విజయసాయి – విశాఖ విషాదం

ABN , First Publish Date - 2020-05-09T06:25:49+05:30 IST

విశాఖలో తరచూ ప్రత్యక్షమయ్యే విజయసాయిరెడ్డి, భోపాల్‌ దుర్ఘటనతో పోల్చదగిన సంఘటన జరిగిన వెంటనే ఎందుకు అక్కడ కనిపించలేదు? దుర్ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో...

విజయసాయి – విశాఖ విషాదం

విశాఖలో తరచూ ప్రత్యక్షమయ్యే విజయసాయిరెడ్డి, భోపాల్‌ దుర్ఘటనతో పోల్చదగిన సంఘటన జరిగిన వెంటనే ఎందుకు అక్కడ కనిపించలేదు? దుర్ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారంటూ కొంతకాలంగా ఆయన మీద విమర్శలు రావటం గమనార్హం. 45 రోజులుగా లాక్‌డౌన్‌లో అధికారుల పర్యవేక్షణ లేని, విస్ఫోటన అవకాశాలున్న ఎల్జీపాలిమర్స్‌ వంటి పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు ఎలా వచ్చాయో మీకు తెలీదా? మీ ప్రమేయం లేదా?


ఒకసారి మాటల మధ్యలో విజయసాయిరెడ్డి నాతో,‘మా వూరు ఏదో నీకు తెలుసా?’ అని అడిగారు. నెల్లూరుజిల్లా కదా అన్నాను. ఆయన నవ్వి,‘విశాఖపట్టణం’ అన్నారు. విశాఖపట్టణంతో ఏ సబంధమూ లేని ఆయన ఆ మాట ఎందుకు అన్నారో ఆ తర్వాత తర్వాత నాకు అర్ధమవుతూ వచ్చింది. ఎల్జీపాలిమర్స్‌లో గ్యాస్‌లీక్‌తో నేలమీద వాలిపోతున్న జనం హృదయవిదారక దృశ్యాలను టీవీల్లో చూస్తూ ఉన్నపుడు ఎందుకో గతంలో ఎప్పుడో విజయసాయిరెడ్డి నాతో అన్న ఆ మాట గుర్తుకువచ్చింది. విషవాయువుతో చనిపోయినవాళ్ళూ, ఆసుపత్రుల్లో పెనుగులాడుతున్నవాళ్ళూ.. భవిష్యత్తులో ఆ ప్రాంత ప్రజలమీద దాని ప్రభావ తీవ్రతా తలచుకున్నపుడు గుండెల్లో కెలుకుతున్నట్టుగా ఉంది. విశాఖను రాజధానిగా చేయాలనే సంకల్పం, దాని కోసం మొండిగా చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అసంబద్ధంకాదనే అనుకుంటున్నాను. ఒకప్పటి నా మిత్రుడు విజయసాయిరెడ్డికి విశాఖపట్టణ మీద హఠాత్తుగా ఇంత అభిమానానురాగాలు ఎందుకు పుట్టుకువచ్చాయా అని నాకు కూడా సందేహం కలిగింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖకు విజయసాయిరెడ్డి పిలిపించి, ఆరు కిలో మీటర్ల మేరకు జనాన్ని నిలబెట్టి స్వాగతం పలికించిన తీరు.. విశాఖకి తరచూ ఆయన తీస్తున్న పరుగులు.. అక్కడ మంత్రులను పట్టించుకోకుండా చేస్తున్న సమీక్షలు.. ఇవన్నీ గ్యాస్‌లీక్‌ దుర్ఘటన వేళ నాకు పదే పదే గుర్తుకువస్తున్నాయి ఇంత లాక్‌డౌన్‌ కాలంలోనూ తరచూ విశాఖలో ప్రత్యక్షమయ్యే విజయసాయిరెడ్డి భోపాల్‌ దుర్ఘటనతో పోల్చదగిన సంఘటన జరిగిన వెంటనే ఎందుకు అక్కడ కనిపించలేదా అని కూడా నాకు సందేహం రావడం నా తప్పు కాదనుకుంటాను. దుర్ఘటనకు కారణమైన ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారంటూ కొంతకాలంగా ఆయన మీద వస్తున్న విమర్శలు కూడా ఇప్పుడే గుర్తుకువస్తున్నాయి. నా పాత మిత్రుడి నైజం బాగా ఎరిగినందునే నాకు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయనుకుంటున్నాను.


