దేశాన్ని బీటలు వారుస్తున్న ‘మనమూ వాళ్ళూ’ పరిభాష!

ABN , First Publish Date - 2020-11-26T05:47:53+05:30 IST

భారతీయ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. ఇప్పటిదాకా అతి తక్కువసార్లు సవరణ అయిన రాజ్యాంగం మనదొక్కటే...

దేశాన్ని బీటలు వారుస్తున్న ‘మనమూ వాళ్ళూ’ పరిభాష!

మొత్తమ్మీద దేశంలోని మెజారిటీ సామాన్య జనం తెలుసుకోవలసిన అత్యవసర విషయాలు ఏమిటంటే, ఆధునిక నాగరికతకు మూలమైన ఫ్రెంచ్ విప్లవ భావనలు మూడూ ఇపుడు భారత్‌లో వధ్యశిలపై ఉన్నాయి. అవి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. దేశంలో ‘మనమూ వాళ్లు’ అనే పరిభాష విస్తరిస్తోంది. ‘ముస్లింలు, అర్బన్ నక్సలైట్లు, లవ్ జిహాద్ ఇట్లాంటి పదాల ద్వారా ఫలానా వాళ్లు ఇతరులు. వాళ్లు మనం కాదు. వాళ్లకు ఆ మూడు విలువలు వర్తింపచేయనక్కర్లేదు’ అనే సంకేతాన్ని వ్యవస్థలోని అన్ని అంగాలకు పాకిస్తున్నారు.


భారతీయ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. ఇప్పటిదాకా అతి తక్కువసార్లు సవరణ అయిన రాజ్యాంగం మనదొక్కటే. ఐతే, సొషల్ మీడియా అందు బాటులో ఉన్న ప్రస్తుత రోజుల్లో, రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అంటరాని కులాలకు -అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను తప్పుబడుతూ, తమ బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానే మనుస్మృతిని అమల్లోకి తెస్తుందని వ్యాఖ్యానిస్తూ రాజ్యాంగ నిర్మాతను దుర్భాషలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కుల రక్షణ పరిస్థితి ఎలా ఉందో దేశ పౌరులు తరచి చూడాల్సిన అవసరం ఉంది. 


ఒక పక్క రాజ్యాంగ దినోత్సవాలు చేయమంటూనే ప్రజాస్వామ్యబద్ధమైన సిఎఎ వ్యతిరేక ప్రదర్శనలను ఉక్కుపాదంతో అణచివేసిన మోదీ ప్రభుత్వం, ఇదేమిటని ప్రశ్నించిన యూనివర్సిటీ విద్యార్థులను, పౌరహక్కుల కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ముష్కర మూకలు నిరసనల్లో పాల్గొన్న మహిళా కార్యకర్తలతో, యూనివర్సిటీ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, వారిపై వ్యక్తిగత ఆరోపణలకూ వ్యక్తిత్వ హననాలకూ పాల్పడినప్పటికీ వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వేలాది కార్యకర్తలపై చార్జిషీట్లు నమోదు చేసి, వారిని జైళ్ళల్లో మగ్గేలా చేసింది. సోషల్ మీడియాపై ఫాసిస్టు కన్నువేసి, మతతత్వంపై, ప్రభుత్వాల నిరంకుశత్వంపై గొంతెత్తుతున్న వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా, వారివారి సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించి, రాజ్యాంగ హక్కు అయిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాసింది. సోషల్ మీడియాలో మతతత్వ దాడులు చేస్తూ, ఇతర మతస్థులనూ, మైనారిటీలనూ లక్ష్యంగా చేసుకున్న అసాంఘిక శక్తులకు దారులు పరిచింది. వేలాదిగా నకిలీ అకౌంట్లకు అనుమతులిచ్చి, దేశానికి వెన్నెముక అయిన లౌకిక తత్వాన్ని ప్రశ్నార్థకం చేసే వార్తల్ని ప్రచారం చేయిస్తూ, అప్రజాస్వామికంగా వ్యవహరించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కులహంకార హత్యలు పెచ్చుమీరాయి. మైనారిటీ తీరిన యువతీ యువకులు తమకు నచ్చినవారిని పెళ్ళాడడం వారి హక్కు కాగా, సోకాల్డ్ తక్కువ కులపు అబ్బాయిలను చేసుకున్నందుకు యువతులను తల్లిదండ్రులే హత్య చేయడం లేదా ప్రేమించిన యువకుడిని తమకంటే తక్కువ కులం అనే వంకతో బహిరంగంగా కిరాయి గూండాలతో హత్య చేయించడం అతిసాధారణంగా మారిపోయాయి. అత్యాచారాలు చేసినవారిలో అధికార పార్టీ నాయకులు ఉండడం, పసిబిడ్డ ఆసిఫాపై జరిగిన ఘోర హత్యాచారాన్ని సమర్థిస్తూ బీజేపీ నాయకులే ర్యాలీలు నిర్వహించడం దేశంలోని తక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీ సమూహాల్లో భయాందోళనలు రేకెత్తించాయి.


