శ్రీకాకుళ విప్లవ నాయకి

ABN , First Publish Date - 2020-03-15T06:16:18+05:30 IST

శ్రీకాకుళ ఉద్యమ తొలితరం నాయకురాలు శృంగవరపు జయమ్మ. గిరిజనంలో జయక్కగా ప్రేమాదరాలు పొందిన జయమ్మ జీవితాంతం నమ్మిన విలువలు...

శ్రీకాకుళ విప్లవ నాయకి

శ్రీకాకుళ ఉద్యమ తొలితరం నాయకురాలు శృంగవరపు జయమ్మ. గిరిజనంలో జయక్కగా ప్రేమాదరాలు పొందిన జయమ్మ జీవితాంతం నమ్మిన విలువలు, ఆదర్శాల కోసం పోరాడారు.


విప్లవ కార్యాచరణలో పాల్గొని, నమ్మిన ఆదర్శాలు, విలువల కోసం జీవితాంతం పోరాడిన ధీర శృంగవరపు జయమ్మ. జయక్క అని గిరిజనులు ప్రేమగా పిల్చుకొనే జయమ్మ తన 68వ ఏట గత నెల 24 వేకువ జామున ఈ లోకాన్ని వీడారు. 

శ్రీకాకుళం జిల్లా సోంపేట సమీపంలోని లక్కవరంలో శృంగవరపు నర్సింహులు రెండవ కుమార్తెగా 1953లో జయమ్మ జన్మించారు. నక్సల్బరీ పిలుపు విని తండ్రితో పాటు 1968లోనే దళంలో చేరిన విప్లవ స్ఫూర్తి జయమ్మది. చేరిన నెలరోజులకే తండ్రి నర్సింహులు పంచాది క్రిష్ణమూర్తితో పాటు కాల్చి వేతకు గురయ్యారు (బూటకపు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు వదిలిన ఏడుగురు ప్రజావీరుల్లో ఆయన ఒకరు). 

ఆ తర్వాత సుబ్బారావు పాణిగ్రాహి, పంచాది నిర్మల పోలీసులకు పట్టుబడ్డ దాడి ఘటన నుండి తప్పించుకున్న సాహసి జయమ్మ. అయితే, ఆ పట్టుబడ్డ వాళ్ళలో జయమ్మ ఉన్నట్లు పార్టీ కరపత్రం వేసిందట. దాన్ని చూసి ఇంట్లో దినవారాలు చేసారట! ఆ తరువాత ఎప్పుడో ఇంటికి వెళితే దయ్యాన్ని చూసినట్లు చూసారట! పాణిగ్రాహి తనతో చనువుగా వుంటూ తనకెంతో ఉత్సాహాన్నిచ్చి రాజకీయాలు చెప్పి తండ్రిలా ఆదరించాడని జయమ్మ తెలిపారు. దళ జీవితాన్నీ, నాయకులనూ గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా జయమ్మ కన్నీటి పర్యమంతమయ్యే వారు. శ్రీకాకుళ విప్లవోద్యమ వివరాలను ఆమె నుంచి వినడం ఒక అనుభవం! 


దళసభ్యుల సంఖ్య తగ్గుతూ పోయినా, నిలకడగా దళ జీవితాన్ని అంటిపెట్టుకొనే ఉన్నారు జయమ్మ. ఆ క్రమంలో ఒరియా, సవర భాషలు నేర్చుకోవడంలో పడినపాట్లు, గిరిజనులు పెట్టిన పరీక్షలు, వాటిలో నెగ్గిన తీరు అన్నింటిని ఆమె ఆసక్తికరంగా వివరించేవారు. అలా సవర, ఒరియా భాషల్లో మాట్లాడ గలిగే సామర్థ్యాన్ని ఆమె సంపాదించుకున్నారు. గిరిజనులు ఆ రెండు భాషలు మాట్లాడతారు. ఇంకో విశేషమేమంటే జయమ్మ పూర్తిగా గిరిజనులతో కలిసిపోయేవారు. ఆమె కట్టూబొట్టూ, తీరూ, భాష అన్నీ గిరిజనుల జీవనశైలిలో వుండేవి. 

