పైలట్ పోరాటం అప్పుడూ ఇప్పుడూ

ABN , First Publish Date - 2020-07-17T05:59:41+05:30 IST

పాత తరం మీద కొత్త తరం తిరుగుబాటు చేయనిదెప్పుడు? సచిన్ పైలట్‌కు చాలా కాలం ముందు ఆయన తండ్రి రాజేశ్ పైలట్ కూడా ఒక యువ పోరాట యోధుడే. 1997లో భారత...

పైలట్ పోరాటం అప్పుడూ ఇప్పుడూ

రాజేశ్ పైలట్ ఎంత శక్తిమంతులతోనైనా తలపడేందుకు వెనుకాడేవారు కాదు. చంద్రస్వామిని జైలుకు పంపించిన తెగువ రాజేశ్ సొంతం. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం బీజేపీపై రాజీలేని పోరు చేసిన సాహసికుడు రాజేశ్. తనయుడు సచిన్ ఇప్పుడు బీజేపీతో తనకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని స్పష్టం చేస్తున్నారు. గెహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీని ఉపయోగించుకోవాలన్న ఆలోచన సచిన్‌ను పురిగొల్పివుంటుందనే విషయాన్ని త్రోసిపుచ్చలేము. సచిన్, గెహ్లోత్‌ల మధ్య అధికార పోరాటం తరాల మధ్య ఘర్షణ; సంస్కృతుల మధ్య తాకిడి; నవీనసభ్యతలు, గ్రామీణ నడవడికల మధ్య సంఘర్షణ.


పాత తరం మీద కొత్త తరం తిరుగుబాటు చేయనిదెప్పుడు? సచిన్ పైలట్‌కు చాలా కాలం ముందు ఆయన తండ్రి రాజేశ్ పైలట్ కూడా ఒక యువ పోరాట యోధుడే. 1997లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అష్టపదుల వయస్సులో ఉన్న సీతారాం కేసరిని పైలట్ సీనియర్ సవాల్ చేశారు. ఆ ప్రతిష్ఠాత్మక పోరాటంలో తాను విజేత కాబోనని రాజేశ్‌కు బాగా తెలుసు. పార్టీ నియోజక గణంలో అందరూ తన మద్దతుదారులే ఉండేలా కేసరి బహు జాగ్రత్తపడ్డారన్న సత్యం ఆనాటి యువ పైలట్‌కు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఆ యువ నేత నిరుత్సాహ పడలేదు. ‘కాంగ్రెస్ పార్టీ అంతరించిపోకుండా కాపాడేందుకే తాను ఈ పోరాటం చేస్తున్నానని’ రాజేశ్ పదే పదే నొక్కిచెప్పారు. ఆ పోరులో ఆయన ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ లోనే కొనసాగారు. పైలట్ సీనియర్ తన వ్యక్తిగత ఆకాంక్షను ఉత్కృష్ట లక్ష్యాల మాటున దాచిపెట్టారు. అయితే ఆయన కుమారుడు సచిన్ అటువంటి నిగూఢతను పాటించలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన బహిరంగంగా పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని, ప్రాభవాన్ని ప్రసాదించిన పార్టీ కోసంగానీ లేదా మారుతున్నకాలానికి అనుగుణంగా జాతికి కొత్త సైద్ధాంతిక మార్గదర్శకత్వాన్ని అందించేందుకుగానీ పోరాట పథంలోకి సచిన్ రాలేదు. ప్రతిష్ఠాత్మక పదవి కోసం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు, ఆయనకు మధ్య ఎటువంటి మినహాయింపులు లేకుండా చోటు చేసుకున్న వ్యక్తిగత ఘర్షణే రాజస్థాన్ తాజా రాజకీయం. 


తండ్రీతనయుల మధ్య తేడా పోరాట ధ్యేయాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ‘చాయ్ వాలా’ గతం గురించి దేశ ప్రజలతో ముచ్చటించడానికి చాలా కాలం ముందే రాజేశ్ పైలట్ మాతో వ్యక్తిగత సంభాషణల్లో తన ‘దూధ్ వాలా’ నేపథ్యం గురించి విపులంగా వెల్లడించారు. లూట్యెన్స్ ఢిల్లీలో తాను ఒక సైకిల్‌పై తిరుగుతూ, ఇప్పుడు పార్లమెంటులో తనకు సీనియర్ సహచరులుగా ఉన్న కొంత మంది విఐపీలకు పాలు విక్రయించానని పైలట్ సీనియర్ దాచుకోకుండా చెప్పారు. అవును, ఆయన స్వయం శక్తితో జీవితోన్నతిని సముపార్జించుకున్న ధీమంతుడు. భారత వాయుసేనలో ఒక స్క్వాడ్రన్ లీడర్‌గా ఉన్న రాజేశ్ 1980లో రాజకీయాలలోకి ప్రవేశించారు. నెమ్మదిగా, అయితే ఎటువంటి తడబాటు లేకుండా, ముందుకు సాగారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మంత్రి పదవినలంకరించారు.


