మా ఆకల్ని ఆపడం మరిచిపోయారు!

ABN , First Publish Date - 2020-06-11T06:23:49+05:30 IST

నాకు తెలిసీ, నా చిన్నపుడు నలభై ఏళ్ల క్రితం మా వూర్లో వలసలు మొదలయ్యాయి. ముందు మా మునసబు కుటుంబీకులు (రెడ్లు) అమెరికాకు వలసబోయారు. తర్వాత కొంతమంది రెడ్లు, కమ్మలు, బ్రామ్మలు దగ్గిరలోని జిల్లా కేంద్రంలో సెటిలయ్యేరు....

మా ఆకల్ని ఆపడం మరిచిపోయారు!

నాకు తెలిసీ, నా చిన్నపుడు నలభై ఏళ్ల క్రితం మా వూర్లో వలసలు మొదలయ్యాయి. ముందు మా మునసబు కుటుంబీకులు (రెడ్లు) అమెరికాకు వలసబోయారు. తర్వాత కొంతమంది రెడ్లు, కమ్మలు, బ్రామ్మలు దగ్గిరలోని జిల్లా కేంద్రంలో సెటిలయ్యేరు. ఆ తర్వాత మాదిగలు, వడ్డెరలు, మాలవారు భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్‌కి వలస వెళ్లారు. ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో గల చాలామంది సినీ, రాజకీయ సెలెబ్రిటీల ఇళ్లు మా వాళ్ళే కట్టారనే సంగతి నాకు తెలుసు. బేగంపేట ఏర్‌పోర్ట్ ఎదురుగా ప్రకాష్ నగర్లో మా ఇంటి పేరుగల వారు నివసించే కాలనీయే ఒకటి ఉండేది. హైదరాబాద్‌లో ఇళ్ళ నిర్మాణ కూలీలుగా మా బంధువులు కాలుబెట్టని కాలనీ లేదంటే అతిశయోక్తి గాదు.


ఇక నేను పుట్టక ముందైతే, మా చిన్నాన్నలూ, పెదనాన్నలూ, మేనమామలు, తల్లిదండ్రులూ, కుటుంబాల సమేతంగా నాగార్జున సాగర్ వలసబోయి, సాగర్ డ్యాం కట్టుబడి పనుల్లో ఏళ్లకు ఏళ్లు పనులు చేసినవారే. వారిలో అక్కడే ప్రేమల్లో పడ్డవారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు, పిల్లలు పుట్టిన వారు కూడా ఉన్నారు. వీరంతా అప్పుడూ కూలోళ్లే. ఇప్పుడూ కూలోళ్లేనే, నా కరోనా! వలసలు ఇప్పుటియా?! మానవ జాతి యక్కడ కాయా గసురు, పండూ, ఫలమూ, నీరూ, మేతా, నీడా, తిండీ, గడ్డీ గాదం, పచ్చగా, యాడుందంటే ఆడికల్లా జరిగిపోలా!? అసలు వలసలు లేనిదెక్కడ? వలస పోనిదెవరు?!


మా వూరోళ్లు, మావోళ్ళు, అట్నే పోయేరు. ఏ వూర్లో, కూడూ, వసర్తీ దొరికితే, అదే మా వూరు అనుకున్నారు. సిరొంచ నుంచీ చెన్నై దాకా, బెంగళూరు నుంచీ మైసూరు దాకా కట్టుబడి పనైనా, పొలం పనైనా, రోడ్లు, కాలవలు ఊడ్చి శుభ్రం జేసే ఏ పనైనా గావొచ్చు - ఆకలి తీరడానికి ఏది జిక్కితే ఆ పనికి పోతానే ఉంటిరి. పోతానే ఉంటిరి. పోతానే ఉంటిరి. 


ఏ వూరి ఆసామి, ఏ గవుర్మెంటు గానీ ఎవురాపేరు సామే? ఇళ్ళకి తడికలేసి, తపేళాలు, చెంబులు, శరవలు, కొన్ని సంసారపు కలలు కలగలిపి గోతాల్లో మూటగట్టుకొని నెత్తిన బెట్టుకొని, బిడ్డల్ని సంకనేసుకుని జనరల్ పెట్టెలో నిలబెట్టుకుని, మోసుకొనిపోతానే ఉళ్ళా? పోతానే ఉంట్రే. నడస్తానే ఉంట్రే. నడస్తానే ఉంట్రే... మెట్ట ప్రాంత ఊళ్ళలోని మా మాదిగ పల్లెలకు ఒకసారి రాండి. చిన్న పిల్లలు, ముసలోళ్లు, తడికలు బడ్డ ఇళ్ళు, మంచినీటి వనరులు లేని, స్మశానాలను తలపించే, మా కాలనీలను చూసి పొండి. కాలనీల్లో అదృశ్యమైన వర్క్ ఫోర్సు ఎటెటు వలసలు బోయిందో ఒక్కసారి మా ఇళ్ల కాడి వడగాలులను అడగండి. సోమాలియా, కలహండీ కరువులు మా వాళ్ళ మొకాల్లో సిందెయ్యటం మీకు సిత్రంగా అనిపించదు! వలసలు ఎక్కడాగినయి? వెలుగు, మెప్మాలు ఆపలేదు. నరేగా ఆపలేదు! ఆస్తి లేదు. చదువు లేదు. రాబడి పనిలేదు. లంగరు లాంటి పుట్టిన గుడిసె, ఒక అడ్రసు, లొకేషన్ కలిగి, లోకువ మాటలు అనిపించుకున్న, బాధపడ్డ జ్ఞాపకాలు మిగిలించుకున్న మనుషులు ఎన్నేళ్ళనీ, ఎంతకాలమనీ ఉండూర్లో ఉండగలరు?! వలస బోతే పోలా? పోయారు. పోతున్నారు.


ఆశ! టయానికి ఏ కార్డూ పనికి రాదూ. అంత్యోదయ అన్నారు. అన్నపూర్ణ అన్నారు. ఆధారం అన్నారు. గరీబి రథం అన్నారు. మా కడుపులకు తాళాలు వేశారు. మా కాళ్ళకు భయం చక్రాలు పెట్టారు. మా ఆకల్ని ఆపడం మరిచిపోయారు. మా మడిమెల్ని మళ్లించలేకపోయారు. సమాజమూ, ప్రభుత్వాలూ మమ్మల్ని భౌతిక దూరాలకే కాదు, సామాజిక దూరాలకూ నెట్టేసాయి. పెంపుడు జంతువుల సాటి విలువలేని బతుకులు ఈ దేశంలో మావి. నీకు తెలుసో లేదో పుట్టినూరుకి తిరిగొచ్చి, చచ్చిపోతే, శవాలను భూమిలో దాచుకోడానికి మాలో శానా మందికి మంచి స్మశాన స్థలం కూడా లేదు. మేము బతికున్నప్పుడే మా అస్తిత్వాలు చర్చకు రాలేదు. మర్యాదలు దక్కలేదు. తెగిపోయిన చెప్పుల కంటే హీనమై పోయాం. మేం సచ్చిపోతే ఎవురికి నట్టం? గవుర్మెంటుకేమన్నా పట్టింపుందా? మట్టిలో బుట్టి, మట్టి దిని, మట్టిలో గలిసే మట్టి వలసలైన మమ్మల్ని నువ్వేం జెయ్యలేవ్ కరోనా!

కృపాకర్ మాదిగ

Updated Date - 2020-06-11T06:23:49+05:30 IST