విద్యాభ్యాసంలో మాధ్యమానుభవాలు

ABN , First Publish Date - 2020-04-18T06:33:38+05:30 IST

ఇంగ్లీష్ మీడియంపై హై కోర్టు తీర్పు ప్రజా వ్యతిరేకమైనది కాదు. మాధ్యమం ఎంపిక స్వేచ్ఛని ఈ తీర్పు అడ్డుకోలేదు. సరికదా ఆహ్వానించింది. చదువుకోవాలనుకునే పిల్లల ఆసక్తికి, తీసుకున్న మాధ్యమానికి కొన్ని సార్లు సంబంధం ఉండొచ్చు, ఉండక...

విద్యాభ్యాసంలో మాధ్యమానుభవాలు

ఇంగ్లీష్ మీడియంపై హై కోర్టు తీర్పు ప్రజా వ్యతిరేకమైనది కాదు. మాధ్యమం ఎంపిక స్వేచ్ఛని ఈ తీర్పు అడ్డుకోలేదు. సరికదా ఆహ్వానించింది. చదువుకోవాలనుకునే పిల్లల ఆసక్తికి, తీసుకున్న మాధ్యమానికి కొన్ని సార్లు సంబంధం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఇదే మాదిరిగా డ్రాపౌట్ అయ్యేదానికీ, తీసుకున్న మాధ్యమానికి సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు. నా నలభై ఆరో ఏట పరాయి భాష నేర్చే విషయంలో  ఆందోళన ఉంటే, అదే పరాయి భాష ఒకటవ తరగతిలో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాపౌట్ నై ఉండేవాణ్ణి


బోధనా మాధ్యమం అంటే చదువులు చెప్పే భాష మాత్రమే కాదు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు విద్యార్థులకు ఉపకరించే అత్యంత కీలకమైన సాధనం. అందుకని, ఆ సాధనం వారికి విషయాన్ని అర్థం చేయించేదై ఉండాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. నా సంగతే చూడండి. నా నలభై ఆరో ఏట డిగ్రీ (సాహిత్యం ,సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం)లోకి ప్రవేశించాను. మూడేళ్ల మీద పదహారు సబ్జెక్టులు ఉండగా, అందులో మొదటి సంవత్సరంలో ఒకే ఒక సబ్జెక్టు ఇంగ్లీషు ఉండింది. దాన్ని కనీస మార్కులతో పాసయ్యాను. మిగిలినవన్నీ మంచి మార్కులతో తెలుగు మీడియంలో ఎప్పటికప్పుడు పాసయ్యాను. ఆ తర్వాత ఎమ్మే రాజనీతి శాస్త్రం రెండేళ్లు కూడా తెలుగు మీడియంలో ఫస్టు క్లాసులో ఎప్పటికప్పుడు పాసయ్యాను. అలాగే మళ్లీ ఒక ఏడాది కాల వ్యవధి కలిగిన పీజీ డిప్లొమా ఇన్ రైటింగ్ ఫర్ మాస్ మీడియా కూడా తెలుగు మీడియంలోనే ఇంకా మంచి మార్కులతో పాసయ్యాను.


ఒక వేళ నేనే గనక ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఉంటే డిగ్రీ లోనే డ్రాపౌట్ నయ్యే వాణ్ణి. కేవలం నా మాతృ మీడియం వల్ల నిరాఘాటంగా ఆరేళ్లలో మూడు డిగ్రీలు చదవ గలిగేను. ఇప్పటికీ నాకు తగినంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేదంటే నమ్మండి! విద్యార్థులు వాడేసిన పది, ఇంటర్, డిగ్రీ తరగతుల తెలుగు గైడులు, టెస్ట్ పేపర్లు సంపాదించే వాణ్ణి. వాటిలోని అర్థాలు,ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాకరణ అంశాలు చదివే వాణ్ణి. విస్తృతమైన యితర అంశాల అధ్యయనం ద్వారా నా భాషా పరిజ్ఞానాలను మెరుగు పరుచుకున్నాను. 

అభివృద్ధి చెందిన కొందరు అడ్వాన్స్ డ్ సమాజానికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అవసరతలో, వ్యామోహంలో ఉన్నారన్నది నిజం. ఎవరికైనా ఆ డ్రీమ్ ఉండి తీరవల్సిందే. అది తప్పు కానేకాదు. కానీ, పిల్లల వాస్తవ సాధనా మార్గాలు, సామాజిక అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై తల్లి దండ్రులు ప్రాక్టికల్ గా ఆలోచించలేక పోవడం విచారకరం. అట్టాగని నేను ఇంగ్లీష్ మీడియంకి శత్రువుని కాను అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.


ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే, ఉద్యోగాలు వచ్చే పనైతే, ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నత విద్య పొందిన వారు, ఇంగ్లీష్ విద్యలో ఉన్నత పరిశోధనలు జరిపిన వారు, ఇంగ్లీష్‌లో బోధనా విద్య అభ్యసించిన వారందరికీ ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు?

