౨1వ శతాబ్ది సంస్థగా ఐరాస

ABN , First Publish Date - 2020-10-24T05:54:51+05:30 IST

రాబోయే తరాలను యుద్ధాల బారి నుంచి రక్షించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని, ప్రపంచ ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు...

౨1వ శతాబ్ది సంస్థగా ఐరాస

సమకాలీన ప్రపంచంలో 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవాలంటే ఐక్యరాజ్యసమితిని బహుళపక్ష వేదికగా మారవలసిన అవసరమున్నది. ముఖ్యంగా భద్రతామండలి కూర్పులో మార్పు జరిగి దానిని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించవలసి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఆనాటి అవసరాల దృష్ట్యా కల్పించిన వీటో అధికారాన్ని ఇప్పుడు రద్దు చేసి ఐరాసాను ప్రజాస్వామ్యీకరించాలి. సభ్యదేశాల అన్నింటి ఓటింగ్‌ ద్వారా మెజారిటీ నిర్ణయాలను తీసుకుని అమలు పరచాలి.


రాబోయే తరాలను యుద్ధాల బారి నుంచి రక్షించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని, ప్రపంచ ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెంచాలని, స్థిరమైన అభివృద్ధి సాధించాలని, మానవహక్కులు కాపాడాలని పలు ఉన్నత లక్ష్యాలతో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించి నేటికి 75 ఏళ్ళు నిండుతున్నాయి. 1945 అక్టోబర్‌ 24న ఆవిర్భవించిన ఈ ప్రపంచ సంస్థ ఈ 75 ఏళ్లలో ఎన్నో ఉద్రిక్తతలు, ఘర్షణలు, ఒత్తిళ్లు, ఆటుపోట్లు ఎదుర్కొని కొనసాగుతున్నది. సమకాలీన ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి అవసరం, ఆవశ్యకత ఎంతో ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ చొరవతో ఏర్పడిన ‘నానాజాతి సమితి’ అనుకున్న లక్ష్యాలు సాధించలేక విఫలమైంది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగానే ఆనాటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌, బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌ మొదలైన వారి చొరవతో ప్రపంచ ప్రజల మద్దతు పొందటానికి నానాజాతిసమితి కంటే పటిష్టమైన సంస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితికి రూపకల్పన జరిగింది. తొలుత 51 దేశాలతో ప్రారంభమైన ఈ సంస్థలో నేడు 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.


ఐక్యరాజ్యసమితిలో– సర్వ ప్రతినిధి సభా, భద్రతామండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘికమండలి, ధర్మకర్తృత్వమండలి, సచివాలయం–అనే ఆరు అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో అన్ని సభ్యదేశాలకు సభ్యత్వం ఉంటుంది. భద్రతామండలి అత్యంత కీలకమైనది. విధాన నిర్ణయాలు దీని ఆమోదంతోనే జరుగుతాయి. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా శాశ్వత సభ్యత్వాన్ని, మరో 10 దేశాలు తాత్కలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలకు ‘వీటో’ అధికారం, అనగా ‘తిరస్కరించే’ అధికారం ఉంటుంది. ఈ దేశాలు ఏ అంశాన్నయినా తమకున్న వీటో అధికారంతో తోసిపుచ్చగలుగుతాయి. అందుకే ఈ వీటో హేతుబద్ధతపై 75 ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది.


ఐక్యరాజ్యసమితిలో దాదాపు 20కి పైగా ప్రత్యేక సంస్థలున్నాయి. ఇవి ప్రపంచ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక ప్రమాణాలు పెంచటానికి విశేషమైన కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ, పిల్లల సంస్థ, విద్యా, వైజ్ఞానిక సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వీటిలో ముఖ్యమైనవి. పర్యావరణం, ఆరోగ్యం, విద్య, ఆహార కొరత, కార్మిక ప్రమాణాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మొదలైన అంశాలలో ఐరాస ప్రత్యేక సంస్థలు విశేష కృషి చేశాయి. అయితే ప్రత్యేక ఆర్థిక సంస్థలైన అంతర్జాతీయ ద్రవ్యసంస్థ, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్యసంస్థల పాత్ర వివాదాస్పదంగా మారి అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగా లేవనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.


