అప్రకటిత ఎమర్జెన్సీ
ABN , First Publish Date - 2020-06-25T06:21:23+05:30 IST
మన ప్రజాస్వామ్య వ్యవస్థ 1975-–77 ఎమర్జెన్సీ రోజుల కన్నా నేడు ప్రమాదంలో ఉన్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి నేడు కనిపించడం లేదు. ఎమర్జెన్సీ తరువాత ప్రతి రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు...

మన ప్రజాస్వామ్య వ్యవస్థ 1975-–77 ఎమర్జెన్సీ రోజుల కన్నా నేడు ప్రమాదంలో ఉన్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి నేడు కనిపించడం లేదు. ఎమర్జెన్సీ తరువాత ప్రతి రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు బలపడి కుటుంబ సభ్యులే అధికారంలోకి వస్తున్నారు. అన్ని నిర్ణయాలు ఒకరిద్దరు నాయకుల అభీష్టం మేరకే జరుగుతున్నాయి. పైగా ఒకొక్క రాజకీయ పక్షం ఒకొక్క కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ, విశాల జాతీయ ప్రయోజనాల కన్నా సంకుచిత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన బిల్లుల గురించి కూడా చట్ట సభలలో అర్ధవంతమైన చర్చలు జరగడం లేదు. ప్రజా సమస్యలపై లోతయిన చర్చల పట్ల ఆసక్తి లేదు. ప్రజల హక్కులను కాపాడటం కోసం ఎన్నో విప్లవాత్మక చట్టాలు నేడు మన ముం దున్నా వీటి అమలు పట్ల ప్రభుత్వాలకు శ్రద్ధలేదు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రెస్ సెన్సార్ షిప్ విధించారు. నేడు అటువంటిది లేకపోయినా, వార్తలను నిర్భయంగా, వాస్తవికంగా ఇవ్వలేని వాతావరణంలో మీడియా ఉంది. మీడియా విమర్శలను పాలకులు సహించలేకపోతున్నారు. సోషల్ మీడియా లో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినవారిపై దేశద్రోహ కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి మండలిలలో సహితం సమిష్టి నాయకత్వం కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ ఈ పరిస్థితులు సహజంగానే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
చలసాని నరేంద్ర