సామాజిక న్యాయం పాలకుల ఇష్టమా?

ABN , First Publish Date - 2020-02-20T09:09:11+05:30 IST

పదోన్నతిలో రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదని; ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని స్పష్టంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఒక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సహజంగానే దేశంలో పెద్దచర్చకు తెరతీసింది...

సామాజిక న్యాయం పాలకుల ఇష్టమా?

పదోన్నతిలో రిజర్వేషన్‌కు సంబంధించి వెనుకబడిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేక పట్టించుకోక పోవడమనే అతి ముఖ్య విషయాన్ని రాజ్యాంగం ప్రభుత్వాలకు విడిచిపెట్టిందని సుప్రీం కోర్టు భావించడం ఆశ్చర్యకరంగా వున్నది. కార్యనిర్వాహక వ్యవస్థకు ఆదేశాలు ఇవ్వవలసిన తన రాజ్యాంగ బాధ్యతను, అధికారాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం వదులుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


పదోన్నతిలో రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదని; ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని స్పష్టంచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఒక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సహజంగానే దేశంలో పెద్దచర్చకు తెరతీసింది. పార్లమెంటులోనూ దీనిపై దుమారం లేచింది. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని లేదా కోర్టు పరిధినుంచి రిజర్వేషన్ల అంశాన్ని తొలగించి రాజ్యాంగం 9వ షెడ్యూలులో చేర్చాలని ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రభుత్వ మిత్ర పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. తాము రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని పాలక బీజేపీ చెప్తుందే గానీ నిర్దిష్ట చర్య లేవీ చేపట్టడం లేదు. 

పదోన్నతిలో రిజర్వేషన్ల అమలును కోరిన ఒక పిటిషన్ దారుకు అనుకూలంగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. వివరంగా చూస్తే, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలో సహాయక ఇంజనీర్లకు పదోన్నతి కల్పించడంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పాటించవద్దని నోటిఫికేషన్‌ ఇచ్చింది. పదోన్నతులలో రిజర్వేషన్లు పాటించేటట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా ఆ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. దానిపై తీర్పు వెలువరిస్తూ పదోన్నతిలో రిజర్వేషన్లు పాటించాలా లేదా అనేది నిర్ణయించడానికి ఆయా సామాజిక వర్గాలు ప్రభుత్వోద్యోగాల్లో ఏమేరకు ప్రాతినిధ్యం పొందుతున్నాయన్న విషయమై నాలుగు నెలల్లో గణాంకాలు సేకరించాలని, ఆ గణాంకాలపై ఆధారపడి, ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న సామాజిక వర్గాల వారికి పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలైంది. జస్టిస్‌ లావు నాగేశ్వర రావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా సభ్యులుగా వున్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. 

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్‌ కల్పించాలా లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. కల్పించదలుచుకుంటే ఆయా సామాజిక వర్గాలు ప్రభుత్వోద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కలిగి లేవని చూపించే గణాంకాలను ముందుగా సేకరించాలని తీర్పు చెప్పింది. ఏదేని సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించాలని అనుకోకపోతే గణాంకాలు సేకరించవలసిన పనిలేదని కూడా సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది. అటువంటి గణాంకాలు అందుబాటులో ఉన్నా వాటిపై ఆధారపడి రిజర్వేషన్లు అమలు జరపాలని ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగానే ఉంది. అయితే, ఈ తీర్పు రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అన్నదే చర్చనీయాంశం.

ఈ వ్యాజ్యం నేరుగా చేసే నియామకాల విషయం కాదు. ఈ కేసు గురించి సుప్రీం కోర్టు తీర్పు మొదటి పేరాలోనే ‘పదోన్నతిలో రిజర్వేషన్‌కు సంబంధించిన’దని స్పష్టంగా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుకూడా పదోన్నతిలో రిజర్వేషన్‌కు సంబంధించినదే. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు రద్దుచేయడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012 సెప్టెంబర్‌ 5న పదోన్నతిలో రిజర్వేషన్‌ పాటించవద్దని ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, హైకోర్టు తీర్పును రద్దుచేసిన సుప్రీం కోర్టు తీర్పు కూడా పదోన్నతుల్లో రిజర్వేషన్ల గురించి మాత్రమే. అయినా సుప్రీం కోర్టు తన తీర్పులో భాగంగా డైరెక్టు రిక్రూట్‌మెంట్‌లో కూడా రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని పేర్కొనడంతో సమస్య బాగా విస్తరించింది. 

