రాజ్యాంగ స్ఫూర్తి లేని సుప్రీం తీర్పు
ABN , First Publish Date - 2020-05-09T06:09:50+05:30 IST
ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలు వంద శాతం స్థానిక షెడ్యూల్ తెగల వారికే కల్పిస్తూ 1986లో ఆదివాసీ పక్షపాత ఐఎఎస్ అధికారులైన ఎస్. ఆర్....
ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలు వంద శాతం స్థానిక షెడ్యూల్ తెగల వారికే కల్పిస్తూ 1986లో ఆదివాసీ పక్షపాత ఐఎఎస్ అధికారులైన ఎస్. ఆర్. శంకరన్, బి.డి.. శర్మ, ఇ.ఎ.ఎస్. శర్మ, ఎస్.కె. శాస్త్రి వంటి వారు రాజ్యాంగ నియమాలను అనుసరించి 275 జీవోకు రూపకల్పన చేసి అమలు చేయించారు. గిరిజనేతరులు హైకోర్టుకు వెళ్లడం వలన ఆ జీవోను కొట్టివేయడంతో, ఆదివాసీల గొంతుక, ప్రజా న్యాయవాది అయిన బాలగోపాల్ ఆదివాసీల పక్షాన హైకోర్టులో కేసు వేసి గెలవడంతో 2000 అక్టోబర్ 1వ తేదీ నుండి 275 స్థానంలో 3వ నెం. జీవో వచ్చింది. నిజానికి, పాలకులు కంటితుడుపు చర్యగా ఈ జీవోను కేవలం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే కొన్ని పాఠశాలలకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఈ జీవోని అమలు చేయని కారణంగా షెడ్యూల్డ్ ఏరియాలో వందలాదిమంది ఎస్టీలకు ఉద్యోగాలు దక్కలేదు.
జీవో 3అమలు అసలు లక్ష్యం రాజ్యాంగంలోని అధికరణలు 46, 29, 35–ఎ లలో షెడ్యూల్డ్ తెగల విద్య, భాషా, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుతూ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సమానత్వం పొందే విధంగా అభివృద్ధి చేయడం. అధికరణం 29 దేశంలోని ఒక ప్రదేశంలో నివసిస్తున్న పౌర సమాజానికి చెందిన ఏదేని వర్గం వారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకునే హక్కు కల్పిస్తుంది. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనకు అవకాశం కల్పించటం, భాషాపరంగా ఆదివాసి వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన చేయుటకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక ప్రాధికార సంస్థ ఆ రాష్ట్రంలో వసతులు సమకూర్చాలని అధికరణం 350 ఏ తెలుపుతుంది. అందులో భాగంగానే, 2004–-05 విద్యా సంవత్సరం నుండి ఎనిమిది గిరిజన భాషల్లో (గోండి, కొలామి, కోయ, బంజారా, ఆదివాసి, ఒరియా, కొండ, కువి) ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన ఆరంభమైంది. తత్ఫలితంగా షెడ్యూల్డ్ ఏరియాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం గణనీయంగా పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర భాషల్లో విద్యా బోధన జరుగుతుండటం వలన బడి మానివేసే విద్యార్థుల సంఖ్య అప్పటివరకూ 60 శాతం వరకూ ఉండేది. ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో మాతృభాషలో విద్యా బోధన చేయాలన్నా, మాట్లాడాలన్నా, స్థానికంగా ఉండి విద్యనందించే ఆదివాసి ఉపాధ్యాయునికే సాధ్యమవుతుంది. ఆదివాసి ఉపాధ్యాయులు తమ భావాలను పిల్లలతో, పిల్లలు తమ భావాలను ఉపాధ్యాయులతో మాతృభాషలో పంచుకున్నంతగా ఇతర భాషల్లో పంచుకోలేరు. ఆదివాసి ఉపాధ్యాయులే బోధకులుగా ఉన్నప్పుడు ‘మా సారు’ అనే భావనతో పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా రావడానికి ఇష్టపడతారు. వారికంటూ మాతృభాషలో భావనా ప్రపంచమొకటి ఉంటుంది. ఈ పనిని ఆదివాసియేతర ఉపాధ్యాయులు చేయలేరు. ఇంతటి నిర్దిష్టమైన, విస్తృతమైన లక్ష్యంతో పుట్టుకొచ్చిన జీవో 3 ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడం ఆదివాసి సమాజాన్ని తల్లివంటి మాతృభాష నుండి, బడి నుండి దూరం చేయడమే. చట్టాల్లో లోపాలుంటే సరిదిద్దాలి కానీ, ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను, జీవోలను లొసుగులను అడ్డం పెట్టుకొని రద్దు చేయడం ఆదివాసీల హక్కులను కాలరాయడమే కాక, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ స్ఫూర్తికి విరుద్ధం కూడా.
– బాదావత్ రాజు