ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం

ABN , First Publish Date - 2020-09-25T06:21:39+05:30 IST

వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది. మానసిక హింసను భరిస్తూనే ఆ గాయాల నుంచి...

ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం

దీర్ఘకాల, శాశ్వత జాతీయవాద నిర్మాణం కోసం ఉద్భవించిన హిందూ జాతీయవాదం తదనంతర కాలంలో సాంస్కృతిక జాతీయవాదంగా మారిపోయింది. అదే పాదు నుంచి ఒక అద్భుతమైన సరికొత్త సాంస్కృతిక జాతీయవాదాన్ని తీర్చిదిద్దిన తత్త్వవేత్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ. ఆయన ప్రవచించిన ‘ఏకాత్మ మానవతావాదం’ ఈరోజు దేశ గతిని, పురోగతిని మారుస్తున్నది.


వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది. మానసిక హింసను భరిస్తూనే ఆ గాయాల నుంచి సరికొత్త సంధ్యారాగాలతో ‘భారతీయత’ రూపుదిద్దుకుంది. భారతీయత పునరుజ్జీవం కోసం ఈ దేశంలో అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. దేశీయమైన ఆత్మ కలిగిన అన్ని సిద్ధాంతాలూ ఏదో ఒక స్థాయిలో తమ ప్రభావాన్ని ఈ సమాజంపై చూపించాయి. దయానందుని ఆర్షవాదం, నేతాజీ జైహింద్‌ వాదం, సావర్కర్‌ హిందూరాష్ట్ర వాదం, అరవిందుని అఖండ భారతవాదం, తిలక్‌ స్వరాజ్యవాదం, గాంధీజీ అహింసావాదం, విశ్వకవి జాతీయవాదం- ఇవన్నీ స్వాతంత్య్రం కోసం ఏదో ఒక దశలో అద్భుతంగా ప్రభావితం చేశాయి.


స్వాతంత్య్రం అనేదాన్ని తాత్కాలిక లక్ష్యంగా భావించిన సిద్ధాంతాలు కొన్ని వచ్చాయి. ఆ ప్రయోజనం నెరవేరగానే అవి వట్టిపోయాయి. అలాకాకుండా దీర్ఘకాల, శాశ్వత ‘జాతీయవాద’ నిర్మాణం కోసం ఉద్భవించిన హిందూ జాతీయవాదం తదనంతర కాలంలో సాంస్కృతిక జాతీయవాదంగా మారిపోయింది. అదే పాదు నుంచి ఒక అద్భుతమైన సాంస్కృతిక జాతీయవాదాన్ని తీర్చిదిద్దిన తత్త్వవేత్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ. ఆయన ప్రవచించిన ‘ఏకాత్మ మానవతావాదం’ ఈరోజు ఈ దేశ గతిని, పురోగతిని మారుస్తున్నది.


1916 సెప్టెంబర్‌ 25న మధురలో జన్మించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ భారతీయ రాజకీయ అస్తిత్వ వాదాన్ని భుజాలకెత్తుకొన్నారు. అప్పుడప్పుడే స్వాతంత్య్రం వచ్చి గాంధీ-నెహ్రూలపై అపార గౌరవంతో భారతీయులు ఇంకెవ్వరినీ స్వీకరించే స్థితిలో లేరు. ముఖ్యంగా నెహ్రూ ప్రతిపాదించిన రాజకీయ అస్తిత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించే స్థితిలో లేరు. ఆ సమయంలో డా. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వంటి అతి తక్కువ మంది మాత్రమే ఆ ప్రవాహానికి ఎదురొడ్డి నిలదొక్కుకున్నారు.


ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో పుట్టుకొచ్చిన రాజకీయ వ్యవస్థ జనసంఘ్‌, అది శ్యామాప్రసాద్‌ ముఖర్జీ చేతుల్లో పురుడు పోసుకుంటే, దీన్‌దయాళ్‌జీ చేతుల్లో రూపుదిద్దుకుంది. క్రమశిక్షణ, అంకితభావం, సిద్ధాంతం, ఆదర్శం వంటి విలువల ఆధారిత పార్టీగా దీన్‌దయాళ్‌జీ జనసంఘ్‌ను తీర్చిదిద్దారు. 1951 అక్టోబర్‌లో జనసంఘ్‌ ఆవిర్భవించాక పార్టీ నిర్మాణానికి గురూజీ పంపించిన ముగ్గురు ప్రచారకుల్లో దీన్‌దయాళ్‌జీ ఒకరు. ఈ దేశం కోసం ప్రాణాలు బలిపెట్టిన డా. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ తర్వాత బాధ్యతలు చేపట్టిన దీన్‌దయాళ్‌జీ 15 ఏళ్లలో పార్టీకి ఓ స్వరూపం ఇచ్చారు. పార్టీకి సిద్ధాంతపరమైన తాత్వికతను జోడించింది మాత్రం దీన్‌దయాళ్‌జీనే. 1967 కాలికట్‌ జనసంఘ్‌ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఈ దేశ చారిత్రక ప్రసంగాల్లో ఒకటి.


