మహా పండితుడు కాణే

ABN , First Publish Date - 2020-03-13T06:31:58+05:30 IST

పూనాలో తన 92వ యేట నిర్యాణం చెందిన డాక్టర్ పాండురంగ వామన్ కాణే ప్రపంచ ప్రసిద్ధికెక్కిన సంస్కృత పండితుడు. న్యాయశాస్త్రంలో కూడా ఆయన మహా పండితుడే. 1947 నుంచి 1949 వరకు రెండేళ్ల పాటు బొంబాయి...

మహా పండితుడు కాణే

డాక్టర్ కాణే కీర్తిని శాశ్వతంగా నిలపగలిగినట్టిది ఆయన వ్రాసిన ‘హిస్టరీ ఆఫ్ ధర్మ శాస్త్ర’ అనే బృహత్తర గ్రంథం. కొన్ని వేల పుటలకు విస్తరిస్తున్న ఈ గ్రంథం హిందూ ధర్మ శాస్త్రాలకు సంబంధించినంతవరకు ఒక ప్రామాణిక రచన మాత్రమే కాక ‘ఎన్‌సైక్లోపీడియా’. దీని చివరి సంపుటిని ఆయన 1963లో ప్రచురించిన సందర్భంలోనే నాటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ స్వయంగా పూనా వెళ్ళి, డాక్టర్ కాణేను ‘భారతరత్న’గా సన్మానించారు.


పూనాలో తన 92వ యేట నిర్యాణం చెందిన డాక్టర్ పాండురంగ వామన్ కాణే ప్రపంచ ప్రసిద్ధికెక్కిన సంస్కృత పండితుడు. న్యాయశాస్త్రంలో కూడా ఆయన మహా పండితుడే. 1947 నుంచి 1949 వరకు రెండేళ్ల పాటు బొంబాయి యూనివర్శిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ కూడా. ఇట్టి పదవులను పెక్కింటిని డాక్టర్ కాణే అధిష్ఠించారు. ఇట్టి గౌరవాలను పెక్కింటిని ఆయన పొందారు. ఈ పదవులలో చిట్ట చివరిది ‘నేషనల్ ప్రొఫెసర్ షిప్’; ఆ గౌరవాలన్నింటిలో గొప్పది ‘భారతరత్న’.

ఈ పదవుల కంటె, ఈ గౌరవాల కంటె డాక్టర్ కాణే కీర్తిని శాశ్వతంగా నిలపగలిగినట్టిది ఆయన వ్రాసిన ‘హిస్టరీ ఆఫ్ ధర్మ శాస్త్ర’ అనే బృహత్తర గ్రంథం. కొన్ని వేల పుటలకు విస్తరిస్తున్న ఈ గ్రంథం హిందూ ధర్మ శాస్త్రాలకు సంబంధించినంతవరకు ఒక ప్రామాణిక రచన మాత్రమే కాక ‘ఎన్‌సైక్లోపీడియా’. దీన్ని రచించడానికి ఆయన 35 సంవత్సరాలు పరిశోధన చేయవలసి వచ్చింది. దీని చివరి సంపుటిని ఆయన 1963లో ప్రచురించిన సందర్భంలోనే నాటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ పూనా స్వయంగా వెళ్ళి, డాక్టర్ కాణేను ‘భారతరత్న’గా సన్మానించారు. సంస్కృత భాషా పాండిత్యానికి ఛాందసత్వంతో సన్నిహిత బంధుత్వం సర్వ సాధారణం. కాని, డాక్టర్ కాణే దృష్టి, ఆయన చింతన ఆధునిక మైనట్టివి. ఆయన సంస్కరణను అభిమానించారు. ప్రగతిని కాంక్షించారు. తన భౌతిక కాయాన్ని మంత్రతంత్రాలతో చితిమీద పెట్ట వలదని, దాన్ని ‘ఎలక్ట్రిక్ క్రిమెటోరియమ్’లో దహనం చేయవలసిందిగా డాక్టర్ కాణే చెప్పి పోవడం ఆయన సంస్కరణ దృష్టికి ఒక నిదర్శనం.

1972 ఏప్రిల్ 21 ఆంధ్రజ్యోతి సంపాదకీయం

‘డాక్టర్ పాండురంగ వామన్ కాణే’ నుంచి

Updated Date - 2020-03-13T06:31:58+05:30 IST