శార్వరి కిరీటం

ABN , First Publish Date - 2020-03-30T08:45:12+05:30 IST

అర్ధరాత్రి పక్కల పిల్ల మాయమైన తల్లి దిగ్ర్భాంతి ప్రపంచమే యుద్ధరంగమైన చోట కంటికి కనపడని తూటా ఎప్పడు ఏ గుండెలో దిగబడుతుందోననే భయం నీళ్ళల్ల కాదు గాలిల చెలరేగుతున్న సునామీ...

శార్వరి కిరీటం

అర్ధరాత్రి

పక్కల పిల్ల మాయమైన 

తల్లి దిగ్ర్భాంతి


ప్రపంచమే యుద్ధరంగమైన చోట

కంటికి కనపడని తూటా 

ఎప్పడు ఏ గుండెలో దిగబడుతుందోననే భయం


నీళ్ళల్ల కాదు

గాలిల చెలరేగుతున్న సునామీ

ఏ ఇల్లును వల్లకాడు చేస్తుందోననే విహ్వలత


కలకత్తా హౌరాను శవాల దిబ్బ చేసిన

గత్తర వాసన చెదిరిపోలేదు


సూదిమందుతో మట్టుబెట్టినా

మశూచి చేసిన గాయాల మచ్చలు మాసిపోలేదు


మహమ్మారి ఫినిక్స్‌ పక్షిలా

తిరిగి తిరిగి రెక్కలల్లార్చుతనే వుంది


ఫ్లూ విధ్వంస నృత్యం

నిత్య వీక్షణ దృశ్యకావ్యమయ్యింది


2

సరిహద్దులు లేని శ్రామిక రాజ్యాల

కలల ఆనవాళ్ళు కూలి

తీరాలు లేని ఆర్థిక సామ్రాజ్యాలు

ఊడలు దీసి ఊరేగుతున్నవి


నీడకు భయపడి

మేడ నిండా ఆయుధాలు నింపుకున్నము


కనిపించని శత్రువును నిలువరించే

కత్తి డాలును పారేసుకున్నము


3

మనుషులు చేసిన దేవుడు

చేతులెత్తేసి క్షేత్రం విడిచి పెట్టిండు


మనుషులు నేర్చిన జ్ఞానం

మృత్యుగీతమై ఘీంకరిస్తున్నది


అహేతుక అజ్ఞానం

అశ్వగంధ సేవనమై

గోమూత్ర యజ్ఞమై

పేలవంగానైనా మూలుగతనే వుంది


ఊదుపొగ పెయ్యిమీద ఉత్తి మరకే అయ్యింది

మంత్ర తాయత్తులకు ఏ చింతకాయ రాలలేదు


యుగాలు దొర్లి

తరాలు మారినై


భావాలు ఘనీభవించి

మౌఢ్యం విస్ఫోటించింది


4

గ్లోబల్‌ విలేజిల 

అనివార్యంగ మనమే కట్టుకున్న అడ్డుగోడలు

ఆవల బిడ్డడెట్లుండెనోననే తల్లడిస్తం


కనరాని విరోధిని నిలువరించే

పుంజీతం ముందేసుకుంటం

కార్యకారణాల ఆపిల్‌ పండును అందుకుంటం


శాస్త్రపు చిటికెన వేలు అందుకొని

ఈ మృత్యు నదిని ఈదుతం


ఈ వికారి తొలగిపోతుంది

వైద్యపు  వెలుగులు శార్వరిని నిలువరిస్తవి


ఆ ఉదయం ఎప్పటికైనా వస్తుంది

కాసుల లింగారెడ్డి

99489 00691

Updated Date - 2020-03-30T08:45:12+05:30 IST