మనిషే గెలుస్తుంది
ABN , First Publish Date - 2020-04-05T07:18:47+05:30 IST
జీవ కిరీటం దక్కుతుందో లేదో గాని చావు కిరీటానికి చిక్కొద్దనుకున్నారు ప్లాస్టిక్ మూటగా మారొద్దనుకున్నారు మాయి ముంతల్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు మృత్యు కిరీటాలు విమానమెక్కి వచ్చేశాయి గత్తర కత్తెరలై పేదలపై బడ్డాయి...

జీవ కిరీటం దక్కుతుందో లేదో గాని
చావు కిరీటానికి చిక్కొద్దనుకున్నారు
ప్లాస్టిక్ మూటగా మారొద్దనుకున్నారు
మాయి ముంతల్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు
మృత్యు కిరీటాలు విమానమెక్కి వచ్చేశాయి
గత్తర కత్తెరలై పేదలపై బడ్డాయి
మెతుకులు లేకున్నా బలుసాకున్నా చాలు
బతుకు జీవుడా అనుకున్నారు!
దూరాభారమైన పల్లెలు కావొచ్చు
స్వర్ణ చతుర్భుజి రహదార్లూ కావొచ్చు
ఆకలి అభద్రత భయం దైన్యం నిర్వేదాల
మట్టి కాళ్ళ మహా యాత్రలు
చంకల్లో చిన్న ప్రాణాలు
చేతుల్లో సంసారం మూటలు
నెత్తిన ఎండ ప్రచండాలు
కడుపులో ఆకలి రాగాలు
అడవి తగలబడుతున్నపుడు
మూగ జీవాల రోదనలూ
రెక్కలల్లార్చే పక్షుల భయాలూ ఉంటాయే
అట్టాంటియే ఇప్పటి వలస మూటల భయాలూ
మంచి నీరిచ్చే మోషే మంత్ర దండం లేదు
ఆకలి తీర్చే ‘మన్నా’ ఏ ఆకాశం నుంచీ కురియదు
భూమికీ - మండే సూర్యుడికీ మధ్య
క్షుధానల దగ్ధ మూర్తులు ఈ వలస జీవులు
మనిషి తల్లి భూమి
మనిషి ఊయల భూమి
మనిషి సంకేతం భూమి
మనిషి కేతనం భూమి
మనిషి జీవ గృహం భూమి
మనిషి హక్కు భూమి
మనిషి సంతకం భూమి
మనిషి స్వాస్థ్యము భూమి
చివరకు మనిషే గెలుస్తుంది
మృత్యు కిరీటం మట్టిలో కలుస్తుంది
కృపాకర్ మాదిగ