సామాజికన్యాయంఏమైనట్లు?

ABN , First Publish Date - 2020-09-29T06:19:54+05:30 IST

తెలంగాణలో స్థాపించబోయే ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్లు ఉండవని, రీయింబర్స్‌మెంట్‌ లాంటి సహాయం కూడా ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు...

సామాజికన్యాయంఏమైనట్లు?

ఇటు తెలంగాణ అయినా లేదా అటూ కేంద్ర ప్రభుత్వ మైనా ఏ విలువలకు నిలబడతాయి అన్నదే ప్రశ్న. వేల సంవత్సరాలుగా ఆధిపత్య భావజాలం చేసిన అన్యాయం వల్ల కోట్లాదిమంది వందల సంవత్సరాలుగా విద్యకు దూరమయ్యారు. ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది రాజ్యాంగం ఆదేశించినట్లుగా అట్టడుగు వర్గాలకు విద్యను అందించే బదులు పాలకులు వెనకదారి పట్టారు. మొత్తం వ్యవస్థ మారి, ఒక ప్రత్యామ్నాయ మానవీయ సమాజం వస్తుందన్న స్వప్నం ఎంత దగ్గరుందో ఎంత దూరముందో తెలియదు కాని, ఉన్న వ్యవస్థలోనే కొంత న్యాయం జరగాలి అనే చిన్న కలలు కూడా ఛిద్రమవుతుంటే దేశ భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది.


తెలంగాణలో స్థాపించబోయే ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్లు ఉండవని, రీయింబర్స్‌మెంట్‌ లాంటి సహాయం కూడా ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రెండు మూడు దశాబ్దాల క్రితం ఇలా మాట్లాడడం సాధ్యం అయ్యేది కాదు. రిజర్వేషన్లు ఈ దేశంలో గత ఏడు దశాబ్దాలుగా ఒక సున్నితమైన అంశంగా మారడం వల్ల రాజకీయాలు వాటి జోలికి పోవడానికి భయపడేవి. ఇవాల్టి వరకు వాటి చుట్టూ చాలా రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. నిజానికి  రిజర్వేషన్ల ద్వారా వెనకబడిన వర్గాలు ప్రయోజనం పొందడంతో పాటు కొంత కాకున్నా కొంత సామాజికంగా మార్పు వచ్చింది. ఈ వర్గాలు లేదా కులాల నుంచి ఎదిగిన విద్యావంతులు, మేధావులలో మాట్లాడగలిగిన వాళ్లు, రాసేవాళ్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఈ అన్ని కులాలు తమ తమ కులాల వారీగా సంఘటితమై ఉన్నాయి. వారిలో చైతన్య స్థాయి కూడా పెరిగింది. ఇలాంటి సామాజిక పరిణామ సందర్భంలో బాహాటంగా మేం రిజర్వేషన్ల విధానాన్ని అంగీకరించమని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెగేసి చెప్పేదాక వచ్చాయంటే, ప్రభుత్వాలు వాటికి మద్దతు ఇస్తున్నాయంటే, పెట్టుబడిదారీ వర్గాలకు తమ ఆధిపత్యం మీద చాలా విశ్వాసం పెరిగింది.


ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానం- 2020లో కూడా రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. ఈ విధాన ప్రకటనలో కులం గురించి కాని, సామాజిక న్యాయం గురించి కాని, సామాజిక మార్పు గురించి కాని ప్రస్తావన లేదు. గతంలో ప్రకటించిన విద్యావిధానాలలో 1964–-66లో కొఠారి కమిషన్‌, 1985-–87లో పి.వి. నర్సింహరావు రూపకల్పన చేసిన నూతన విద్యావిధానాలు రాజ్యాంగ విలువలు, ప్రమాణాల్ని పాటించడమే కాక సామాజిక న్యాయం మార్పునకు సాధనంగా గుర్తింపు పొందాయి. మొదటి దఫా అటు కేంద్రం, ఇటు తెలంగాణ విధాన ప్రకటనలో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించడమే కాక రిజర్వేషన్లు ఉండవు అని అనడం రాజకీయాలలో వచ్చిన ఒక కొట్టొచ్చిన మార్పుగా కనిపిస్తోంది.


స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజికన్యాయం లోతైన ప్రజల ఆకాంక్ష. గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, అజాద్‌ అందరూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తికి, ఆకాంక్షలకు చిహ్నాలే. స్వాతంత్య్రం సిద్ధించినా సామాజికన్యాయం అమలవుతుందా అన్న అంశం మీద బాగా ఆందోళన చెందిన వ్యక్తి డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌. ఒకవైపు వలస పాలనకు వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమం జరుగుతున్నా, కులవ్యవస్థ నిర్మూలించబడుతుందా, ఆత్మగౌరవంతో మనుషులు జీవిస్తారా, ప్రజాస్వామిక విలువలు వికాసం చెందుతాయా అని ఆలోచించి వందల సంవత్సరాలు వివక్షకు గురై మనుషులుగా కూడా గుర్తింపబడని అట్టడుగు దళితుల సమానత్వం కోసం ఆయన పోరాడారు. దళిత సమస్య పరిష్కారమైతేనే దేశానికి నిజమైన స్వాతంత్ర సిద్ధి అని చాలా దూరదృష్టితో యోచించిన దార్శనికుడు డా. అంబేద్కర్‌.