ఆర్థిక, సామాజిక రంగాలలో గత 75 ఏళ్లలో ఐక్యరాజ్య సమితి గణనీయమైన విజయాలు సాధించింది. వివిధ దేశాలలో అంతర్యుద్ధ సమయాలలో సహాయం అందించటమే గాక, శాంతిదళాలను కూడ పంపింది. కాంగో, ఇథియోపియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, సోమాలియా, మయన్మార్‌, రువాండా, సూడాన్‌ మొదలైన అనేక దేశాలలో ఐక్యరాజ్యసమితి శాంతిదళాలు శాంతిస్థాపనలో ముఖ్యపాత్ర పోషించాయి. కానీ, రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య ఘర్షణల నివారణలో ఐరాస అనేక సందర్భాలలో వైఫల్యాలను ఎదుర్కొంది. పాలస్తీనా సమస్య పరిష్కారం, ఇరాక్‌ సంక్షోభం, అఫ్ఘానిస్థాన్‌ సంక్షోభం మొదలైన వాటిలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయింది. 1991లో సోవియట్‌ యూనియన్‌ చీలిపోయిన తరువాత ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం పెరిగింది. ద్విధ్రువ ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిందని అనేకమంది వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇరాక్‌, లిబియా, ఇరాన్‌ తదితర దేశాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా తన ఆధిపత్య ధోరణులను కొనసాగించింది.


సమకాలీన ప్రపంచంలో 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవాలంటే ఐక్యరాజ్యసమితిని బహుళపక్ష వేదికగా మారవలసిన అవసరమున్నది. ముఖ్యంగా భద్రతామండలి కూర్పులో మార్పు జరిగి దానిని పూర్తి స్థాయిలో పునర్‌వ్యవస్థీకరించవలసి ఉంది. 1945లో 51 దేశాలు సభ్యత్వం కలిగి ఉంటే నేడు వాటి సంఖ్య 193కు పెరిగింది. భద్రతామండలిలో 5 శాశ్వత సభ్యదేశాలు 10 తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యలో మాత్రం మార్పు లేదు. శాశ్వత సభ్యదేశాల సంఖ్యను 10కి, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను 15కు పెంచాలని భారత్‌ సహా అనేక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. భారతదేశం, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా లేదా నైజీరియా దేశాలు తమకు కూడ శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరుతున్నాయి. ఇప్పుడున్న 5 శాశ్వత సభ్యదేశాల ప్రాతినిధ్యం చూస్తే ఖండాల మధ్య సమతుల్యత లేదు. ఈ అసమానతలను తొలగించి సమతుల్యత ఉండేవిధంగా భద్రతామండలిని తీర్చిదిద్దాలి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఆనాటి అవసరాల దృష్ట్యా కల్పించిన ‘వీటో’ అధికారాన్ని ఇప్పుడు రద్దు చేసి ఐరాసాను ప్రజాస్వామ్యీకరించాలి. సభ్యదేశాలు అన్నింటి ఓటింగ్‌ ద్వారా మెజారిటీ నిర్ణయాలను తీసుకుని అమలు పరచాలి. అప్పుడే ఈ సంస్థ అన్ని దేశాలకు నిజమైన ప్రాతినిధ్య సంస్థగా రూపుదిద్దుకుంటుంది. సమకాలీన ప్రపంచంలో ప్రపంచ శాంతి, పర్యావరణం, ఉగ్రవాదం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, కరోనా వంటి వ్యాధులు, జాతుల మధ్య ఘర్షణలు మొదలైనవెన్నో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడానికి, పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతంగా రూపొందాలి. అందుకు ప్రజాస్వామ్యీకరణ తక్షణ అవసరం.

కె.యస్‌. లక్ష్మణరావు

Updated Date - 2020-10-24T05:54:51+05:30 IST