వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం

ABN , First Publish Date - 2020-08-20T06:07:01+05:30 IST

కేంద్రప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్స్ 21ఎ, 45 మరియు 51(కె) లను చేరుస్తూ దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలకు ఉచిత...

వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం

కేంద్రప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్స్ 21ఎ, 45 మరియు 51(కె) లను చేరుస్తూ దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఆర్టికల్ 21ఎ ప్రకారం దేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి, ఆర్టికల్ 45 ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాల బాలికలకు 6 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత విద్యా సదుపాయాలను కల్పించాలి, ఆర్టికల్ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది, ఆర్టికల్ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు.


సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012లో ప్రతిమా ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలువరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 15(5) లను ఆమోదిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వేషన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్ 13(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సుమారు 41337 ఉన్నవి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 70%, ప్రైవేటు పాఠశాలలు 30% నడుస్తున్నవి. వీటిలో విద్యార్థుల అడ్మిషన్లను ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలలో 52% అధికంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కల్పిస్తున్న 25% రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు ఉన్నవి. రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణకు సరైన అధికార యంత్రాంగం లేకపోవడం విచారకరం. నిరు పేద ప్రజలకు కూడా పై రిజర్వేషన్లపై సరైన అవగాహన లేదు. ఒకవైపు దినదినం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గి, ప్రైవేటు విద్యా సంస్థల సంఖ్య పెరుగుతుంది. గుర్తింపులేని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు లెక్కలేనన్ని నడుపుతున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం అనేక సూచనలు, పాఠశాలల నిర్మాణంపై కూడా అనేక నిబంధనలను సూచిస్తూ సుప్రీం కోర్టు  2009లోను, 2017లోను కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది.


ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్లమెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి 100% అక్షరాస్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న 10+2 విద్యా విధానం 5+3+3+4గా మారనుంది. నూతన విద్యా విధానంలో దేశంలోని బాల బాలికలను 3 నుండి 18 సంవత్సరాల మధ్య వయసువారిని చేరుస్తున్నారు. ఇందులో బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కుపై బాలల వయసు 6 నుండి 14 సంవత్సరాల పరిమితిని మారుస్తారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించినట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఉంది.

కోడెపాక కుమార స్వామి, సామాజిక విశ్లేషకులు

Read more