రాజ్యాంగాన్ని రూపొందించడానికి డా. అంబేద్కర్‌ని రాజ్యాంగ రచనా కమిటికి చైర్మన్‌గా ఎన్నుకోవడం ఒక కీలకమైన నిర్ణయం. ఆయనకుండే సామాజిక, చారిత్రక అవగాహన, దూరదృష్టి వల్ల స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలకు రాజ్యాంగ పీఠికలో, అలాగే ఆదేశిక సూత్రాలలో స్థానం దక్కింది. ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, చట్టబద్ధ పాలనను వాగ్దానం చేస్తే, ఆదేశిక సూత్రాలు సమానత్వాన్ని, సహజీవనాన్ని, సామాజిక న్యాయాన్ని వాగ్దానం చేసాయి. సాధారణంగా రాజ్యాంగాలు చట్టబద్ధ చట్రానికి ప్రమాణంగా ఉంటాయి. ఆదేశికసూత్రాలు ప్రపంచంలోని చాలా రాజ్యాంగాలలో లేవు. దేశాన్ని ఎలా పాలించాలి అనే కాక, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అనే దిశా నిర్దేశం చేయడం చాలా అరుదు. వందల సంవత్సరాలు వివక్షాపూరిత, నిచ్చెనమెట్ల సమాజాన్ని మార్చడంలో రాజ్యం కీలకపాత్ర నిర్వహించి ఈ మార్పుల్ని తమ విధానాల ద్వారా సాధించాలని, సాధిస్తుందని భావించారు. 


ఇలా సామాజిక మార్పునకు దోహదపడే సాధనాలలో విద్య అత్యంత కీలకమైనది.మళ్లీ తెలంగాణకు వస్తే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా విద్య చర్చలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ, అలాగే మన్‌మోహన్‌సింగ్‌, చిదంబరం నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేటు విద్యను పెంచి పోషించాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్య పూర్తిగా ప్రైవేట్‌పరం కావడంతో కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం సాధించాయి. అక్కడ చదివితే తప్ప భవిష్యత్తు లేదు అని తల్లిదండ్రులు భ్రమించే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో 1980లలోనే విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పడి సమాజాన్ని నిరంతరంగా హెచ్చరిస్తూ వస్తోంది. తన శక్తి మేరకు కామన్‌ స్కూల్‌ కాన్‌సెప్ట్‌ని ప్రచారం చేయడంతో పాటు విద్య సంపూర్ణంగా సామాజిక రంగంలో ఎందుకుండాలో వాదిస్తూ, ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి తన వంతు కృషి చేసింది, చేస్తోంది.


విద్యా పరిరక్షణ ఉద్యమమైతేనేమి, తెలంగాణాలో అప్పటికే విలసిల్లిన ప్రజాస్వామ్య సంస్కృతి అయితేనేమి, ఏ కారణం వల్లైనా విద్య విస్తృత చర్చకు రావడమే కాక కె.జి. టు పి.జి. ఉచిత విద్య అనే నినాదం ఉద్యమకాలంలో ముందుకు వచ్చింది. ఉద్యమంలో ప్రధాన భాగస్వామి అయిన తెరాస పార్టీ, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ నినాదాన్ని ఉద్యమంలో భాగం చేశారు. తీరా తెలంగాణ సాధించిన తర్వాత ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలు, ప్రైవేట్‌ స్కూళ్లు కొనసాగడమే కాక మరింత విస్తరించాయి. ఇక ఉన్నతవిద్య గురించి రాయడానికే బాధ వేస్తుంది. విశ్వవిద్యాలయాలకు సరైన గ్రాంట్స్‌ లేవు, సిబ్బంది నియామకం లేదు, ఏళ్ళ తరబడి విసిలు లేరు, ప్రతిష్ఠ కలిగిన సంస్థలు కూడా కూలబడిపోయాయి. తెలంగాణకు అపూర్వమైన సేవలనందించిన దాదాపు నలభై ఎయిడెడ్‌ కాలేజీలు చితికి పోయాయి. ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనలో చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తే దానికోసమే తెలంగాణలోని విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేశారా అనిపిస్తుంది. ఒక ప్రజాస్వామిక ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగిన పార్టీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.


