ప్రజారోగ్యంలో డిజిటల్‌ విప్లవం

ABN , First Publish Date - 2020-08-18T07:25:47+05:30 IST

కరోనా మహమ్మారితో మొత్తం ప్రపంచ ప్రజల దృష్టి ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల వైపు మళ్లింది. ప్రజలందరికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావలసిన...

ప్రజారోగ్యంలో డిజిటల్‌ విప్లవం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ఆరోగ్య కార్డు పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఆరోగ్య సేవలలో డిజిటల్‌ సాంకేతికతను పెద్దఎత్తున వినియోగించడం ద్వారా ఈ రంగంలో మరో భారీ విప్లవానికి ప్రధాని నడుంబిగించినట్లు అయింది. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు కానున్న ఈ పథకం దేశవ్యాప్తంగా ఎప్పుడు అమలు కానుందా అని దేశ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 


కరోనా మహమ్మారితో మొత్తం ప్రపంచ ప్రజల దృష్టి ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల వైపు మళ్లింది. ప్రజలందరికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యతలపై ప్రభుత్వాలు దృష్టి సారింప వలసి వస్తున్నది. ఈ అంశం ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోదీ చాలా ముందు గానే గ్రహించారు. దేశంలో 40శాతం ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంకోసం ప్రపంచంలోనే అతి విస్తృత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌ను సెప్టెంబర్‌, 2018 నుండి అమలులోకి తీసుకువచ్చారు. 50 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చే ఈ మహత్తర కార్యక్రమం ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద వైద్య సేవా కార్యక్రమం. 


స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి మోదీ మరో కీలక ప్రకటన చేశారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఆరోగ్య సేవలలో డిజిటల్‌ సాంకేతికతను పెద్దఎత్తున వినియోగించడం ద్వారా ఈ రంగంలో మరో భారీ విప్లవానికి ప్రధాని నడుంబిగించినట్లు అయింది. ప్రతి వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. నేడు మొత్తం ప్రపంచం డిజిటల్‌మయం అవుతున్న సమయంలో వైద్య సేవలను సహితం డిజిటల్‌ కావించడం అపూర్వమైన మలుపు. ఈ విధానం ప్రజలకు ఆరోగ్య సేవల విషయంలో మెరుగైన నిర్ణయం తీసుకోవడంలో సాధికారికత కల్పిస్తుంది. 


ఈ పథకంలో ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే విషయంలో పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే నిర్ణయాధికారముంటుంది. కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్‌ ఐడీ ఇస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టవ్‌ులోకి లాగిన్‌ కావచ్చు. దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి రూ.300కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకం– దేశంలో ఏ వైద్యుడు, ఏ ఆస్పత్రిని సందర్శించినా వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్‌ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలించే సౌలభ్యం కలుగుతుంది. ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్థితిని సమూలంగా మార్చేందుకు ఈ పథకం అవకాశం కలిపిస్తుంది. అదే సమయంలో ఈ పథకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు ఉంటాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. 


ఈ పథకాన్ని మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానం జరుపుతారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు. ముందుగా పైలట్‌ ప్రాజెక్ట్‌ వలె ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య సంస్థకే ఈ పథకంను రూపొందించి, అమలు పరచే బాధ్యతను కూడా కేంద్రం అప్పచెప్పింది. 


ప్రతి పౌరునికి ఒక ప్రత్యేక ఐడిని సమకూర్చడం వల్లన ఆరోగ్య ఐడీ, ఆరోగ్య సదుపాయం రిజిష్టరీ, వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు, ఈ- ఫార్మసీ, టెలి మెడిసిన్‌ సదుపాయాలు ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వస్తాయి. వైద్యులు, ఆసుపత్రులు, మందుల షాపులు, బీమా కంపెనీలు అందరిని పౌరులతో అనుసంధానిస్తారు. వారికి సమగ్ర డిజిటల్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తారు. ఈ పథకంలో కీలక అంశం ఏమిటంటే ఆరోగ్య ఐడీ, ఆరోగ్య రిజిష్టరీలను భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ నేరుగా నిర్వహిస్తుంది. దానితో ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించినట్లు అవుతుంది. ఆరోగ్య సేవలు అందించడంలో ప్రైవేట్‌ భాగస్వాములకు సహితం సమాన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ పథకంలో తమ సేవలను, ఉత్పత్తులను అనుసంధానం చేసుకొనే వీలు లభిస్తుంది. అయితే ఆరోగ్య ఐడీ సృష్టించడం లేదా ఒక డాక్టర్‌తో అనుసంధానం చేయడం వంటివి ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది.  


