కొత్త పింఛన్‌ విధానం రాజ్యాంగ వ్యతిరేకం

ABN , First Publish Date - 2020-09-01T06:23:55+05:30 IST

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, దేశ విదేశ బహుళజాతి సంస్థల పల్లవి అందుకొన్న పాలకులు 16 ఏళ్ళ క్రితం పాత పెన్షన్‌కు పాతర వేశారు...

కొత్త పింఛన్‌ విధానం రాజ్యాంగ వ్యతిరేకం

2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతగా వై.యస్‌.జగన్‌మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తాననే గట్టిగా హామీ ఇచ్చారు. దానిని ఎన్నికల ప్రణాళికల్లో కూడా చేర్చారు. 15 నెలలు గడిచాయి. రెండు బడ్జెట్‌ ప్రసంగాలలో సిపిఎస్‌ ప్రస్తావన లేదు. కమిటీ కాలాన్ని పొడిగిస్తూ కాలయాపన చేసున్నారు.


ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, దేశ విదేశ బహుళజాతి సంస్థల పల్లవి అందుకొన్న పాలకులు 16 ఏళ్ళ క్రితం పాత పెన్షన్‌కు పాతర వేశారు. ముప్పది ఏళ్ళుగా దేశంలో, రాష్ట్రాలలో పాలకులు అమలు చేసిన సంస్కరణల కార్యక్రమం ఉపాధి రహిత అభివృద్ధిలో ఉద్యోగాలను మింగేసింది. చివరకు ఉద్యోగుల పెన్షన్‌కు ఉరేసింది. 1857లో జరిగిన స్వాతంత్య్ర సంగ్రామం సందర్భంగా బ్రిటనులో అమలు చేస్తున్న పెన్షన్‌ విధానాన్ని మన దేశంలోని ప్రభుత్వ సిబ్బందికి అమలు చేయాలనే డిమాండ్‌ వచ్చింది. బ్రిటీష్‌ ఇండియా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విధానాలపై రాయల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. 1871లో పెన్షన్‌ చట్టం రూపొందింది. 1885లో మొదటిసారిగా ‘‘పెన్షన్‌ బెనిఫిట్‌’’ అవార్డు ప్రకటించింది. 1919, 1935 చట్టాలలో మరి కొన్ని నిబంధనలు చేర్చి పదవీవిరమణ ప్రయోజనాలను ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు విస్తరింపచేశారు. 1945 నుంచి ఉద్యోగులకు ఇచ్చే కరువుభత్యాన్ని పెన్షనర్లకూ వర్తింపచేశారు.


స్వాతంత్య్రానంతరం 1950 నుంచి డెత్‌ కవ్‌ు రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ పూర్తి స్థాయిలో అమలు చేశారు. 1964 జనవరి ఒకటి నుంచి కుటుంబ పెన్షన్‌ ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా ఉద్యోగ సంఘాల పోరాటాల ఫలితంగా, పి.ఆర్‌.సిల ద్వారా పెన్షన్‌ సౌకర్యాలు బాగా మెరుగుపడ్డాయి. పెన్షన్‌పై పాలకులు దాడి చేసిన ప్రతి సందర్భంలోను సుప్రీంకోర్టు, హైకోర్టులు పెన్షన్‌ చట్టాలను, రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ పెన్షన్‌ హరించే హక్కు పాలకులకు లేదని తీర్పులు ఇచ్చాయి. నేడు ఉద్యోగి పదవీవిరమణ జీవితానికి, ఉద్యోగి చనిపోతే కుటుంబ పెన్షనర్‌ జీవితానికి పెద్ద భరోసా ఉంది. లక్షలాది కుటుంబాల సామాజిక భద్రతకు భరోసాగా ఉన్న ఇంతటి చరిత్ర గలిగిన పెన్షన్‌ చట్టాలను ఒక్క కలం పోటుతో కేంద్ర, రాష్ట్రాల పాలకులు ఎవరి ప్రయోజనాల కోసం ఎందుకు తీసేసారు?