నియో లిబరలిజం 1980ల నుంచే దేశాన్ని కబళిస్తోంది. అది విద్యను సేవారంగం నుంచి మార్కెట్‌ లాభాల బాటలో పడేసింది. దేశవ్యాప్తంగా విద్యాలయాలు విపరీతంగా లాభాలు పోగుచేసుకోవడం ప్రారంభించాయి. విద్యారంగం ఒక రకంగా రిస్క్‌లేని వ్యాపారం. ప్రభుత్వాలు వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాయి. పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి కోట్లాది రుణాలు తీసుకుని భవనాలు కడతారు. అది ఒక రకంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా. ఏ కారణం వల్లైనా సంస్థ నడవకపోతే ఆస్తి మిగులుతుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెలంగాణాలో రిజర్వేషన్లు కూడా కల్పించం అని అంటే అంగీకరించవలసిన అవసరం ఏమొచ్చింది. ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేకపోవడం వల్లే తెలంగాణ వెనకబడిపోయిందా. ఇది తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి పూర్తి విరుద్ధం కాదా. ఆ మాటకొస్తే రాజశేఖర్‌ రెడ్డిలాంటి ముఖ్యమంత్రి టాటాను ఒప్పించి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌ సంస్థను హైదరాబాద్ కు తెప్పించారు. ఆ సంస్థ ఇక్కడకు రావడానికి సుముఖంగా లేదు. అయినా టాటాతో స్వయంగా మాట్లాడడం వల్ల ఆ ఇన్‌స్టిట్యూట్‌ వచ్చింది. బలహీనవర్గాల విద్యార్థుల కోసం సంస్థ ప్రత్యేకంగా పని చేస్తుంది. అన్ని సామాజిక ప్రయోజనాలతో కూడిన అంశాలను మాత్రమే బోధిస్తుంది. నేను కూడా కొంతకాలం సంస్థలో ఏ ప్రతిఫలం తీసుకోకుండా పని చేశాను. ఇప్పుడు ఆ సంస్థ చావుబతుకుల మధ్య ఉంది. అలాగే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ స్థాపించిన సిఎస్‌డికి అకస్మాత్తుగా గ్రాంట్సు ఆపేయడం వల్ల ఆ సంస్థ భవిష్యత్తు అయోమయంగా మారింది. సామాజికన్యాయం కోసం పని చేసే సంస్థలను పట్టించుకోకుండా లాభాలు పోగు చేసుకునే ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఎందుకు ప్రొత్సహిస్తున్నారో జవాబు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.


కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా లేదు. ఎప్పుడు చూసినా గత వైభవం గురించి మాట్లాడే పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు మాట్లాడినా గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల, నలందా గురించి ఏకరువు పెడతారే తప్ప; ఇప్పటి, భవిష్యత్‌ సమాజం గురించి మాట్లాడరు. ఏమన్నా అంటే 21 శతాబ్ది మేధావులను తయారు చేస్తాం, ప్రపంచంతో పోటీలు పడే సంస్థలు నిర్మిద్దాం అంటారే తప్ప ఎలాంటి భారత సమాజాన్ని స్వప్నిస్తున్నారో స్పష్టంగా చెప్పరు. ఇక నూతన విద్యావిధానం అమలులోకి వస్తే పేదవర్గాల విద్య భవిష్యత్తు ఏమిటో తెలియదు. ఈ విధానంలో సామాజికన్యాయం గురించిన ప్రస్తావన లేదు, రాజ్యాంగ విలువల ప్రస్తావన లేదు, సమాఖ్య దేశమన్న జాగ్రత్త లేదు. విద్యలో మార్కెట్‌ పాత్రకు సాధికారత కల్పించారు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించం అని అంటూనే దాతృత్వ ప్రస్తావన చేస్తున్నారు. ఒక కాలంలో టాటా, బిర్లాలు స్థాపించిన సంస్థలలో దాతృత్వ స్ఫూర్తి ఉంది. రిలయెన్స్‌, అదానీలకు ఆ స్ఫూర్తి ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. అంబానీ తాను స్థాపించబోయే విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల గ్రాంటు ముందే పొందారు.


ఇటు తెలంగాణ అయినా లేదా అటూ కేంద్ర ప్రభుత్వమైనా ఏ విలువలకు నిలబడతాయి అన్నదే ప్రశ్న. వేల సంవత్సరాలుగా ఆధిపత్య భావజాలం చేసిన అన్యాయం వల్ల కోట్లాదిమంది వందల సంవత్సరాలుగా విద్యకు దూరమయ్యారు. ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది రాజ్యాంగం ఆదేశించినట్లుగా అట్టడుగువర్గాలకు విద్యను అందించే బదులు పాలకులు వెనకదారి పట్టారు. మొత్తం వ్యవస్థ మారి, ఒక ప్రత్యామ్నాయ మానవీయ సమాజం వస్తుందన్న స్వప్నం ఎంత దగ్గరుందో ఎంత దూరముందో తెలియదుకాని, ఉన్న వ్యవస్థలోనే కొంత న్యాయం జరగాలి అనే చిన్న కలలు కూడా ఛిద్రమవుతుంటే దేశ భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతుంది.

ప్రొ. జి. హరగోపాల్‌

Updated Date - 2020-09-29T06:19:54+05:30 IST