రిజర్వేషన్లు సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు భావించి ఉంటే కొన్ని పరిమితుల్లోనైనా పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పేది. పదోన్నతుల్లో రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కా కాదా తేల్చాలంటే అసలు రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాల ప్రాథమిక హక్కా కాదా తేల్చాలి. నేరుగా జరిపే నియామకాల్లో రిజర్వేషన్లకు ఏ వాదన వర్తిస్తుందో అదే వాదన పదోన్నతుల విషయంలోనూ వర్తిస్తుంది. అందుకే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కా కాదా అన్న విషయం తోనే తన తీర్పు ముడివడి ఉందని సుప్రీం కోర్టు గ్రహిం చింది. అందుకే కావచ్చు, కేసు, తీర్పు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు పరిమితమైనవి అయినా తీర్పు ఉపోద్ఘాతంలో రిజర్వేషన్‌ సమస్యను మొత్తంగా సుప్రీం కోర్టు చేపట్టింది. వెనుకబాటును అధిగమించిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌ ఇవ్వడం అంటే ఇతరుల విషయంలో సమానత్వపు న్యాయాన్ని పాటించకపోవడమే అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లు కల్పించినప్పుడు లేదా కొనసాగించినప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టలేము. ఐతే తాజా గణాంకాల ప్రకారం వెనకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించకపోవడం, కొనసాగించకపోవడం ఆయా సామాజిక వర్గాల ప్రాథమిక హక్కుకు భంగం కాదా అంటే కాదు అని సుప్రీం కోర్టు అంటుంది. వెనుక బడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌ అనేది ప్రాథమిక హక్కు కాదని కోర్టు స్పష్టంగా ప్రకటించింది. ఇంత పెద్ద విషయంపై కోర్టు తగిన వాదన చేయకుండా గత కొన్ని తీర్పులను (ఉదా: సురేష్‌చంద్‌ గౌతమ్‌ కేసు-–2016) ఉటంకించి తన తీర్పును జోడిం చింది. అయితే రిజర్వేషన్లపై గత తీర్పులు సరైనవి కావని, వాటిని పునఃపరిశీలించాలన్న సీనియర్‌ న్యాయవాదులు కొలిన్‌ గొంజాల్వెజ్‌, దుష్యంత్‌ దావే, కపిల్‌ సిబాల్‌ల వాదనను కోర్టు పట్టించుకోలేదు. 

భారత రాజ్యాంగం మొదటి వాక్యమే, ‘భారతదేశ ప్రజమైన మేము... అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కొరకు... అందరికీ సమానమైన గౌరవం, సమానమైన అవకాశాల కొరకు... ఈ రాజ్యాంగాన్ని... మాకు మేము ఇచ్చుకుంటున్నాము.’ అని పేర్కొంది. ఈ పీఠికలో సమానత్వమే కాక సమాన అవకాశాల గురించి కూడా నొక్కిచెప్పడం జరిగింది. అంటే అవకాశాలలో వెనుకబడిన వారి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనినే జస్టిస్‌ చిన్నప్పరెడ్డి తన బి.సి కమీషన్‌ రిపోర్టులో పాజిటివ్‌ వివక్ష అన్నారు. రిజర్వేషన్ సదుపాయం వివక్ష కాదని, అది సమానత్వ సాధనకు ఉపయోగపడే ప్రగతి శీల వివక్ష అని జస్టిస్‌ చిన్నప్పరెడ్డి అన్నారు. అసమానతల నిర్మూలన ఒక సామాజిక అవసరం అని అందుకే రిజర్వేషన్లు ప్రగతిశీలమైనవని రాజ్యాంగ నిర్మాతలు భావించి రాజ్యాంగంలో పొందు పరిచారు. ఈ వాస్తవాన్ని ప్రజలు సరే, పార్టీలు, చివరికి కోర్టులు కూడా మరిచిపోతున్నట్లు ఉన్నాయి. 

