ఇది ‘సరళీకరణ’ చివరి అంకం

ABN , First Publish Date - 2020-12-30T05:52:01+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఇంత త్వరగా...

ఇది ‘సరళీకరణ’ చివరి అంకం

కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త చట్టాల ఉపసంహరణ... ఇవేవీ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడ వేయలేవు. హరిత విప్లవంతో మొదలైన వాణిజ్య వ్యవసాయం లాభమే పరమావధిగా రసాయనాల వాడకాన్ని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు పంటలపై పెట్టుబడిని అంతకంతకూ పెంచుతూ పోయి కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే విధంగా ఉన్నాయేగాని, రైతులకు దోహదం చేసేవిగా లేవు. 


కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఇంత త్వరగా వ్యవసాయ చట్టాలను ప్రజలపై రుద్దాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఏమున్నది? ఈ మూడు చట్టాలను దేశ ఆర్థిక సరళీకరణలో చివరిదశ సడలింపులుగా భావించవచ్చు. భారత వ్యవసాయ రంగం, గ్రామీణ రంగం సరళీకరణలో వెనుకబడ్డాయనే అభిప్రాయం సరళీకరణ వాదులలో బలంగా ఉంది. ఇప్పటికే విద్య, వైద్యం, బ్యాంకింగ్, ఫార్మా, బయోటెక్నాలజీలకు విస్తరించిన భారత కార్పొరేట్ రంగం, ఇతర రంగాలకు విస్తరించాలని చూస్తోంది. పట్టణాలలో, నగరాలలో పెరుగుతున్న మధ్య తరగతి, దానిలో పెరుగుతున్న వినిమయ కాంక్ష ఈ రంగాన్ని లాభసాటిగా వనరుగా మారుస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న అనేక అవకాశాలను అందిపుచ్చుకుని లాభపడాలని కార్పొరేట్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకు వచ్చింది. 1990 నుంచి కాంగ్రెస్ ఈ సరళీకరణ విధానాల సంస్కరణలకు తెరతీసి అమలు చేస్తూ వచ్చింది. ఈనాడు కేంద్రంలో ఉన్న బీజేపీ వీటిని మరింత తీవ్రంగా వేగంగా అమలు చేస్తున్నది. సరళీకరణ విధానాలకు బీజేపీ దాని జాతీయ వాద భావజాలాన్ని జోడించి ‘One Nation - One Market’ లాంటి నినాదాలతో ముందుకు తీసుకుపోతున్నది. 


మరి ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వ్యక్తపరుస్తున్న భయాలూ, సందేహాలూ ఏమిటి? గత కొద్దికాలంగా జరుగుతున్న రైతు ఉద్యమాలలో కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ సందర్భంలో మూడు విషయాలపై అందరూ దృష్టి కేంద్రీకరించాలి. ఒకటి, కనీస మద్దతు ధర అందించి, నూతన చట్టాలను ఉపసంహరించుకుంటే వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉందా, లేక అంతకుమించిన చట్టాలు అవసరమా? రెండు, గతంలో వచ్చిన రైతు ఉద్యమాలకు నేటి రైతు ఉద్యమాలకు ఏమైనా పోలికలు ఉన్నాయా? మూడు, భూమి లేని కార్మికుల గురించి రైతు ఉద్యమాలకు, ప్రభుత్వానికి ఉన్న అవగాహన ఏమిటి?


కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ, కొత్త చట్టాలు ఉపసంహరణ... ఇవేవీ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడ వేయలేవు. హరిత విప్లవంతో మొదలైన వాణిజ్య వ్యవసాయం, వ్యవసాయానికి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు మధ్యగల అవినాభావ సంబంధాన్ని దెబ్బతీసింది. లాభమే పరమావధిగా భావించే పెట్టుబడిదారీ వ్యవసాయం విచ్చలవిడిగా రసాయనాల వాడకాన్నీ ప్రోత్సహించింది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు పంటలపై పెట్టుబడిని అంతకంతకూ పెంచుతూ పోయి కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చే విధంగా ఉన్నాయేగాని, రైతులకు దోహదం చేసేవిగా లేవు. వీటి దుష్ప్రభావం ప్రకృతిపైనా ప్రజల ఆరోగ్యంపైనా కనబడుతూనే ఉంది. మరోపక్క వర్షాభావం లేదా అకాల వర్షాలతో రైతులు నష్టాలకు గురవడం మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులలో రైతులకు వస్తున్న కొద్దిపాటి ఆదాయాలు కూడా వ్యవసాయ అభివృద్ధికి గాని, జీవన ప్రమాణాల పెంపుకు గాని కాకుండా తమ పిల్లల ఇంగ్లీష్ మీడియం ప్రయివేటు విద్యకు, ప్రైవేట్ వైద్యానికి ఎక్కువగా వెళ్తుంది. నాణ్యమైన విద్యను, వైద్యాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన సరళీకరణ విధానాలే నేడు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాయి అని చెప్పడం హాస్యాస్పదం. ఇదే సందర్భంలో భూనిర్వాసితులకు ఎంతోకొంత లాభం చేకూర్చే చట్టాలకు సవరణలు చేస్తూ ‘ల్యాండ్ డిజిటైజేషన్’ లాంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం రైతుల భూమీ హక్కులను, కౌలు రైతుల హక్కులను కాలరాస్తోంది. ‘నియంత్రిత సాగు విధానం’ రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన బ్రిటిష్ వలస పాలన కాలంలో వచ్చిన ఇండిగో ప్లాంటర్స్ విధానాలను తలపిస్తున్నాయి. 


ఇక గతంలో జరిగిన రైతు ఉద్యమాల విషయానికి వస్తే, 1980వ దశకం తర్వాత రైతులు ఇంత పెద్ద ఎత్తున తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఈ ఉద్యమాలకూ 1980వ దశకంలో వచ్చిన ఉద్యమాలకూ మధ్య కొన్ని తారతమ్యాలు సారూప్యతలు ఉన్నాయి. 1980వ దశకంలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమించారు. ఈ పోరాటాలు కనీస మద్దతుధర, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీ, రుణమాఫీల కోసం జరిగాయి. ఈ ఉద్యమాలను ప్రధానంగా భూస్వాములు, పెద్ద రైతులు ముందుండి నడిపించారు. ఈ ఉద్యమాల ప్రధాన సమస్య ఏమిటంటే- చిన్న, సన్నకారు రైతులకూ పెద్ద రైతులకూ మధ్య ఎలాంటి అసమానతలు లేవని, వీరందరి గ్రామీణ సాంఘిక, సాంస్కృతిక జీవనం ఒకటేనని, వారందరి వ్యవసాయ సమస్యలు కూడా ఒకటేనని అవి వాదించాయి. కేంద్రప్రభుత్వం పట్టణాలకు ప్రాధాన్యమిచ్చి గ్రామాల నిర్లక్ష్యానికి గురి చేస్తుందన్నదే వారి పోరాటానికి మూలకారణం అయింది.   


ప్రస్తుతం జరుగుతున్న రైతు పోరాటాలకు, 80వ దశకంలోని రైతు పోరాటాలకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, వ్యవసాయ సంక్షోభం అందరిపై ఒకేలా ప్రభావం చూపుతాయని ఇవి పోరాటం చేస్తున్నాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం చిన్న, సన్నకారు రైతులపై తీవ్రంగా ఉంది. ఈ కొత్త చట్టాలు అమలులోకి వస్తే వాటి ప్రభావం ఒక్కో వర్గంపై ఒక్కోలా ఉంటుంది. ఈ పోరాటాలు ప్రభుత్వాన్ని కాకుండా కార్పొరేట్ రంగాన్ని, ముఖ్యంగా అంబానీలు, ఆదానీలను, తమ ప్రత్యక్ష శత్రువుగా గుర్తించడం హర్షించదగ్గ పరిణామం. 


