వెబ్ సిరీస్‌లు కావు, బూతు బాగోతాలు

ABN , First Publish Date - 2020-06-11T06:29:02+05:30 IST

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే స్త్రీలను గౌరవించటంలో, నైతిక కట్టుబాట్లను పాటించటంలో, వస్త్రధారణలో మన దేశం నాలుగు మెట్లు పైనే ఉంటుంది. కానీ ఉన్న ఫళాన మనల్ని కిందకి లాగిపారేయటానికి, కళంకం తేవటానికి, సమాజంలో ఉచ్ఛనీచాలు చెరిపివేయటానికి...

వెబ్ సిరీస్‌లు కావు, బూతు బాగోతాలు

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే స్త్రీలను గౌరవించటంలో, నైతిక కట్టుబాట్లను పాటించటంలో, వస్త్రధారణలో మన దేశం నాలుగు మెట్లు పైనే ఉంటుంది. కానీ ఉన్న ఫళాన మనల్ని కిందకి లాగిపారేయటానికి, కళంకం తేవటానికి, సమాజంలో ఉచ్ఛనీచాలు చెరిపివేయటానికి ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కంకణం కట్టుకున్నాయి. వీటిలో ప్రసారమవుతున్న కొన్ని వెబ్‌సిరీస్‌ల్లో పచ్చి బజారు భాష వాడుతున్నారు. మహిళలను గౌరవించే ఈ సమాజంలో ఇక్కడ రాయటానికి వీలు లేని భాషలో వారిని సంబోధిస్తున్నారు. కెమెరా ఎదురుగా సంభోగిస్తున్నారు. ఇది భారతీయ సమాజంపై జరుగుతున్న సాంస్కృతిక దాడి.


మనిషి సంఘజీవి. ప్రతి మనిషికీ సమాజం కట్టుబాట్లు విధించింది. ఆఫీసులో, వీధిలో, నలుగురితో, కుటుంబ సభ్యులతో, సహ ధర్మచారితో, మనకంటే చిన్నవారితో, పెద్దవారితో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదూ ఇలాంటి నైతిక నియమాలు మనకి ఎక్కడా గోడల మీద రాసి కనిపించవు. ప్రభుత్వ జీవోల్లో పేర్కొనరు. ఇవన్నీ మన జీవన విధానంలో ఒక భాగం. భారతీయ సమాజంలో మనతోపాటే ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ మనుషులకే వర్తిస్తాయి. జంతువులకు వర్తించవు. ఎందుకంటే దేవుడు వాటికి బుద్ధి అనేది ఇవ్వలేదు. మనిషికి ఇచ్చాడు. దానిని ఈరోజు విడిచిపెట్టి నాలుగ్గోడల మధ్య పరిమితం కావాల్సిన సన్నివేశాలను నడిబజారులో చూపిస్తున్నారు. అందులోనూ కళాత్మకంగా చూపించటం లేదు. పాత సినిమాల్లో అత్యాచార సన్నివేశాన్నో, భార్యాభర్తల మధ్య శృంగారం ఘటననో చూపాల్సి వస్తే అశ్లీలత లేకుండా చూపెట్టేవారు. కానీ ఓటీటీలు పేరుతో వెబ్‌సిరీస్‌ రూపంలో విశృంఖలత్వాన్ని అతి జుగుప్సాకరంగా ప్రదర్శిస్తున్నారు. 


సినిమాలకు, టీవీ సీరియల్స్‌కు సెన్సార్ షిప్ ఎందుకు పెట్టారు? మద్యపానం చేసినా, ధూమపానం చేసినా ఆరోగ్యానికి హానికరం అని తెరపై ఎందుకు ప్రదర్శిస్తున్నారు? దాని ఉద్దేశం ఏంటి? వాటి లక్ష్యం ఏంటి? పడకగదిలో జరిగే సన్నివేశాలన్నింటినీ సినిమాల్లో ఎందుకని పూర్తిగా చూపించట్లేదు? హద్దు మీరితే సినిమాల్లో, సీరియల్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెన్సార్‌ బోర్డు ఎందుకు కత్తెర వేస్తోంది అలాంటి సన్నివేశాలకు? పత్రికల్లో, న్యూస్‌ ఛానెల్స్‌లో, రాజకీయాల్లో రాజకీయ విమర్శలు మాత్రమే ఎందుకు చేసుకుంటున్నారు? ఒకరిని ఒకరు పచ్చిబూతులు ఎందుకు తిట్టుకోవట్లేదు? మీడియా ఎందుకు అలాంటి బూతులను ప్రచురించదు?