ఇంగ్లీష్ మీడియం అభిమానుల్లో మూడు రకాల వారున్నారు. ఒకటవ రకం వారు; పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే అవకాశాలు మెండుగా ఉంటాయని భావించే వారు. వీరి అంచనాలు వాస్తవంలో పాక్షికమైనవైనా, వీరి కల స్వచ్ఛమైనది. స్వాగతించ దగ్గది. ఇక రెండో రకం వారు; వ్యక్తిగత జీవితంలో సగటు ప్రజల కంటే మెరుగ్గా చదివి, ఎంతో కొంత మెరుగైన జీవన పరిస్తితుల్లో ఉండే వారు. వీరు, పిల్లలందరూ ఇంగ్లీష్ చదువుకుంటే , తమలాగే మెరుగ్గా బతుకుతారని నిజాయితీగా కలలు కంటారు. ఇక మూడవ రకం వారు; ప్రజల నూతన మీడియం/ గుణాత్మకమైన ఉన్నత విద్యా స్వప్నాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని పొగిడే వారు.

కారణాలు ఏమైనప్పటికీ, రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదంతో చెయ్యాల్సిన చట్టాలను కొన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు- జీవోలు, ఆర్డినెన్సులు, స్థానిక చట్టాల ద్వారా, రాజ్యాంగబద్ధత లేని విధంగా చేస్తుంటాయి. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం, ముస్లింలకు రిజర్వేషన్ల కల్పన, బీసీ రిజర్వేషన్ల సవరణ, ఇంగ్లీష్ మీడియం విధానం జీవోలు మొదలగునవి.


ఇంగ్లీష్ మీడియం పై హై కోర్టు తీర్పు ప్రజా వ్యతిరేకమైనది కాదు. మాధ్యమం ఎంపిక స్వేచ్ఛని ఈ తీర్పు అడ్డుకోలేదు. సరికదా ఆహ్వానించింది. అలాగే, చదువుకోవాలనుకునే పిల్లల ఆసక్తికి తీసుకున్న మాధ్యమానికి కొన్ని సార్లు సంబంధం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఇదే మాదిరిగా డ్రాపౌట్ అయ్యేదానికీ, తీసుకున్న మాధ్యమానికి సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు. 

కొత్త భాష నేర్చుకోవడంలో ఒక విద్యార్థినీ విద్యార్థుల ఆకలి తీరి ఉండటం లేదా తీరకపోవడం అనే నేపథ్య ప్రభావం ఒక కోణం కాగా, నూతన భాష నేర్చుకోవడంలో (మాట్లాడే, రాసే, వ్యవహారాలలో, వినోదాలలో వాడుతూ ఉండే) ఆ భాషా పర్యావరణం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది.

తెలుగు మాతృభాష కలిగిన నలభై మంది పిల్లలలో పది మందిని తెలుగు మీడియంలో, పది మందిని ఇంగ్లీష్ మీడియంలో, పది మందిని హిందీ మీడియంలో, మిగతా పది మందిని ఉర్దూ మీడియంలో చదివే వారిని తీసుకుని అధ్యయనం చేస్తే అప్పుడు డ్రాపౌట్ కారణాల వాస్తవాలు ఏమిటో మనకు తెలుస్తాయి. నేను చెప్ప దలుచుకున్నది.. నా నలభై ఆరో ఏటనే పరాయి భాష నేర్చే విషయంలో ఇంత ఆందోళన ఉంటే, అదే పరాయి భాషలో ఒకటవ తరగతిలో ఉండి ఉంటే కచ్చితంగా డ్రాపౌట్ నై ఉండేవాణ్ణి అని చెప్పదలుచుకున్నాను.


ప్రభుత్వం బలహీన వర్గాల వారి వశంలో ఉండాలి. ఎంతగానంటే.. ప్రైవేట్ రంగాన్ని కూడా నియంత్రించ గలిగే శక్తితో. అప్పటి వరకూ బలహీన వర్గాలు కోరుకున్న విద్యా మాధ్యమాల అందుబాటు అంతంత మాత్రమే. తెలిసి గానీ, తెలియక గానీ పరాయి మీడియం సామర్ధ్యం, సాధన కాస్తా స్వీయ, స్థానిక సామర్ధ్యాల పదనుకు అడ్డు కారాదు. ‘అప్పులున్నోడు, చెప్పులున్నోడితో పోవద్దు’ అన్న చందంగా ఎవరూ పిల్లల చదువు మాధ్యమాల దారులను సంక్లిష్టం చేయొద్దు అనేదే నా విన్నపం.

పేద వర్గాల పిల్లల మాధ్యమ ఎంపిక స్వేచ్ఛ విషయంలో అవకాశాలు కల్పించి, వారి ఆసక్తులకే వదిలి పెట్టాలి. అంతే తప్ప, బువ్వున్నోళ్లు, పెన్ను బలిమి ఉన్నోళ్లు, పరాయి భాషలపై పట్టున్నోళ్లు వారి సలహాలు, మద్దతులు, వకాల్తాలు, ఒత్తిళ్ల స్థాయిలో పేదల పక్షం చెయ్యకుంటేనే మంచిది అనుకుంటాను.



కృపాకర్ మాదిగ

Updated Date - 2020-04-18T06:33:38+05:30 IST