ఇక మూడో విషయానికి వస్తే గ్రామాల్లో జీవిస్తున్నా భూమిలేని కార్మికులు గురించి అటు రైతు ఉద్యమాలకు గానీ ఇటు పాలకులకు గాని పట్టనట్టుగా ఉంది. కొన్ని సర్వేల ప్రకారం భూమిలేని వ్యవసాయ కార్మికులు దాదాపు 30 కోట్లుగా ఉన్నట్టు అంచనా. వీరిలో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు సింహభాగం. వీరికి వ్యవసాయ రంగంగాని, గ్రామీణ రంగంగాని సరిపడా పని కల్పించడం లేదు. వీరందరూ పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకుతున్నారు. సంక్షోభ సమయాలలో ఆధారపడటానికి వీరికి రెక్కల కష్టం తప్ప ఏమీ లేదు. అసంఘటిత రంగంలోని వీరి దయనీయ పరిస్థితులు గానీ, కార్మిక వర్గంలో వీరి శాతం గురించి గానీ పాలకులకు అవగాహన లేదు.


ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలన్న చిత్తశుద్ధి పాలకులకు ఏమాత్రం ఉన్నా ‘నూతన సమగ్ర వ్యవసాయ విధానాన్ని’ తీసుకురావాలి. దేశమంతటా ఒకే విధానం కాకుండా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేసే పద్ధతులను రైతులు అవలంబించేలా ప్రోత్సహించాలి. కనీస మద్దతు ధరతో పాటు మార్కెటింగ్ సదుపాయాలను అభివృద్ధి పరచాలి. ధాన్యం నిల్వ చేసుకునే గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. కూరగాయలు, పండ్లు వంటి వాటిని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు సమకూర్చి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతుల పంటలను ఆసరాగా తీసుకుని తిరిగి వ్యవసాయం చేసుకునేందుకు వ్యవస్తీకృత ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. వ్యవసాయంలో యాంత్రికీకరణ, వలసల ప్రభావంతో వ్యవసాయంలో పురుషులు పాత్ర తగ్గి మహిళల పాత్ర అలాగే ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఆధారంగా చేసుకొని పాలసీలు తీసుకురావడం ద్వారా మహిళా సాధికారత సాధించడానికి వీలవుతుంది. 


ఒకప్పుడు రైతు సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వాలు కూలిపోయే విధంగా ఉద్యమించే శక్తి, సామాజిక నిర్మాణం రైతు సంఘాలకు ఉండేది. నేడు రైతు సంఘాలు ఆ సంఘటిత శక్తిని కోల్పోయాయి. దానికి ప్రధాన కారణం రైతు సంఘాలు రాజకీయ పార్టీల రైతు విభాగాలుగా తయారు కావడమే. కేసీఆర్ లాంటి నాయకులు రైతు సమన్వయ కమిటీలో పేరిట పార్టీ నాయకుల్ని నియమించి రైతు సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా రైతు సమస్యలను పారదర్శకంగా ప్రచారం చేయడం లేదు. దీనివల్ల రైతు ఉద్యమాలు ప్రభుత్వాలను కదిలించలేనివిగా తయారయ్యాయి. ఉదాహరణకు నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో కవిత ఓటమికి కారణం రైతు ఆగ్రహం గాక, బీజేపీ-మోదీల కరిష్మా అన్నట్టు ప్రచారం జరిగింది. 


ప్రస్తుతం రైతులకు సర్వత్రా వస్తున్న మద్దతు ప్రశంసనీయమైనది. కానీ చాలా మటుకు అది కంప్యూటర్ స్క్రీన్‌లకు, స్మార్టుఫోన్ తెరలకే పరిమితమవుతోంది. అలా కాకుండా సమాజం మొత్తం రైతుల కొరకు నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం రైతుల తరపున పోరాటం చెయ్యలేకపోతే, మనం ఏ తిండి తినాలో, ఏ వస్తువును ఎక్కడ అమ్మాలో కార్పొరేట్ రంగమే నిర్ణయిస్తుంది.

ఎ. చంద్రశేఖర్ రెడ్డి 

ఎన్. పురేంద్ర ప్రసాద్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం


Updated Date - 2020-12-30T05:52:01+05:30 IST