు. మరో 8 రోజుల్లో ఈ (మూడో) లాక్‌డౌన్ ముగియనున్నది. ఆ తరువాత ఏమిటి? ఈ విషయాన్ని తర్కించేందుకే నా యీ వ్యాసాన్ని ఉద్దేశించాను. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత మార్చి 24న జాతీయ టెలివిజన్ లో లాక్‌డౌన్ 1.0 (అది మొదటి లాక్‌డౌన్ అన్న సంగతి అప్పుడు మనకు తెలియదు)ని ప్రకటించినప్పుడు మూడు లక్ష్యాలను పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ సంక్రమణ వరుసకు భంగం కలిగించేందుకు కనీసం 21 రోజుల వ్యవధి చాలా కీలకంగా ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారని’ ప్రధానమంత్రి ఆ సందర్భంగా చెప్పారు. మరుసటి రోజు వారణాసిలో తన నియోజక వర్గ ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇలా అన్నారు: ‘మహాభారత యుద్ధం ముగియడానికి 18 రోజులు పట్టింది. కరోనా వైరస్ పై సమరం 21 రోజులు సాగుతుంది’. ‘సంక్రమణ వరుసకు భంగం కలిగించడం’, ‘ముగియడం’ అనేవి ప్రధాన పదాలు. ప్రధానమంత్రి మాటలను చాలా మంది ప్రజలు విశ్వసించారు. 21 రోజుల వ్యవధిలో మహమ్మారి అదుపులోకి వస్తుందని, వైరస్ పై పోరు తప్పకుండా విజయవంతమవుతుందనే భరోసా వారికి కలిగింది.


21 రోజుల్లో, కొవిడ్-19 సంక్రమణ వరుసకు భంగం కలిగించడం అసాధ్యమని వైద్య ఆరోగ్య నిపుణులకు బాగా తెలుసు. శాస్త్ర వాస్తవాలను ప్రధానమంత్రికి వివరించి, లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆయనకు నచ్చచెప్పారు. ఏప్రిల్ 14న ప్రధాని మోదీ జాతీయ టెలివిజన్ లో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ లాక్‌డౌన్ 2.0ని ప్రకటించారు. ‘కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మనం సరైన మార్గాన్ని ఎంచుకున్నామని గత కొద్దిరోజుల అనుభవాలు ధ్రువీకరించాయి... ఓర్పుగా ఉండడాన్ని కొనసాగిస్తూ నిపుణులు నిర్దేశించిన నిబంధనలను పాటిస్తే కరోనా లాంటి మహమ్మారిని సైతం మనం తప్పక ఓడించగలుగుతామ’ని మోదీ ఆ ప్రసంగంలో అన్నారు. ‘సరైన మార్గాన్ని ఎంచుకున్నాము’, ‘ఓర్పుగా ఉండడమూ’, ‘కరోనా మహమ్మారిని సైతం ఓడించగలం’అనేవి ప్రధాని ప్రసంగంలోని ప్రధాన మాటలు. ప్రధానమంత్రి ఆశాజనక మాటలను వైద్య, ఆరోగ్య నిపుణులు సంశయించారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజలను జాగృతపరచడమూ, శీఘ్రగతిన వైద్య, ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధిపరచుకోవడమే లాక్‌డౌన్ అసలు లక్ష్యాలని వారికి తెలుసు. సరే, నేను గతంలో చెప్పిన మాటలనే మళ్ళీ చెప్పదలుచుకున్నాను: లాక్‌డౌన్ అనేది ఒక చికిత్స కాదు; వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరే పరిస్థితులను ఎదుర్కోవడంలో అన్నివిధాల సంసిద్ధమయ్యేందుకు దోహదం చేసే విరామ కాలమది. 


ప్రభుత్వం అనుద్దేశపూర్వకంగా కొన్ని తప్పులు చేసింది. అవి చాలా కీలక మైన తప్పులు. లాక్‌డౌన్ 1.0 ప్రకటించడం అనివార్యమని ప్రజలకు ముందే తెలుసు. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను హఠాత్తుగా అమలులోకి తీసుకువస్తుందని వారు ఊహించలేకపోయారు. కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి ఆ మొదటి లాక్‌డౌన్‌ను విధించడం చాలా అనుచిత చర్య. మార్చి 25న ప్రకటించిన ఆర్థిక కార్యాచరణ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాలలో పైసా కూడా జమ చేయకపోవడం గర్హనీయం. వైరస్ వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే, వలస కూలీలు స్వరాష్ట్రాలలోని స్వస్థలాలకు వెళ్ళిపోయేందుకు అవసరమైన ప్రయాణ వసతులు కల్పించక పోవడం ఘోర తప్పిదం. ఈ తప్పుల ఫలితంగా ప్రజలకు ఎదురైన కష్టనష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.