తండ్రి రాజేశ్ రాజకీయ ప్రాభవానికి చాలాకాలం వేచివుండగా అందుకు భిన్నంగా తనయుడు సచిన్ గొప్ప ప్రాభవంతో రాజకీయాలలోకి ప్రవేశించారు. చాలామందికి దశాబ్దాల పాటు వేచివున్నా లభించని గుర్తింపు ఈ యువ పైలట్‌కు తొలుతనే లభించింది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన సచిన్ అనుకోకుండా రాజకీయాలలోకి ప్రవేశించడం అనివార్యమయింది. తండ్రి రాజేశ్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సచిన్ కార్యరంగం రాజకీయాలకు మారింది. సచిన్ ప్రత్యేకత ఏమిటి? 26ఏళ్ళ వయస్సులో పార్లమెంటు సభ్యత్వం, 31ఏళ్ళ వయస్సులో మంత్రి పదవి, 36ఏళ్ళ వయస్సులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి, 40ఏళ్ళ వయస్సులో ఉప ముఖ్యమంత్రి పదవి. రాజకీయాలలో ఇదొక శీఘ్ర శిఖరారోహణ, సందేహం లేదు. మరి ఆయన కాంగ్రెస్‌లోని ఒక కులీనుల బృందంలో సభ్యుడు కదా. రాజకీయ ప్రాభవాన్ని వారసత్వంగా పొందిన వారి సమ్మేళనమే ఆ బృందం. పదవులు తమ జన్మహక్కుగా వారు భావించారని చెప్పడం సత్యదూరం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబం గాంధీ-నెహ్రూలకు సన్నిహితులయినప్పుడు పదవులు వరించకుండా ఉంటాయా?


కుటుంబ వారసత్వం, అధినేత సాన్నిహిత్యం నుంచి సచిన్ లబ్ధి పొంది వుం డొచ్చు గానీ ఆయన భిన్నమైన రాజకీయ వంశీకుడు. ఒక సంపన్నుని బిడ్డగా కాకుండా, ఒక సామాన్యునిగా, తోటి మనుషుల యోగక్షేమాలకు పూచీపడే వ్యక్తిగా ఆయన ప్రజల వద్దకు వెళ్ళారు. వారిలో ఒకడుగా కలిసిపోయారు. గౌరవాదరాలను పొందారు. వారి శ్రేయస్సుకు తాను చేయగలిగినదంతా చేసిన ఉదాత్త నేత సచిన్ పైలట్. సరే, రాజస్థాన్ ఒక సంక్లిష్ట కుల సమాజం. కనుకనే తండ్రి రాజేష్ వలే, తనయుడు సచిన్‌పై కూడా ఒక గుజ్జర్ నాయకుడు అనే మూసభావన ఒకటి ప్రజల్లో ఉన్నది గుజ్జర్ సామాజిక వర్గేతరులలో సచిన్‌కు పెద్ద మద్దతు లేదు. అయినప్పటికీ సచిన్ ధైర్యంగా గుజ్జర్ సామాజికులు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేని అజ్మీర్ నుంచి 2009లో ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి సచిన్ మళ్ళీ పోటీ చేసి, ఓడి పోయారు. దరిమిలా తన కార్యరంగాన్ని న్యూఢిల్లీకి మార్చుకున్నారు. అదే ఏడాది రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. తాను అంతకు ముందు ఎన్నడూ పయనించని బాట పీసీసీ సారథ్యం. అయితే సంప్రదాయ బద్ధులైన రాజస్థానీయులలో సచిన్ పైలట్ పట్ల ఉన్న గౌరవాదరాలేమిటన్నది చర్చనీయాంశమే. అయితే తాను ఆంగ్లంలో అనర్గళంగా సంభాషించగల ‘బాబా లోగ్’ రాజకీయ వేత్తను కానని, ప్రజల శ్రేయస్సుకు చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తినని సచిన్ నిరూపించుకున్నారు. ఇదెవరూ కాదనలేని సత్యం.