ఈ సందర్భంలోనే నాకు భారతీయ జనత పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద విజయసాయిరెడ్డి విరుచుకుపడిన తీరు కూడా గుర్తుకు వస్తోంది. ఢిల్లీలో సావాసం, రాష్ట్రంలో విరోధం, దారికి రాకుంటే ఎంతటి వారి పైన అయినా ఉత్తుత్తి ఆరోపణలు చేయడం, నిరూనపించుకోవాలని ఛాలెంజ్‌ విసరడం.. ఇదీ వైస్సార్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ధోరణి. చంద్రబాబు మీద ఆయనకు పట్టారాని కోపం, కసి ఉండటంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం నిర్ణయాలను కొన్నింటిని భారతీయ జనతా పార్టీ సమర్థించటం కూడా ఆయనకు చికాకు కలిగించి ఉండవచ్చు. మచ్చుకు, రాజధానికి చెందిన విషయం.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి. వైస్సార్సీపీ సహా అన్నిపార్టీలూ రాజధాని అక్కడే ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నేపధ్యంలొనే రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఆందోళన కారులుకు భారతీయజనతా పార్టీ మద్దతు తెలిపింది. అమరావతి ప్రజలకు అండగా ఉంటే, కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లేనా? 


అసలు చంద్రబాబు భారతీయ జనతా పార్టీని తిట్టిన తిట్లు, పార్టీ అంత సులువుగా మరచి పోతుందా? భాజపా జాతీయ నాయకులు అమిత్‌షా, జాతీయ అధ్యక్షులు నడ్డా అనేక సందర్భాలలో ఖరాఖండీగా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసే పరిస్థితి రాదు అని ప్రకటించారు కూడా. పార్టీ అంత కఠినమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కన్నా లక్ష్మీనారాయణ లాలూచీ పడ్డారని ఆరోపణలు చేశారంటే ఏమనాలి? ‘ఏమన్నారు సాయి గారు.. అవినీతికి ఆమడ దూరంలో ఉంటా....’ అని కదా.., మరి మీరు డీల్‌ చేసినవి మచ్చుకు కొన్ని వివరిస్తా. టీటీడీ పాలకమండలిలో నాలుగేళ్ళు సభ్యుడుగా ఉన్న మీరు, ఏ హిందవు చేయనన్ని ఆరోపణలు దేవస్థానం మీద చేశారు కదా? ఒక్కదానికీ ఆధారాల్లేవు. భక్తుల డబ్బుతో 2 కోట్లు కోర్టు ఫీజు కట్టి మరీ టీటీడీ మీ పైన 200 కోట్లకు పరువునష్టం దావా వేయటం మీకు తెలుసు. మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు ఆరోపించిన వారందరి పైనా విచారణ జరిపి, అందరినీ జైల్లో పెడతారని వెంకన్న భక్తులందరూ భావించారు ఎందుకంటే మీరు పాలనా పరంగా అతి ముఖ్యమైన స్థానంలో ఉన్నారు గనక. కానీ జరిగింది ఏమిటి? మొదటి బోర్డు మీటింగ్‌లోనే మీరే ఆ దావానే రద్దు చేయించారు. మరి చంద్రబాబు దగ్గర మీరెంత తీసుకున్నారు మిత్రమా? సుజనాచౌదరికి మీరు ఆడిటర్‌. మీ పార్టీ మొత్తం టీడీపీకి, సుజనా చౌదరికి వ్యతిరేకం. వ్యతిరేకంగా సాక్షిలో స్టోరీలు వేస్తుంటే, సుజనాచౌదరి నుంచి ఫోన్‌ రాగానే, ఆ స్టోరీని సాక్షి లో వెంటనే ఆపేయించారు కదా మీరు? దీంట్లో సుజనాచౌదరి దగ్గర ఎంత తీసుకున్నారు? మీరు ఓరియంటల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఉన్నపుడు నీతి గానే పనిచేసారా? గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. మీరు జీవితంలో చాలా ఎన్నో ఇబ్బందులు పడిన మాట ఎంత వాస్తవమో, అంతమంది శత్రువులను అనవసరంగా తెచ్చుకోవటంలో కూడా మీకు, మీరే సాటి. మీరు పార్టీలో రెండవస్థానం ఉన్నానని చెప్పుకొన్నా, ఎంపీ (రాజ్యసభ కోసం)చెన్నయ్‌ లోని మీ ఆస్తులు శేఖర్‌రెడ్డికి అమ్మి, దాదాపు 50 కోట్ల పైన పార్టీలో ఖర్చుపెట్టుకోవలసిన పరిస్థితికి కారణం ఏమిటి? జగన్‌ కుటుంబంలో మెజార్టీ సభ్యులతో పాటు, వారి సన్నిహితులు అందరూ మిమ్మల్ని వ్యతిరేకించడం కాదా? చివరకి ఒక దశలో మీకు రాజ్యసభ రాదు అన్న సంశయంతో, ఆస్ట్రేలియా కెళ్ళి పోయి వ్యవసాయం చేసుకోవటానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేసి, జగన్‌కే జలక్‌ ఇచ్చిన సమర్థులు మీరు. ఇవన్నీ నాకు మీరు చెప్పిన విషయాలే. ఒకప్పుడు మీరు, నేను మంచి స్నేహితులం అనుకుంటున్న సందర్భంలో ఇరువురి వ్యక్తిగత విషయాలతో పాటు ఇవన్నీ పంచుకునేవాళ్ళం. మీ ఆశకు అంతు ఉండేది కాదు, అది రిజర్వు బ్యాంక్‌ డైరెక్టర్‌ పదవి కోసం రాజశేఖరరెడ్డిని అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ముఖర్జి గారి దగ్గరికి తీసుకెళ్లటం గానీ, కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్య పదవి కోసం అక్కడి మంత్రి జనార్దనరెడ్డి ద్వారా ప్రయత్రించడం గానీ, కొద్దోగొప్పో నాలాంటి వాళ్ళ ద్వారా (కర్ణానాటక రాజకీయాల్లో దశబ్దాల నుంచి కాస్తో, కూస్తో నాకు సంబంధాలు వుండటం వలన) గానీ.. ఇవన్నీ మరచిపోయారా మిత్రమా? 