తెలంగాణాలో సైతం పరువు హత్యలుగా పిలవబడే కులహంకార హత్యలు ఇబ్బడిముబ్బడిగా జరిగాయి. ఉద్యమాల గడ్డలో సరికొత్తగా కులాల అంతరాలు పెరిగి, అధికార పార్టీ అండతో దళిత యువకుల, పేద యువకుల పరువు హత్యలు పట్టపగలే జరిగే స్థితికి వచ్చేసాయి. మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ ఆవరణలో పరమ దారుణంగా జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్యను, టేకు లక్ష్మి అనే పేద దళిత వివాహితపై ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో జరిగిన హత్యాచారాన్ని, ఆపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మరో కులహంకార హత్యను పరిశీలిస్తున్నపుడు, ప్రస్తుత ప్రభుత్వాలు కులాల అంతరాల్ని మళ్ళీ పెంచి పోషించేలా వ్యవహరిస్తున్నాయని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అవకాశం ఇవ్వమంటూ పాదయాత్రలు చేసి, మెజారిటీ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా దళితులపై దాడుల విషయంలో ముందంజలో ఉంది. వారు అధికారంలోకి వచ్చిన ఈ ఒకటిన్నర ఏళ్ళలోనే జరిగిన దాడుల సంఖ్య దీన్ని నిరూపిస్తోంది. శిరోముండనాలు, మాస్కు పెట్టుకోలేదనో, లాకౌట్ సమయంలో బైట కనిపించారనో, లేదా మరేదో వంకతోనో దళితుల పైనా, మైనారిటీ వర్గాల పైనా అమానవీయ రీతిలో దాడులు చేస్తున్న, చివరికి వారి చావులను కూడా కళ్ళజూస్తున్న పొలీసుల గురించిన వార్తలు ఈమధ్య ఏపీలో సర్వసాధారణం అయ్యాయని చెప్పాలి. 


మొత్తమ్మీద దేశంలోని మెజారిటీ సామాన్య జనం తెలుసుకోవాల్సిన అత్యవసర విషయాలు ఏమిటంటే, ఆధునిక నాగరికతకు మూలమైన ఫ్రెంచ్ విప్లవ భావనలు మూడూ ఇపుడు భారత్‌లో వధ్యశిలపై ఉన్నాయి. అవి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ‘మనమూ వాళ్లూ’ అనే పరిభాషలో ఆర్టికల్ 370తో కొంతమంది ‘వాళ్ళు’ అయిపోయారు. అక్కడ హేతువు, న్యాయం పక్కదారి పట్టాయి. వాళ్లు ‘వాళ్లు’ కాబట్టి పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. బీమా కోరేగావ్‌తో వ్యక్తిగత స్వేచ్ఛ బోనెక్కింది. ఎవరినైనా ఏదో ఒక సాకుతో అలా ఎంత కాలమైనా జైల్లో తోయవచ్చుననే సందేశం పంపారు. వాళ్లు కూడా ‘వాళ్లు’ పరిభాషలో చేరిపోయారు. దేశంలో ‘మనమూ వాళ్లు’ అనే పరిభాష విస్తరిస్తోంది. ‘ముస్లింలు, అర్బన్ నక్సలైట్లు, లవ్ జిహాద్ ఇట్లాంటి పదాల ద్వారా ఫలానా వాళ్లు ఇతరులు. వాళ్లు మనం కాదు. వాళ్లకు ఆ మూడు విలువలు వర్తింపు చేయనక్కర్లేదు’ అనే సంకేతాన్ని వ్యవస్థలోని అన్ని అంగాలకు పాకిస్తున్నారు. నెహ్రూను వ్యూహాత్మంగా లక్ష్యంగా చేసుకుని సెక్యులర్ ఫ్యాబ్రిక్ పునాదులను నాశనం చేస్తున్నారు. అందుకోసమే దానికి ప్రతీకగా నిల్చిన పార్లమెంట్ రూపురేఖలను కూడా మార్చడం. ఇప్పటికే పంచవర్ష ప్రణాళిక వంటివి మార్చేశారు. ఐఐటి, ఐఐఎంల కళ తగ్గించారు. నెహ్రూ ప్రధాన శత్రువుగా పైకి కనిపించినా, నిజానికి ప్రస్తుత పాలకులకు అసలు శత్రువు అంబేడ్కర్. మతానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా అంబేడ్కర్ సూత్రీకరించిన విలువలు వారికి ప్రధాన శత్రువులు. నేరుగా అనలేక, ఆయన కల్పించిన ప్రజస్వామ్య, లౌకిక విలువల హైజాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. కానీ అది వారనుకున్న రీతిలో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కాషాయానికి మౌలిక శత్రువు అంబేడ్కర్, ఆయన భావజాలం. కేవలం రూపాన్ని అప్రాప్రియేట్ చేసుకుంటామంటే కుదరదు. కేవలం అయన ఒక సందర్భంలో వెలిబుచ్చిన అభిప్రాయాలను ముందుపెట్టి అదిగో ముస్లింల గురించి ఆయన కూడా ఇలా అన్నారంటే కుదరదు.