కొన్ని ముఖ్య తేదీలలో వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య అధికారికంగా ఇలా వున్నది: మార్చి 24- 536 (మార్చి 25న లాక్‌డౌన్ మొదలయింది); ఏప్రిల్ 14- 10,815 (లాక్‌డౌన్ ముగిసింది, కొనసాగింది); మే 3 -40,263 (లాక్‌డౌన్ ముగిసింది, కొనసాగింది); మే 8- 56,342 (ఉదయం 8 గంటల వరకు). వైరస్ బారిన పడే వారే సంఖ్య ఇంకా పెరుగుతందని వైద్య, ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ 3.0 ని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించకపోవడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ద్వారా మూడో లాక్‌డౌన్ అమలులోకివచ్చింది. లక్ష్యాలను గానీ, నిష్క్రమణ వ్యూహాన్ని గానీ పేర్కొన లేదు. ఇది అసాధారణ మే గాక కలవరపెడుతున్న పరిణామం.


కరోనా వైరస్‌కు విరుగుడు అయిన వ్యాక్సిన్‌ను కనుగొనేంతవరకు ఈ భయానక అంటు వ్యాధి బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయులు సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) ని అభివృద్ధిపరచుకునేంతవరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే వుంటుందని కొందరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదటి లాక్‌డౌన్‌లో కంటే రెండో లాక్‌డౌన్‌లో వ్యాధి గ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. ఇక మూడో లాక్‌డౌన్ మొదటి ఐదు రోజుల్లోనే (మే 4 నుంచి 8 వరకు) రోజుకు సగటున 3215 మంది మేరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది. అదృష్ట వశాత్తు ఇతర దేశాలతో పోల్చుకుంటే వైరస్ సోకుతున్న వ్యక్తుల సంఖ్య మన దేశంలో చాలా తక్కువగా ఉంటున్నది. 130 కోట్ల జనాభాలో కరోనా బారినపడిన వారి ఇంకా వేలల్లోనే వుండడం గమనార్హం. కారణమేమిటి? బహుశా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరగడమే కావచ్చు. వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య కేవలం 3.36 శాతంగా మాత్రమే ఉన్నది.


మే 17న లాక్‌డౌన్ 3.0 ముగిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయవలసినదేమిటి? ఆయన ముందు రెండు ప్రత్యామ్నాయాలు వున్నాయి. ఒకటి- లాక్‌డౌన్ 4.0ని ప్రకటించడం; రెండు- లాక్‌డౌన్ ఎత్తివేయడం; ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలన్నిటినీ పునః ప్రారంభించడం; వస్తుసేవల సరఫరా వ్యవస్థలను మళ్ళీ క్రియా శీలం చేయడం; రోడ్, రైల్, విమాన సర్వీసులను అనుమతించడం; వైరస్ సోకిన వారందరికీ చికిత్స నందించేందుకు సంసిద్ధమవ్వడం. ధారవి (ముంబై మురికివాడ) లాంటి ‘కంటైన్ మెంట్ జోన్స్’లో ఆంక్షలను యథావిధిగా కొనసాగించవలసివుంటుంది. సదరు ప్రాంతాలలో కరోనా పాజిటివ్ వ్యక్తులనందరినీ క్వారంటైన్ కేంద్రాలకు లేదా ఆసుపత్రులకు తరలించినప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలను తప్పక కొనసాగించాలి.


లాక్‌డౌన్ కొనసాగించాలా లేదా ఎత్తివేయాలా అనే విషయమై నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. మొదటి ప్రత్యామ్నాయం అంటే లాక్‌డౌన్ 4.0ని ప్రకటించడం జరిగితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడానికి దారి తీస్తుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. వ్యాధి వ్యాప్తి తీవ్రత ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించడం జరిగింది. మహమ్మారి ప్రభావం స్వల్పంగా ఉన్న ప్రాంతాలలో అనేక హెచ్చరికలతో పరిమిత సడలింపులనిచ్చినా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభానికి దోహదం జరగదు. గత 47 రోజుల్లో మరిన్ని సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు దివాలా అంచుకు చేరాయి. లక్షలాది పేదలు కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. వేలాది మధ్యతరగతి కుటుంబాలు రుణగ్రస్తమయ్యాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేయని పక్షంలో మరింత విస్తృత స్థాయిలో ఆంక్షల ఉల్లంఘింపు జరిగే అవకాశం ఎంతైనా వున్నది. ప్రజలు ఇప్పటి వలే ఇక ముందుకూడా ఓర్పుతో ఉండగలరని ఖాయంగా చెప్పలేము.


ఇక రెండో ప్రత్యామ్నాయం అంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం జరిగితే ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతుంది. అయితే వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశం ఎంతైనా వున్నది. గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ గానూ, ఆరెంజ్ జోన్స్‌ను రెడ్ జోన్స్‌గానూ పరిగణించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారం పడుతుంది. కొవిడ్ -19 ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతాయి. సాధ్యమైనంతవరకు తననుతాను రక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపైన పడుతుంది. ఇటువంటి దుస్తర పరిస్థితులలో నిర్ణయం, అందునా అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం దాదాపు అసాధ్యమైన విషయం. అయినప్పటికీ భారత ప్రజల శ్రేయస్సుకు విశేష దోహదం సమకూర్చే సరైన నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను.






పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-05-09T06:13:53+05:30 IST