రాజ్యాంగం అధికరణం 16లో క్లాజు 4, 4 ఎ లను సుప్రీం కోర్టు తీర్పులో ప్రస్తావించారు. అయితే వాటిని వాటి సందర్భంలో గ్రహించినట్లు అనిపించదు. భారత రాజ్యాంగంలో అధికరణం 12 నుండి అధికరణం 35 వరకు ప్రాథమిక హక్కులుగా పేర్కొనబడ్డాయి. అధికరణం 14,15,16 సమానత్వపు హక్కు, వివక్షకు వ్యతిరేకమైన హక్కు, విద్యా, ఉద్యోగావకాశాలలో రిజర్వేషన్‌ హక్కును కల్పిస్తున్నాయి. రాజ్యాంగ భాగం 3లో ఉన్న ఈ హక్కులు ప్రాథమిక హక్కులు కాకుండా ఎలా పోయాయో మాత్రం సుప్రీం తన తీర్పులో వివరించలేదు. 14,15,16తో సహా భాగం 3లో ఉన్న అధికరణలన్నీ ప్రాథమిక హక్కులే. నిజానికి ప్రాథమిక హక్కు రెండు రకాలు. వాక్‌ స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం, సంఘ స్వాతంత్ర్యం వంటి హక్కులు మొదటి రకం. ఇవి రాజ్యాధిపత్యం నుండి పౌరులకు రక్షణ కల్పిస్తున్నాయి. వీటి కొరకు ప్రభుత్వం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ప్రజల హక్కులను గౌరవిస్తే సరిపోతుంది. సమాన అవకాశాల కొరకు హక్కు, సామాజిక న్యాయం, విద్యా హక్కు (21ఎ) వంటివి రెండవ రకం హక్కులు. వీటిని ప్రభుత్వం పౌరులకు కల్పించాలి. అందుకు ప్రత్యేకమైన అనుకూల చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో పౌరుల హక్కులు ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగం నాల్గవ భాగమైన ఆదేశిక సూత్రాల విషయం వేరు. అందులో ఇవ్వబడిన హక్కుల విషయంలో ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంటుంది, ప్రాథమిక హక్కు విషయంలో ప్రభుత్వాలకు వెసులుబాటు ఉండదు. సుప్రీం కోర్టు తన తీర్పులో క్లాజు 16 -4, 4ఎలు ప్రభుత్వాలకు నిర్దేశించబడిన విధులు కావని, ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుంటే ఆ అధికారం వాటికి కల్పిస్తున్నాయని పేర్కొంది. క్లాజు 16 -4; 4ఎలు సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పినట్లు ప్రభుత్వానికి అధికారాలు కల్పించే క్లాజులు. వెనుక బడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు నిరాకరించే అధికారాలు కావు, అవి స్పష్టంగా, రిజర్వేషన్‌ కల్పించే అధికారాలు. వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌ నిరాకరించే అధికారం ప్రాథమిక హక్కుల భాగంలో రాజ్యాంగ నిర్మాతలు చేర్చారని భావించలేము.  వెనుకబడిన వర్గాలను పట్టించుకోవడం లేక పట్టించుకోకపోవడం అనేది రాజ్యాంగం ప్రభుత్వాలకు విడిచిపెట్టిందని సుప్రీం కోర్టు భావించడం ఆశ్చర్యకరమైన విషయం. ఆయా సందర్భాలలో ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వవలసిన తన రాజ్యాంగ బాధ్యత, అధికారాన్ని సుప్రీం కోర్టు చేజేతులా వదులుకోవడం ఆందోళనకలిగిస్తోంది. ఈ తీర్పు సామాజిక న్యాయానికే కాదు, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజన సమతౌల్యతకు కూడా భంగకరంగా ఉన్నది.

రమేష్‌ పట్నాయిక్‌

అఖిభారత విద్యాహక్కు వేదిక

Updated Date - 2020-02-20T09:09:11+05:30 IST