కారణం ఒక్కటే. మనిషి అనే వాడికి బుద్ధి, సంస్కారం, సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత అనేది అవసరం. అవి ఉండాలి. వాటిని వదిలేయకూడదు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే స్త్రీలను గౌరవించటంలో, నైతిక కట్టుబాట్లను పాటించటంలో, వస్త్రధారణలో మన దేశం నాలుగు మెట్లు పైనే ఉంటుంది. కానీ ఉన్న ఫళాన మనల్ని కిందకి లాగిపారేయటానికి, కళంకం తేవటానికి, సమాజంలో ఉచ్ఛనీచాలు చెరిపివేయటానికి ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌ కంకణం కట్టుకున్నాయి. వీటిలోని కొన్ని వెబ్‌సిరీస్‌ల్లో పచ్చి బజారు భాష వాడుతున్నారు. మహిళలను గౌరవించే ఈ సమాజంలో వారిని ఇక్కడ రాయటానికి వీలు లేని భాషలో సంభోధిస్తున్నారు. కెమెరా ఎదురుగా సంభోగిస్తున్నారు. ఇది భారతీయ సమాజంపై జరుగుతున్న సాంస్కృతిక దాడి. 


అసలే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, స్త్రీలపై హింస పెరుగుతోంది, మైనర్లలో నేరప్రవృత్తి పెరుగుతోంది, నిర్భయ, దిశ లాంటి ఘటనలు పెచ్చు మీరుతున్నాయి. ఇలాంటి షోస్‌ చూసే నేరం చేశాం అని అనేక సందర్భాల్లో నేరస్థులు వెల్లడించిన ఉదాహరణలు ఉన్నాయి. ఇంటికో టీవి ఉంటుంది. అందులో ఎన్నో మనం ప్రతినిత్యం వీక్షించే అనేక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ వస్తాయి. ఇంట్లో అందరూ కలిసి వాటిని చూసే పరిస్థితి ఉందా? ఓ తల్లి కొడుకులతో కలిసి, ఓ తండ్రి కుమార్తెలతో కలిసి వాటిని చూడగలరా? అందులో వచ్చే వెబ్‌సిరీస్‌లో వాడే భాష అనకూడనిది, వినకూడనిది. అందులోని దృశ్యాలు కనకూడనివి. ఓ పక్క సినిమాలకు, సీరియల్స్‌కు సెన్సార్ పెట్టి మరోపక్క వీటిని విచ్చలవిడిగా టీవీల్లో జొప్పిస్తుంటే వీటిపై నియంత్రణ అవసరం లేదా? సెన్సార్‌ షిప్‌ చేయలేమా? అందుకు చట్టాలు అడ్డు వస్తాయా? అయితే మారుద్దాం. ఒక్క హైందవ ధర్మమే కాదు ఇస్లాం అయినా ఏ ధర్మమైనా అలాంటి భాషను, దృశ్యాలను ప్రోత్సహిస్తుందా? సమాజంలో హింసకు, లైంగిక దాడులకు, విశృంఖలత్వానికి దారితీసే వారిని కట్టడి చేసే వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలే లేవా ఇంత పెద్ద దేశంలో? వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే చివరకి ఇక్కడ కూడా బాధితపక్షంలో నిలిచేది మహిళే అవుతుంది. 


కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్లు హిందు మతాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వెబ్ సిరీస్‍లను ప్రచారం చేయబోతున్నాయి. అభిమానులకు, ప్రజలకు ఆదర్శవంతంగా, భారతీయ సంప్రదాయం, సంస్కృతిని కాపాడాల్సిన కొంతమంది సెలెబ్రెటీలు వారి స్వార్థ ప్రయోజనం కోసం, సంపాదన కోసం ఎంతో దిగజారిపోతున్నారు. దేశంలో లక్షలాదిమంది అభిమానులున్న ఒక ప్రముఖ క్రికెట్ సారథి, లక్షలాది మంది సినీ అభిమానులున్న ఆయన భార్య ఎంత కుసంస్కారంగా ఒక వెబ్ సిరీస్‍ని ప్రసారం చేస్తున్నారంటే, అందులో ఉన్న భాషని చూస్తే వారిపై అసహ్యం వేసేంతగా. ఇటువంటి వాటికి ఆకర్షితులై యువత తమకు తామే అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ, అంతర్జాలంలో పెడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక వారి కుటుంబాలకు కూడా తీరని కళంకం తెస్తున్నారు.