తండ్రీతనయులు రాజేశ్, సచిన్ పైలట్‌లు భారత రాజకీయాలలో పూర్తిగా భిన్నమైన యుగాలకు చెందినవారన్న సత్యాన్ని మరచిపోవద్దు సుమా! కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం పరిపూర్ణంగా వెలిగిపోతున్నకాలంలో రాజేశ్ రాజకీయాలలోకి వచ్చారు, ఉన్నతి సాధించారు. కాంగ్రెస్ ప్రతిష్ఠ పూర్తిగా అడుగంటిన ప్రస్తుత కాలంలో సచిన్ స్వతంత్ర రాజకీయ కార్యాచరణకు ఉపక్రమించారు. లోక్‌సభలో 400 మందికి పైగా ఎంపీల బలమున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాజేశ్ మంత్రిగా ఉన్నారు. బలహీనపడిన కాంగ్రెస్ నేడు సర్వశక్తిమంతమైన భారతీయ జనతా పార్టీ నెదుర్కొంటున్నది. మరి ఇటువంటి పరిస్థితిలో సచిన్ లాంటి యువనేతల అవసరం కాంగ్రెస్‌కు మరింతగా లేదూ? రాజేశ్ పైలట్ ఎంత శక్తిమంతులతోనైనా తలపడేందుకు వెనుకాడేవారు కాదు. వివిఐపి ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామిని జైలుకు పంపించిన తెగువ రాజేశ్ సొంతం. ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా పలువురు కరడు గట్టిన నేరస్థుల ఆటకట్టించడంలో రాజేశ్ సఫలమయ్యారు. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం బీజేపీపై రాజీలేని పోరు చేసిన సాహసికుడు రాజేశ్. అప్పట్లో నరసింహారావు ప్రభుత్వంలోని పలువురు బీజేపీ పట్ల రాజీ వైఖరితో వ్యవహరించినప్పటికీ రాజేశ్ నిర్భయంగా హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. తనయుడు సచిన్ ఇప్పుడు బీజేపీతో తనకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని స్పష్టం చేస్తున్నారు. గెహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీని ఉపయోగించుకోవాలన్న ఆలోచన సచిన్‌ను పురిగొల్పివుంటుందనే విషయాన్ని త్రోసిపుచ్చలేము. సచిన్, గెహ్లోత్‌ల మధ్య అధికార పోరాటం తరాల మధ్య ఘర్షణ; సంస్కృతుల మధ్య తాకిడి; నవీనసభ్యతలు, గ్రామీణ నడవడికల మధ్య సంఘర్షణ.


ఆసక్తికరమైన విషయమేమిటంటే రాజీవ్ గాంధీ 1980 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీసుకువచ్చిన పెనుమార్పుల నుంచి అశోక్ గెహ్లోత్, రాజేశ్ పైలట్ లిరువురూ లబ్ధి పొందిన వారే కావడం. పాత తరం నాయకులను ఉపేక్షించి కొత్త తరం నేతలకు రాజీవ్ ప్రాధాన్యమిచ్చారు. రాజస్థాన్‌లో ఒక అశోక్ గెహ్లోత్‌కు, మధ్యప్రదేశ్‌లో ఒక దిగ్విజయ్ సింగ్‌కు, గుజరాత్‌లో ఒక అహ్మద్ పటేల్‌కు ఆయన ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో ఈ నాయకులందరూ తమ 30ల్లో వున్నారు. రాజకీయాలలో వారి విజయాలకు రాజీవ్ బాటలు పరిచారని చెప్పవచ్చు. రాజీవ్ 40 ఏళ్ళ వయస్సులో ప్రధానమంత్రి అయ్యారు. తన కేబినెట్‌లో పైలట్ సీనియర్, పి. చిదంబరం, అరిఫ్ మహమ్మద్ ఖాన్ మొదలైన యువ ప్రతిభావంతులకు స్థానం కల్పించారు. 


ఏఐసిసి అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ తన తొలి నాళ్లలో ప్రతిభావంతులైన యువ నాయకుల పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి ఆరాటపడ్డారు. ఆ కృషిలో భాగంగానే సచిన్ పైలట్‌ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడుగా పంపించారు. ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు యువ నేతలకు పీసీసీ సారథ్యాలను అప్పగించారు. అయితే వీరిలో పలువురు రాజీవ్ గాంధీ తరానికి చెందిన అనుభవజ్ఞులు, అభద్రతా భావంలో ఉన్న నాయకుల చాణక్యాలను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఉదాహరణకు గత ఏడాది ఢిల్లీలో అజయ్ మేకన్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు, హర్యానాలో అశోక్ తన్వార్ సీనియర్ నాయకుడు పీసీసీ నాయకత్వాన్ని అప్పగించడం జరిగింది. సచిన్ పైలట్ ఒక విధంగా కాంగ్రెస్‌లో చివరి యువ యోధుడని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నుంచి నిష్క్రమించారు. కాంగ్రెస్‌లో పాతతరం నాయకులు మళ్ళీ పార్టీపై తమ పట్టును బిగించారనడానికి సచిన్ నిష్క్రమణే మరో తిరుగులేని నిదర్శనం. తండ్రీ తనయుల మధ్య ఏదైనా ఒక ఉమ్మడి లక్షణం ఉందంటే అది వారి ప్రగాఢ అధికార లాలస, తిరుగుబాటు తత్వమూ అని చెప్పాలి. రాజేశ్ పైలట్ తన ప్రయత్నాలలో కిందబడ్డ ప్రతిసారీ పైకి లేచారు. సచిన్ సైతం ఎట్టి పరిస్థితులలోనూ తన పోరాటాన్ని విరమించడని తప్పక చెప్పవచ్చు.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-07-17T05:59:41+05:30 IST