అణచివేతలో అసమ్మతి హక్కు!

ABN , First Publish Date - 2020-10-27T05:51:57+05:30 IST

వ్యవస్థ మీద తమ అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఏ దేశ పౌరులైనా ఆశ్రయించే మార్గాలు నిరసనలు, ప్రదర్శనలు, సామూహిక ర్యాలీలు, వీధి దిగ్బంధనాలు...

అణచివేతలో అసమ్మతి హక్కు!

మన రాజ్యాంగం హామీ ఇచ్చిన  అతి ముఖ్యమైన హక్కులలో అసమ్మతి హక్కు ఒకటి. ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించనంతవరకు లేదా కలహాలను ప్రోత్సహించనంతవరకు, ప్రతి ఇతర పౌరుడి నుంచి, అధికారంలో ఉన్నవారి నుంచి  భిన్నంగా ఉండటానికి, తాను నమ్ముతున్న వాటిని ప్రచారం చేయడానికి అతనికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అసమ్మతి హక్కు  అత్యంతావశ్యకం. ఒక దేశం  సర్వతో ముఖంగా అభివృద్ధి  చెందాలన్నా,  ఆర్థిక హక్కులతో పాటు పౌర హక్కులూ  వర్ధిల్లాలన్నా  అసమ్మతిని అనుమతించాలి. 


వ్యవస్థ మీద తమ అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఏ దేశ పౌరులైనా ఆశ్రయించే మార్గాలు నిరసనలు, ప్రదర్శనలు, సామూహిక ర్యాలీలు, వీధి దిగ్బంధనాలు. నిరసనలు తెలపడం, వాటిని సామూహిక ఉద్యమాలుగా మార్చడం ప్రజాస్వామ్యంలో పౌరస్వేచ్ఛకు ప్రతీకలుగా చెప్పవచ్చు. మతం ఆధారిత పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘ నిరసనలు ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా కొనసాగడానికి అనుమతించాలా, వద్దా అనే విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక నిర్ణయాత్మక తీర్పు ఇచ్చింది. అత్యంత జాగరూకతతో వెలువరించిన ఈ తీర్పులో బహిరంగ ప్రదేశాలను నిరవధికంగా ఆక్రమించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు ఉంటుందని పేర్కొంటూనే, నిరసనలు నిర్ణయించబడిన ప్రదేశంలో మాత్రమే జరగాలని నిర్దేశించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఉద్యమహక్కు ఉల్లంఘనే అని, ఈ చర్య ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి, చట్టం ప్రకారం అనుమతించబడదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ట్రాఫిక్‌ను, ప్రజామార్గాన్ని అడ్డుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో షాహీన్ బాగ్‌లో ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను అక్కడి నుంచి తరలించాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించిన తీరు వారిని నిరాశపరిచింది. షాహీన్ బాగ్ నిరసనలు ముగిసి చాలా కాలమైనప్పటికీ వాటి స్ఫూర్తితో ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లోనూ మతం ఆధారిత పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వం సదరు నిరసనలు జాతివ్యతిరేకమని ముద్ర వేస్తూ, వాటిని నేరపూరిత చర్యలుగా ప్రకటించింది. ‘నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిరసనలు’, ‘ప్రజామార్గాలు, బహిరంగ ప్రదేశాలను ఆక్రమించకుండా ప్రదర్శనలు జరుపుకోవాలి, అది కూడా తాత్కాలికంగా ఉండాల’నే సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య అసమ్మతి హక్కుపై ఉక్కుపాదం మోపేలా ఉందని చెప్పక తప్పదు. 


అసమ్మతి తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అంతర్భాగం అని అంగీకరించిన సుప్రీంకోర్టు నిరసన తెలిపే హక్కుకు చెల్లుబాటును ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ 15న ప్రారంభమైన షాహీన్ బాగ్ నిరసనలపై, కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మార్చి 23న ఆంక్షలు విధించింది. కలిండికుంజ్-–షాహీన్ బాగ్‌ల మధ్య కొనసాగిన నిరసనలు ఓఖ్లా అండర్‌పాస్‌ను దిగ్బంధం చేసే వరకు సాగి ఢిల్లీ-, నోయిడాల మధ్య ప్రయాణాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ట్రాఫిక్ కష్టాల గురించిన ఫిర్యాదుల నేపథ్యంలో నిరసనకారులతో చర్చలు జరపడానికి, వారి డిమాండ్లను అర్థం చేసుకునే క్రమంలో నిరసనను సులభతరం చేయడానికి మధ్యవర్తులను నియమించారు. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా, షాహీన్ బాగ్ కేసులో ఒక ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా వెల్లడయింది ఏమిటంటే– కలిండి కుంజ్, నోయిడా- ఢిల్లీ ప్రత్యామ్నాయ రహదారి మార్గాన్ని అడ్డుకున్నది నిరసనకారులు కాదు, ఢిల్లీ పోలీసులేనని. అక్టోబర్ 7న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఈ వాస్తవాన్ని విస్మరించింది. పరిపాలన అస్తవ్యస్తం కాకుండా దిగ్బంధనాలను తొలగించే బాధ్యత గురించి నొక్కి చెబుతూనే వాటిని తొలగించడంలో అధికారుల వైఫల్యం ఉందని సుప్రీంకోర్టు ఆక్షేపణ తెలిపింది. కోర్టు అనుమతి అవసరం లేకుండానే ప్రజలను అసౌకర్యానికి గురిచేసే నిరసనకారులతో వ్యవహరించడానికి ఈ తీర్పు పోలీసులకు అనుమతిస్తుంది. న్యాయస్థానాలు ఈ చర్యలకు కేవలం చట్టబద్ధతను మాత్రమే ఇస్తాయి. అంతేగాని ప్రజలపై ఇష్టరాజ్యంగా కాల్పులు జరపడానికి కాదన్నది ఈ తీర్పు సారాంశం. శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటం అనే అంశం మీద నిపుణులు ప్రశ్నలు లేవనెత్తారు. పబ్లిక్ ఆర్డర్ లేకపోవడం అనేది ట్రాఫిక్‌కు అంతరాయం కాదు, చట్ట నియమాలకు ముప్పు వంటిది. అల్లర్లు జరగడం, రాజ్యంపై పెద్ద ఎత్తున దాడి చేయడం వంటిదేనని సుప్రీంకోర్టు నిర్వచించింది. షాహీన్ బాగ్‌లో పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.