ఒకప్పుడు బడుల్లో చదువులతోపాటు, మంచి సంస్కారం, నడవడిక నేర్పేవారు. పిల్లలు తప్పులు చేస్తే, బూతులు మాట్లాడితే తప్పని చెప్పి మంచి మార్గంలో పెట్టేవారు. ఈ రోజు, కొన్ని సినిమాల, సీరియళ్ళ వల్ల, ఇటువంటి వెబ్ సిరీస్‌లు, కొన్ని ప్రభుత్వాల పుణ్యమా అని చదువుల సంగతి దేవుడెరుగు, పచ్చి బూతులు నేర్చుకుంటూ, కన్న తల్లులపైనా, అక్కచెల్లెళ్లపైన కూడా దాడులు చేసి స్థాయికి వచ్చారు. 


ఈ వెబ్ సిరీస్‍లు సినిమాటోగ్రఫీ చట్టం 1952 లేదా కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం 1995 పరిధిలో లేనందున, ఆదాయపు పన్ను లేదా జి.ఎస్.టి పరిధిలోకి రానందువల్ల, ఇష్టారాజ్యంగా విద్వేష, హింసాత్మక, అశ్లీల, అసాంఘిక, అరాచక పద్ధతుల్లో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాల వంటి దురలవాట్లను ప్రేక్షకుల మీద రుద్దుతూ పబ్బం గడుపుతున్నాయి.


ఇంకొక అతి జుగుప్సాకరమైన ఆప్ టిక్‌టాక్. దీనిలో వాడే భాష, చేసే డాన్సులు, వెకిలిచేష్టలు ఎన్నో కుటుంబ కలహాలకి, ఎంతోమంది ఆత్మహత్యలకి, ఇంకెంతోమంది హత్యలకు దారి తీసిన సం ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో చూసాము. మోదీ ప్రభుత్వం ఇప్పటికే అశ్లీల వెబ్‌సైట్‌లను అంతర్జాలంలో కొంతమేరకు కట్టడి చేశారు. సెన్సార్ బోర్డ్ వారు కఠిన నిబంధనలను రూపొందించాలి. అంతేగాక పైన పేర్కొన్న చట్టాల పరిధిలోకి వెబ్ సిరీస్‍లను తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అశ్లీల వెబ్ సిరీస్‍లను ప్రచారం చేయకుండా అడ్డుకుని, వీటిని ప్రసారం చేసే వారికి కఠినమైన శిక్షలు వేయాలి. భారతీయ శిక్షాస్మృతి, సమాచార సాంకేతిక చట్టం (2000) సంబంధిత నిబంధనలను ఉపయోగించి సంబంధిత ప్రదేశాలలో అవసరమైన సివిల్ / క్రిమినల్ చర్యలను ప్రారంభించాలి.


ఇది కేవలం కేంద్రానికి, సెన్సార్ బోర్డ్ వారికి మాత్రమే సంబందించిన అంశమే అనుకోకుండా, సమాజంలోని ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకుని, మన సంసృతి సాంప్రదాయాలపై, మానవ విలువలపై జరుగుతున్న ఒక అమానుష, అమానవీయ చర్యగా గుర్తించి మన వంతు ఈ అశ్లీల దురాచార దాడిని అడ్డుకోవడానికి కదం తొక్కాలి. లేకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి, పెడదోవ పడుతున్న మన భావితరం తీవ్ర పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. మితిమీరిన అంతర్జాల వినియోగం విషయంలో ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డలను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పటికే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలోని హిందూ జాగృతి సంస్థ వారు, కొంత మంది ప్రజాప్రతినిధులు, సామాజిక సేవ సంస్థలు తమ పోరాటాన్ని ప్రారంభించాయి.

సాదినేని యామిని శర్మ

Updated Date - 2020-06-11T06:29:02+05:30 IST