‘‘మీ జీవితాన్నే పణంగా పెట్టు’’ (దావ్‌ లగావో జిందగీ పే) పేరిట ఆయన చేసిన రచనలో ‘దిశ-దశా లేని యాంత్రిక జీవితం ఏమంత గొప్పది కాదు. జీవితంలో ఏదైనా సాధించాలంటే మీరు సర్వస్వాన్ని పణంగా ఒడ్డి నమ్మిన విశ్వాసం కోసం వేగంగా ముందడుగు వేయాలి’ అన్న మాటల్ని ఈరోజు ఈ దేశ ప్రధాని నుంచి ఎందరో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు ఆచరణలో చూపిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం పెట్టుబడిదారీవాదం, సామ్యవాదం మాత్రమే రెండు పార్శ్వాలుగా చూపిస్తూ చర్చ జరిపేవారు. కానీ దీన్‌దయాళ్‌జీ ఈ రెండింటిలోని డొల్లతనాన్ని బట్టబయలు చేశారు. ఈ రెండూ సమాజాన్ని, మనిషినీ ఒక పాక్షిక, భౌతికవాద దృక్కోణంతో మాత్రమే చూశాయని; ఒక వాదం మనిషిని డబ్బు వెంట తిరిగేవాడిగా, ఇంకో వాదం మనిషిని మొత్తం పరిస్థితుల్లో ఒక బలహీనమైన ప్రాణిగా, కఠిన నిబంధనల్లో ఇరుక్కొన్న వ్యక్తిగా నిస్సహాయుడిగా సూచిస్తుందని ఆయన అభిప్రాయం. ఈ రెండింటినీ తలదన్నే చతుర్విధ పురుషార్థాలు-ధర్మం, అర్థం, కామం, మోక్షం ఆధారంగా జీవన విధానం ఆవిష్కరించింది, అందులో సమగ్రత ఉంది, వ్యక్తిత్వం కోల్పోకుండా తనలోని శక్తి సామర్థ్యాలను జాగరూకతతో నింపాలి. అంతర్గతంగా ఉన్న వ్యక్తిత్వాన్ని మేల్కొల్పి పవిత్ర శిఖరాలను అధిరోహించేటట్లుగా చేయాలి. మానవుడికి-సమాజానికి మధ్య శాంతి వారధి నిర్మించాలి అంటూ భారతీయ రాజకీయ ఆలోచనాధోరణికి బీజం వేశారు. అలాగని పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక ఆలోచనా విధానలను ఆయన పూర్తిగా తిరస్కరించలేదు. దీన్‌దయాళ్‌జీ ఏకాత్మ మానవతావాదం అస్పృశ్యత, కులవివక్ష, వరకట్నం, మహిళల నిరాదరణ వంటి వాటిని తిరస్కరించింది.


ఏకాత్మ మానవతావాదం ఈ జాతి జీవితం. అది ఒక మానవుడి ప్రాణంతో సమానం. ప్రాణం ఎలా శరీరంలోని అన్ని అంగాలకు చైతన్యం ఇస్తుందో; బలం, మేధస్సు కలిగిస్తుందో అలాగే ఈ ఏకాత్మవాదం దేశ సమగ్ర వికాసాన్ని చూపిస్తుంది. అటువంటి దీన్‌దయాళ్‌జీ 1968 ఫిబ్రవరి 11 రాత్రి లక్నో నుంచి పాట్నా వెడుతుండగా క్రూరంగా హత్యకు గురయ్యారు. ఆ తాత్వికుడి మరణంతో ఆయన సిద్ధాంతాలు ఆగిపోలేదు. దానికి మూలం దీన్‌దయాళ్‌జీ మరణం నుంచి మరికొన్ని జాతీయ విద్యుత్తేజాలు పుట్టుకొచ్చాయి. రెండు సీట్ల నుంచి ఎదగడం మొదలై ఈరోజు ప్రపంచం గర్వించే ఓ మహానేతకు పురుడు పోసింది. చైనా కుయుక్తులు, పాకిస్తాన్‌ పన్నాగాలు తుత్తునియలు చేసే శతఘ్ని నరేంద్రమోదీ రూపంలో నీతికి నిలువెత్తు రూపంగా, దేశభక్తికి తార్కాణంగా భారతను విశ్వగురువుగా మార్చే యజ్ఞం మొదలైంది. దానికి మూలం ‘ఏకాత్మ మానవతావాదమే’.


డా. కె. లక్ష్మణ్‌

బిజెపి రాష్ట్రశాఖ పూర్వ అధ్యక్షులు

(నేడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి)

Updated Date - 2020-09-25T06:21:39+05:30 IST