2018 నాటి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రదర్శనలకు సంబంధించిన మరో కేసును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ శాంతియుత నిరసనలు, ప్రదర్శనల కోసం షాహీన్ బాగ్ ప్రాంతాన్ని పరిమితంగా ఉపయోగించుకోవటానికి సరైన యంత్రాంగాన్ని రూపొందించాలని పోలీసులను ఆదేశించింది. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే, రహదారుల దిగ్బంధనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, కేసుకు కేసుకు మధ్య కొన్నిసార్లు కోర్టుల దృక్పథం మారవచ్చని, కాబట్టి సార్వత్రిక విధానం ఉండకూడదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అసమ్మతి, క్రమానుగత నిరసన నిర్వహణ మధ్య ఉన్న సున్నితమైన సంబంధం విషయమై సుప్రీం కోర్టు వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్ర్యాన్ని ప్రస్తావించింది. వలస పాలనకు వ్యతిరేకంగా ఉన్న పూర్వపు అసమ్మతి పద్ధతిని, ప్రస్తుత స్వయం పాలిత ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసమ్మతితో సమానం చేయలేమని పేర్కొంది. విధుల పట్ల బాధ్యతతో కూడిన నిరసన తెలిపి, అసమ్మతిని వ్యక్తం చేసే హక్కును రాజ్యంగం ఇస్తుంది. నిర్ణయించబడిన ప్రదేశాలలో మాత్రమే నిరసన తెలపాలని సుప్రీంకోర్టు ఖండితంగా చెప్పింది. ఈ దృష్ట్యా ఢిల్లీలో నిరసనకారులు ఎంపిక చేసుకోవల్సిన ప్రదేశాల రెండే రెండు ఉన్నాయి. అవి: జంతర్ మంతర్ లేదా రామ్ లీలా మైదాన్. ఈ తీర్పు నగరంలోని ఇతర ప్రాంతాలలో నిరసనలను నివారించే సాధనంగా మారవచ్చు. కాబట్టి ముందస్తు షరతులతో నిరసనలను అనుమతించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను సమీకరించడం, ప్రజల కదలికలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తాయనేది స్పష్టం. మరి ఇదే సమయంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలకు కూడా సుప్రీం కోర్టు కోర్టు పరిశీలనలు వర్తిస్తాయా? సామాజిక మాధ్యమ వేదికలు ఏకధ్రువ ప్రభావిత ఉద్యమాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు విమర్శించింది. సాంకేతిక పరిజ్ఞానం డిజిటల్ ఉద్యమాలను సాధికారపరచడానికి ఎంతలా దోహదపడుతుందో అదే సమయంలో ఆ ఉద్యమాల బలహీనతకు కూడా అవకాశం కల్పిస్తుందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అనిరుద్ధ బోస్, కృష్ణ మురారిల ధర్మాసనం పేర్కొన్నది. ఈ వ్యాఖ్య సామాజిక మాధ్యమాల భిన్న ధృక్పథాలకు అద్దం పడుతుంది. సోషల్ మీడియా సంభాషణలపై కఠినమైన చట్ట నియమాలను అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు ఊతమిచ్చింది. 


వాస్తవానికి నిరసనకారులు ఎందుకు షాహీన్ బాగ్ లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో సమావేశమయ్యారో కోర్టు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనలను ప్రభుత్వ అభీష్టానికి అనుగుణంగానో, ప్రభుత్వ ధృక్పథానికి సానుకులంగానో వ్యక్తం చేయలేము. నిరసన వేదికలు కేవలం ఏకాభిప్రాయ ప్రకటనకు మాత్రమే అనుకులంగా ఉండే సాధారణ కేంద్రాలుగా ఉండకూడదు. పాత అసమానతలు, వివక్షలను తొలగించడానికి కొత్త అవసరాలకు, డిమాండ్లకు కూడా ఇవి వ్యక్తీకరణ వేదికలు కావాలి. 

మన రాజ్యాంగం హామీ ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కులలో అసమ్మతి హక్కు ఒకటి. ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించనంతవరకు లేదా కలహాలను ప్రోత్సహించనంతవరకు, ప్రతి ఇతర పౌరుడి నుంచి, అధికారంలో ఉన్నవారి నుంచి భిన్నంగా ఉండటానికి, తాను నమ్ముతున్న వాటిని ప్రచారం చేయడానికి అతనికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అసమ్మతి హక్కు అత్యంతావశ్యకం. ఒక దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక హక్కులతో పాటు పౌరహక్కులు కూడా పరిరక్షించబడాలన్నా అసమ్మతిని అనుమతించాలి. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని జాతి వ్యతిరేకతగా ముద్ర వేయడానికి, నిరసనలను వెలిబుచ్చే హక్కును నియంత్రించడానికి రాజ్యం సృష్టిస్తున్న భయానక వాతావరణం వాక్ స్వాతంత్రంపై నీళ్ళు చల్లేదిగా ఉందని జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హమైనవి.   

జయప్రకాశ్ అంకం

మహాత్మాగాంధీ యూనివర్సిటి

Updated Date - 2020-10-27T05:51:57+05:30 IST