దేశ భక్తుడే దేశ రక్షకుడు

ABN , First Publish Date - 2020-06-23T06:55:31+05:30 IST

చరిత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలం మారుతున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ పరిణామాలూ, ప్రతిస్పందనలూ కూడా మారుతుంటాయి. భారత చైనా దేశాల మధ్య ఘర్షణ 1962లో జరిగినప్పుడు భీరువులా...

దేశ భక్తుడే దేశ రక్షకుడు

భారత సార్వభౌమాధికారాన్ని కాపాడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యేయం. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ లాంటి బలహీనమైన నాయకుడు కాదు. డోక్లాంలో చైనా సైనిక స్థావరాల నిర్మాణాలను చేపడితే భారత సైన్యం సరిహద్దు దాటి మరీ అడ్డుకోవడంతోనే ఇది స్పష్టమైంది. 1962లో లాగా చైనా ఇవాళ ఎప్పుడంటే అప్పుడు భారత్‌లో ప్రవేశించే సాహసం చేయలేదు. తనతో సమానంగా అణుపాటవాన్ని సాధించిన భారత్ పట్ల చైనా దుస్సాహసానికి పాల్పడలేదు. అన్నిటికీ మించి దేశభక్తుడైన మోదీయే ఇవాళ దేశ రక్షకుడి స్థానంలో ఉన్నారు.


చరిత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలం మారుతున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ పరిణామాలూ, ప్రతిస్పందనలూ కూడా మారుతుంటాయి. భారత చైనా దేశాల మధ్య ఘర్షణ 1962లో జరిగినప్పుడు భీరువులా వ్యవహరించిన నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మాదిరే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా వ్యవహరిస్తారని అనుకునే వారిని కాలంతో ప్రయాణించలేని మూర్ఖులుగా భావించవలిసి ఉంటుంది. ఆ నాటి నేతలు ఏదో రకంగా బ్రిటిష్ వారినుంచి స్వాతంత్ర్యం తెచ్చుకుని, ఎన్ని రాజీలైనా పడి అధికారం చేజిక్కించుకోవాలనుకుని, దేశంలో వారసత్వ రాజకీయాలను ప్రవేశపెట్టాలనుకుని తాపత్రయపడిన నేతలు. నాటి నేతలకు అధికారం సంపాదించుకోవాలనే హ్రస్వ దృష్టి తప్ప, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలనే తపన పెద్దగా ప్రదర్శించేవారు కాదు. వారి అధికార లాలసత్వం వల్లనే దేశం రెండు ముక్కలుగా విడిపోయింది. వారి నిర్లక్ష్య వైఖరి వల్లనే కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ వశమైంది. వారి సంకుచిత, స్వార్థ వైఖరి వల్లనే కశ్మీర్ విచ్ఛిన్న కర శక్తులకు వశమై పేరుకు మన దేశంలో భాగం అయినప్పటికీ ప్రత్యేక అధికారాలతో, ప్రత్యేక ప్రతిపత్తితో ఇష్టారాజ్యంగా కొనసాగింది.


1961లో చైనా లద్దాఖ్‌లో ఆక్సాయి చిన్ భాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నారో గుర్తు చేసుకుంటే ఎవరైనా దిగ్భ్రాంతి చెందక తప్పదు. రాజ్యసభలో 1961 డిసెంబర్ 5న చర్చ జరిగినప్పుడు నెహ్రూ మాట్లాడుతూ ‘అక్కడ గడ్డి మొక్క కూడా మొలవదు. 17వేల అడుగుల ఎత్తు ఉన్న లద్దాఖ్‌లో ఎవరూ నివసించరు. అదెక్కడుందో కూడా మనకు తెలియదు..’ అని అన్నారు. దీనికి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు మహావీర్ త్యాగి స్పందిస్తూ తన తలను చూపించి ‘ఇక్కడ కూడా జుట్టు మొలవదు. అంత మాత్రాన తలకు ఏమాత్రం విలువ లేదంటారా?’ అని ప్రశ్నించారు. నిజానికి ఉక్కుమనిషి, దేశంలో 562 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి సమగ్ర భారత దేశ సంస్థాపనకు కారకుడైన సర్దార్ పటేల్ కూడా అంతకు ఎన్నో ఏళ్ల ముందు నెహ్రూను చైనా మోసానికి గురి కావద్దని హెచ్చరించారు. పంచశీల ఒప్పందం చేసుకుని చైనా ఏమీ చేయదనే కలల్లో ఉన్న నెహ్రూను ఆయన హెచ్చరిస్తూ శాంతి యుత సంబంధాల పేరుతో చైనా భారత దేశాన్ని భ్రమల్లో ముంచెత్తుతుందని హెచ్చరించారు. కాని నెహ్రూ సౌమ్యంగా లేఖలు రాయడానికే పరిమితయ్యేవారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కూడా నెహ్రూ చేసిన ఘోర తప్పిదాలను ఎప్పుడో ఎత్తి చూపారు. చైనా టిబెట్‌ను, ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోవడం, కశ్మీర్‌లో ఏకపక్ష కాల్పుల విరమణ ద్వారా పాకిస్థాన్‌కు ఆక్రమిత విధానాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం గురించి ఆయన ఆనాడే హెచ్చరించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ హెచ్చరించినట్లుగా చైనా టిబెట్‌తో ఆగలేదు, ఆక్సాయి చిన్‌ను కూడా ఆక్రమించుకుంది. నెహ్రూ మీనమేషాలు లెక్కపెడుతున్న సమయంలోనే 1961లో చైనా దళాలు సింకియాంగ్ -టిబెట్‌కు పశ్చిమాన 70 మైళ్లు ముందుకు వచ్చాయి. 1962 అక్టోబర్‌లో ఢోలాలో ఉన్న భారత పోస్టును పీకేసి ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలోకి దూసుకువచ్చాయి. ఆ తర్వాత నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని బాంబ్ డిలాలోకి ప్రవేశించాయి. దీనితో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ థాపర్‌తో రాజీనామా చేయించారు. రక్షణమంత్రి కృష్ణమీనన్ శాఖ మార్చాల్సి వచ్చింది. చైనా సైన్యం ఎక్కడ ఆగుతుందో, ఎంతవరకు దూసుకువస్తుందో ఎవరూ ఊహించలేకపోయారు. చైనాను ప్రతిఘటించేవారే లేకపోయారు. భారత సైన్యం అస్సాం వరకు వెనక్కు వెళ్లేందుకు సిద్ధపడింది. ‘అస్సాం ప్రజల పట్ల నా హృదయం వేదన చెందుతుంది..’ అని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో నెహ్రూ తమను గాలికి వదిలేశారని అస్సాం ప్రజలు గ్రహించారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎనిమిది నెలలకు జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరి దేశ భక్తి భావాలు పుణికిపుచ్చుకున్న నరేంద్ర మోదీ 1962లో భారత చైనా యుద్ధ సమయంలో, 12 ఏళ్ల వయస్సులో వడ్ నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముతూ రైళ్లలో ప్రయాణించే సైనికులను చూసి ఉత్తేజం పొందేవారు. 1971లో భారత పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఆయన భారత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ న్యూఢిల్లీలో ధర్నాలో పాల్గొని అరెస్టయ్యారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆర్ ఎస్ ఎస్ పూర్తి స్థాయి ప్రచారక్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఆనాటి అనుభవాలే ఆయనను దేశ భక్తుడిగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నాలు చేశారు. మోదీ ధ్యేయం ఒక్కటే భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడం. ప్రపంచ దేశాల మధ్య భారత దేశ పూర్వవైభవాన్ని తిరిగి పునఃస్థాపించి ఎవరూ విస్మరించలేని శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు చేసి ఆ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అన్న విషయంలో ఎలాంటి వివాదానికి తావు లేదని మోదీ ప్రపంచానికి చాటిచెప్పినప్పుడు మొత్తం ప్రపంచమంతా అంగీకరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు సర్జికల్ దాడుల ద్వారా బుద్ధి చెప్పి వెనక్కు తగ్గేలా చేయడమే కాదు పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన ఘనత మోదీకే దక్కింది.