ఇప్పటివరకు పెన్షన్‌ నిధుల నిర్వహణ ప్రభుత్వం చేతిలోనే ఉంది. కేంద్రం వద్ద సుమారు 3 లక్షల కోట్ల పెన్షన్‌ నిధులు ఉన్నాయి. ఈ నిధులను షేర్‌ మార్కెట్‌లో పెట్టి, స్వదేశీ విదేశీ సంస్థలకు అప్పజెప్పమని అంతర్జాతీయంగా పెత్తనం చలాయించే అమెరికా జారీ చేసిన ఆదేశాల మేరకు పెన్షన్‌ నిధుల నిర్వహణను మన పాలకులు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.


2003లో బిజెపి ప్రభుత్వం పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ నోటిఫికేషన్‌ యిచ్చింది 2003 అక్టోబర్‌ 10న క్యాబినెట్‌ తీర్మానం చేసి పాతపెన్షన్‌ రద్దు చేసింది. కేవలం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌తోనే రక్షణరంగ ఉద్యోగులకు మినహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2004 నుంచి నూతన జాతీయ పెన్షన్‌ పథకాన్ని అమలు చేసింది. 2004 డిసెంబర్‌లో మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వం అత్యవసరంగా పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ బిల్లుపై ఆర్డినెన్స్‌ తెచ్చింది. మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వం 2005లో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినా వామపక్షాలు అడ్డుకోవడంతో ఆగిపోయింది. యుపిఎ-- ప్రభుత్వం రెండవసారి అధికారం కొచ్చిన వెంటనే బిజెపి సహకారంతో పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎకు చట్టబద్దతకోసం శతవిధాల ప్రయత్నించింది చివరకు 2013 సెప్టెంబరు 6న వామపక్ష, డిఎంకె, తృణముల్‌ సభ్యుల నిరసనల మద్య బిల్లు ఆమోదం పొందింది. నాడు పార్లమెంట్‌లో టిడిపి, వైసిపి బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. 2013 సెప్టెంబరు 18న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టం అయ్యింది. పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ చట్టం కాకుండానే 2003–-2013 మధ్య పదేళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యనిర్వాహక ఉత్తర్వులతో కొత్త పెన్షన్‌ విధానం అమలు చేయటం రాజ్యాంగ వ్యతిరేకం.


2004 మేలో అధికారం చేపట్టిన వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004 సెప్టెంబరు 1 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో సిపియస్‌ విధానాన్ని అమలు చేసింది. 2013 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. 2014 నుంచి టి.డి.పి అధికారంలో ఉంది. ఈ కాలమంతా సిపిఎస్‌ రద్దు కొరకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చాయి. టిడిపి ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తూ వచ్చింది. 


2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతగా వై.యస్‌.జగన్‌మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తాననే గట్టిగా హామీ ఇచ్చారు. దానిని ఎన్నికల ప్రణాళికల్లో కూడా చేర్చారు. 15 నెలలు గడిచాయి. రెండు బడ్జెట్‌ ప్రసంగాలలో సిపిఎస్‌ ప్రస్తావన లేదు. కమిటీ కాలాన్ని పొడిగిస్తూ కాలయాపన చేసున్నారు. కమిటీలొద్దు-, హామీ ఇచ్చిన దానిని రాజకీయ నిర్ణయంగా అమలు చేయాలని శాసనమండలి సమావేశాలన్నింటా పిడియఫ్‌, ఇతర ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్‌ 1న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సత్యాగ్రహం, నిరసన దీక్షలు చేస్తున్నాయి. బహిరంగ సభల్లో ఇచ్చిన మాట -ప్రణాళికలో రాసిన రాతకు కట్టుబడి ప్రభుత్వం సిపిఎస్‌ రద్దు ఉత్తర్వులు ఇవ్వాలి.

 ఇళ్ళ వెంకటేశ్వరరావు, పిడియఫ్‌ ఎమ్మెల్సీ

Updated Date - 2020-09-01T06:23:55+05:30 IST