ఆర్టికల్ 32ను ‘రాజ్యాంగానికి ఆత్మ’ (సోల్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్) అని అంబేడ్కర్ అభివర్ణించారు. చీఫ్ జస్టిస్ బోబ్దే దాని వినియోగాన్ని డిస్కరేజ్ చేయాలి అన్నట్టు వ్యాఖ్యానించారు. ‘మనమూ వాళ్లూ’ అనే పరిభాష న్యాయ వ్యవస్థకు కూడా పాకుతున్నది. భారత రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. అందుకే అంబేడ్కర్ ఆర్టికల్‌ 32 గురించి అంతగా నొక్కి చెప్పారు. ఈ ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వారికి పూర్తిస్థాయిలో తిరుగులేని మెజారిటీ వస్తే ముందు ముందు ఆ ప్రమాదం కూడా ఉంది. ఈ ‘మనమూ వాళ్ళూ’ లెక్కలు అన్ని వ్యవస్థలకూ పాకిపోవటం వల్లనే అర్ణబ్ గోస్వామి కోసం సుప్రీం అత్యవసరంగా సమావేశమయింది. ‘పార్కిన్‍సన్ వ్యాధి ఉంది, ఎనభై ఏళ్ళు పైబడ్డాయి. కప్ పట్టుకుని నీళ్లు తాగలేను, స్ట్రా ఇప్పించండి’ అని ఒక పెద్దాయన దరఖాస్తు చేసుకుంటే వినే దిక్కుండదు. ఇవన్నీ గమనిస్తున్నపుడు రాజ్యంగ నిర్మాత, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఇన్నేళ్ళు కొనసాగడానికి కారకుడైన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ, కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీలో చివరిసారిగా చేసిన ప్రసంగాన్ని లేదా హెచ్చరికని గుర్తుచేసుకోవాల్సిందే.


‘భారతదేశం తను సంపాదించుకున్న స్వాతంత్య్రాన్ని మళ్ళీ పొగొట్టుకుంటుందా? ఒకప్పుడు స్వాతంత్య్రం లేని స్థితిలో ఉన్న భారతదేశం నాకు గుర్తొస్తోంది. కాబట్టి మీ విముక్తిని మీరెప్పుడూ ఎంతటి గొప్ప వ్యక్తి కాళ్ళముందైనా పరవొద్దు. అలాగే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని, సాంఘిక ప్రజాస్వామ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సాంఘిక ప్రజాస్వామ్యంలేని రాజకీయ ప్రజాస్వామ్యం ఎంతోకాలం నిలబడదు. సమానత్వం లేని సమాజంలో స్వేచ్ఛకు అర్థం లేదు. భారతీయ సమాజంలో పౌరులుగా ఉన్న అతి చిన్న సమూహాలకూ, బలహీన వర్గాలకూ న్యాయం చేయడంలో నేను రాసిన రాజ్యాంగం విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే, చిన్న సమూహాలకు అన్యాయం జరుగుతున్న దేశంలో ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో ఉందని అర్ధం చేసుకోవాలి.’

అరుణ గోగులమండ

రచయిత, సామాజిక విశ్లేషకురాలు

Updated Date - 2020-11-26T05:47:53+05:30 IST