అందుకే 1962లో లాగా చైనా ఇవాళ ఎప్పుడంటే అప్పుడు భారత్‌లో ప్రవేశించే సాహసం చేయలేదు. ఆనాడు యుద్ధానికి అవసరమైన ఆయుధ పరికరాల్ని బిగించే దశకు కూడా భారత్ చేరుకోలేదు. ఇవాళ అమెరికా, చైనాల తర్వాత రక్షణ శాఖకు అత్యధిక నిధులు కేటాయిస్తున్న భారత దేశం వద్ద అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్నది. నిరంతరం పాకిస్థాన్ సైన్యాన్ని సరిహద్దుల్లో నివారిస్తూ యుద్ధాలు చేసిన అనుభవం మన సైన్యానికి ఉన్నది. పైగా తనతో సమానంగా అణుపాటవాన్ని సాధించిన భారత్ పట్ల చైనా దుస్సాహసానికి పాల్పడలేదు. అన్నిటికీ మించి దేశభక్తుడైన మోదీయే ఇవాళ దేశ రక్షకుడి స్థానంలో ఉన్నారు.


స్నేహహస్తం చాచినంత మాత్రాన భారత్‌ను రక్షణ పరంగా తక్కువ అంచనా వేస్తే ఊరుకోవడానికి మోదీ నెహ్రూ లాంటి బలహీనమైన నేత కాదు. భారత్-–భూటాన్-– చైనా కూడలి డోక్లాంలో చైనా సైనిక స్థావరాల నిర్మాణాలను చేపడితే భారత సైన్యం సరిహద్దు దాటి మరీ అడ్డుకోవడంతో ఇది స్పష్టమైంది. లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ పెట్రోలింగ్ పాయింట్ వద్ద మోహరించిన చైనా దళాలను తరిమికొట్టేందుకు జరిగిన భీకర ఘర్షణలోనే మన కల్నల్ సంతోష్ బాబుతో సహా అనేక మంది భారతీయ సైనికులు ప్రాణాలు అర్పించారు. ‘మన సైనికులు శత్రుసైనికులను తరిమి కొడుతూ మరణించారు. మన ఒక్క పోస్టు కూడా చైనా అధీనంలోకి పోలేదు..’ అని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు. ‘వాస్తవాధీన రేఖను దాటే ఏ ప్రయత్నాన్నైనా గట్టిగా తిప్పికొడతాం’ అని ఆయన అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. నెహ్రూ కాలం నుంచి ఇప్పటివరకూ తమ ప్రభుత్వాల హయాంలో ప్రత్యర్థులకు పరాధీనమవుతూ, భారత సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టడం అలవాటైన మన ప్రతిపక్షాలకు నరేంద్రమోదీ గర్జనతో నైతిక స్థైర్యం దిగజారింది. తమ హీన చరిత్ర ఎక్కడ భయపడుతుందోనన్న భయంతో వారు మోదీపై దుష్ప్రచారానికి దిగారు.


వై. సత్యకుమార్

బీజెపి జాతీయ కార్యదర్శి

Read more