వ్యక్తిగత ఆరోగ్య రికార్డు, ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డు వంటి వాటిని తయారు అభివృద్ధి చేయడంలో ప్రైవేట్‌ భాగస్వాములకు అవకాశం కల్పిస్తారు. కానీ వారు ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలి. అందుకు తగిన భద్రతా ప్రమాణాలను ప్రభుత్వమే రూపొందింస్తుంది. తగిన వైద్యులను ఎంపిక చేసుకోవడం, వారి సమయంకోసం ఎదురుచూడడం, కన్సల్టేషన్‌ ఫీజ్‌ చెల్లింపు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ షీట్‌లకోసం తిరగడం వంటి పలు ఇతర సమస్యల నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.  


ఈ నూతన పథకం మన ఆరోగ్య సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక భూమిక వహించే అవకాశముంది. వైద్య రికార్డులను అనుసంధానం చేయడం దేశవ్యాప్తంగా మెరుగైన వైద్య ప్రమాణాలను అమలు పరచడానికి కూడా దారి తీస్తుంది. సాధారణ ప్రజలకు సహితం నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో డిజిటల్‌ వైద్య సేవలు కీలక పాత్ర వహిస్తాయి. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత సాంకేతికత ద్వారా వైద్య సేవలను మరింతగా విస్తరింప చేసే అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు డిజిటల్‌ ఐడీ కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేయడం ద్వారా, వారి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ విశ్లేషణ జరపడం ద్వారా రాగల ఆరోగ్య సమస్యలను ముందే అంచనావేసి వైద్య సేవలను సిద్ధంచేసే అవకాశం ఏర్పడుతుంది. 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా వుంటుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి కాబట్టే స్వచ్ఛÛ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.  


కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలే అతలాకుతలమైపోయినాయి. అటువంటిది బలమైన నాయకత్వం ఉన్న ప్రధానమంత్రి మోదీ సంకల్ప బలంతో ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. కరోనా వైరస్‌పై పోరాటానికి ‘‘సంకల్పం, సంయమనం’’ అనే రెండంశాల మంత్రాన్ని మోదీ ప్రబోధించి ప్రజలకు భరోసా కలిపించారు. ఆయన సంకల్ప బలం, ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న చర్యలు వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశం అతితక్కువ ప్రాణనష్టంతో కరోనా మహమ్మారి నుండి బయట పడుతున్నది. ప్రధానమంత్రి వీడియో కాన్పÛరెన్స్‌ల ద్వారా తరచు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికీ దిశా దశ నిర్దేశిస్తూ వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ కరోనా మహమ్మారిపై రాష్ట్రాలతో కలిసికట్టుగా ఉమ్మడి పోరాటం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 8000 కోట్ల రూపాయల నిధులను మంజూరుచేసారు. కోవిడ్‌-19 అరికట్టడంలో భాగంగా ప్రాంతీయంగా సంప్రదింపులు, చర్చలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని సూచించిన తొలి నాయకుడు ప్రధానమంత్రే. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రపంచ జనాభాలో అధిక శాతం ప్రజలు నివసిస్తున్న సార్క్‌ దేశాల నాయకులతో వీడియో కాన్పÛరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. మోదీ సార్క్‌ దేశాలన్నింటి స్వచ్ఛంద వాటాలతో కోవిడ్‌-19 ఎమర్జెన్సీ నిధి ఏర్పాటును ప్రతిపాదించడంతోపాటు భారత్‌ తన వంతుగా 10 మిలియన్‌ డాలర్ల వాటా అందిస్తుందని ప్రకటించారు. తక్షణ చర్యలకు అవసరం అయ్యే వ్యయాలకు భాగస్వామ్య దేశాల్లో ఏ దేశమైనా ఆ నిధిని ఉపయోగించుకోవచ్చునని ఆయన సూచించారు. కరోనా మహమ్మారిపై యుకె ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతోను, సౌదీ అరేబియా కింగ్‌డవ్‌ు రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తోను ఇంకా ఇతర దేశాల అధినేతలుతో కూడా ప్రధానమంత్రి కరోనా మహమ్మారిపై టెలిఫోన్‌ సంభాషణ చేసారు.


ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే ఏకైక లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ ‘ఆరోగ్య కార్డు’ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కొన్ని ఈ  ఆరోగ్య కార్డు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం దేశ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత ఆరేళ్ళుగా ప్రజల సంక్షేమం కోసం ఎన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టినా ఆ పథకాలకు దేశభక్తులు, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వారి పేర్లు పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఏనాడు ఆరాటపడలేదు, ఏ ఒక్క పథకానికి ఆయన పేరు పెట్టుకోకుండా విలువలతో కూడిన సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అయితే ఈ ఒక్క ఆరోగ్య కార్డు పథకానికి ‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరోగ్య కార్డు’గా నామకరణం చేయాలని ప్రజల ఆకాంక్ష.


కె. రఘురామకృష్ణరాజు

నరసాపురం పార్లమెంట్‌ సభ్యులు

చైర్మన్–సబ్‌ఆర్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ

Updated Date - 2020-08-18T07:25:47+05:30 IST