ఇక జగన్‌ ఒక మంచి వ్యాపార వేత్త. ఎన్నో ఏళ్లుగా బెంగళూరులో వారి వ్యాపారాలు వారు గుట్టుగా చేసుకునే వారు. నేను వైస్సార్సీపీలో ఉన్నపుడు వారు అధికారంలోకి వస్తే రాజశేఖరరెడ్డి కంటే ఇంకా మంచి పాలన ఉంటుందని భావించాను. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ని జగన్‌ బాగా అభివృద్ది చేయగలుగుతారని, యువకుడు గనక ముందుముందు చాలా భవిష్యత్‌ ఉంది కాబట్టి అంకితభావంతో పనిచేస్తారని బలంగా నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకడ్ని. అలాంటి నాయకుడిని కూడా అడ్డమైన లెక్కలతో, మీకు తప్ప ఈ భూ ప్రపంచంలో ఎవరికీ తెలీని విధంగా తయారుచేసి పెట్టారు కదా. నిజానికి మీ పార్టీలో చాలామందికి జగన్‌కి గాని, పక్కనున్న ముఖ్యులకు గానీ కుల పిచ్చి పెద్దగా ఉన్నట్లు కనిపించదు. మీరు మరీ ధూపం వేసి పట్టుకున్నట్లుగా వెతికి పట్టి మరీ అన్ని కీలక పదవుల్లో ఒకే కులం వారిని నింపటం కొట్టొచ్చినట్లుంది. ఈ చర్య వల్ల మిగతా సామాజిక వర్గాల్లో తెలీని ఆక్రోశాన్ని నింపిన వారవుతున్నారు. మూడు రాజధానుల పేరుతో కూడా మీరు తప్పుదారి పట్టించారనే అనిపిస్తోంది. నిజం చెప్పండి..పొల్యూషన్‌ కంట్రోల్‌ అంశంలో అపారమైన అనుభవమున్న మీకు, 45 రోజులుగా లాక్‌డౌన్‌లో అధికారుల పర్యవేక్షణ లేని, విస్ఫోటన అవకాశాలున్న ఇటువంటి పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు ఎలా వచ్చాయో తెలీదా? మీ ప్రమేయం లేదా? విశాఖను మీ సామ్రాజ్యంగా మలచుకోవడానికి మీరు చేస్తున్న హడావుడి వల్ల జగన్‌ ప్రభుత్వానికి మీరు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? సాయి గారూ ఇకనైనా దయచేసి జగన్‌ ప్రభుత్వం జనం మెచ్చేలా పనిచేసే విధంగా సలహాలు ఇవ్వండి, ఇప్పించండి. మిగతా విలువలేని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దని ఒక్కప్పటి మీ మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా విన్నవించుకొంటున్నా. 



ఓ వి. రమణ

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు

Updated Date - 2020-05-09T06:25:49+05:30 IST