శ్రీకాకుళ విప్లవోద్యమ చివరిరోజుల్లో దళనాయకుడైన డాక్టరు దేవినేని మల్లిఖార్జున్‌ను జయమ్మ పెళ్ళి చేసుకున్నారు. డాక్టర్‌ మల్లిఖార్జున్‌ హాస్య చతురత, సామెతలతో మాట్లాడుతూ సంభాషించే తీరును జయక్క తరచు మననం చేసుకునేవారు. ‘తాను గర్భవతిని’ అని తెలుసుకొని అప్పటి దళం మనుగడ రీత్యా (పిల్లల ఏడుపు దళాన్ని పట్టిస్తుందని), పెరుగుతూ పోతున్న నిర్బంధం రీత్యా గర్భాన్ని తీసివేయించుకున్న త్యాగశీలి జయమ్మ. అజ్ఞాత జీవితంలో సానుభూతి పరుల సహాయంతో ఆసుపత్రిలో ఉన్నపుడే డాక్టర్‌ దేవినేని మల్లిఖార్జున్‌ రామరాయి కొండల్లో (1970 జూలై 30న) ఎన్‌కౌంటర్ అయిన వార్త జయమ్మకు పిడుగుపాటు అయింది. అయితే చంద్రమ్మ లాంటి సహచరుల ఓదార్పుతో అతి కష్టమ్మీద మనిషి కాగలిగారు. 


మరోసారి, భరించరాని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సవరలు తినే పందిమాంసం తినడం వల్ల ప్రేవుల్లో బద్దెపురుగులు పెరిగి ఆమె బలహీనమై, అవి బలుస్తూ భరించరాని భాధపెడుతున్నాయని రిపోర్టులో తేలింది. చికిత్స చేయించుకున్నాక తిరిగి ఉద్యమంలోకే వచ్చారు. సవరలు ఏది పెడితే అదే తినాలి, వేరే తిండి దొరకదు. వారితోనే జీవితం, కనాకష్టం. వారు ‘క్రియారాహిత్యం’ జనాలు కాదన్నది జయమ్మ నమ్మకం. 

ఆ కఠోర దళ జీవితంలోనే పోతనపల్లి అప్పలస్వామి (కుమార్‌) జైలు నుంచి దళంలోకి వచ్చాడు. జయమ్మ తండ్రి నర్సింహులు త్యాగాన్ని, పోరాటాన్ని ఎరిగినవాడు, సన్నిహితంగా ఉండసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు దళంతో నడుస్తున్నపుడు చేతిలోని బాంబుల సంచి పేలి ఒళ్ళంతా గాయాలయ్యాయి. గాజు పెంకులు ఒళ్ళంతా గుచ్చుకున్నాయి. తీస్తే మరి బతకడం కష్టమే... అప్పుడు విప్లవకారుల్ని ప్రభుత్వాలు వేటాడుతున్నాయి. వెంటాడుతున్నా చికిత్స కోసం ఏదో ఒకటి చేయాల్సిందే! ఒరిస్సాలోనూ పరిస్థితి అంతే.. ఎలాగో ప్రయత్నాలు చేసి వైద్యుడినే దళం దగ్గరకు రప్పించారు. ఆయన మందులు ఇచ్చేవారు. తోటి కామ్రేడ్స్‌ బైరాగి, విద్యాధర్‌, పండాలు జయమ్మకు ఆ మందులు వేసి చికిత్స చేసే బాధ్యత తీసుకున్నారు. గాయాల మంటలు చాలా వేధించేవి. చాలా కాలానికి గానీ జయమ్మ కోలుకోలేక పోయారు. కోలుకున్న వెంటనే మళ్ళీ దళ జీవితంలోకి వెళ్ళారు. 


1972లో జయమ్మ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. గుంపు జీవితం, కలయికలు, విడివడడాలు; ఎప్పుడూ కన్నుమూయ వీల్లేని నిఘా! ఇక గిరిజనుల మధ్య.. వారి కోసం ఎన్నో పోరాటాలు.. ఎన్నో తప్పులు.. కొన్నే విజయాలు.. ఎన్నో అనారోగ్యాలు.. ఎంతో సంఘర్షణ.. ఎప్పుడూ సంచారమే జీవితం. సవర గూడేల మధ్య వాళ్ళను సంరక్షిస్తూ సంఘర్షణాత్మక జీవితం. సమావేశాలు, దళ సభ్యుల కదలికలు, శత్రువు నిఘా కన్ను లాంటి వేలాడే ఖడ్గం లాంటి రాజ్య నిర్బంధం కింద బతుకు. క్షణక్షణ గండం ! జయక్క అన్నిటినీ తట్టుకుని నిలిచారు. విప్లవాన్ని తలపై మోశారు. ఈ ఐదు దశాబ్దాల్లో, విప్లవ రాజకీయ పార్టీ కల్లోలాల్లో కూడా ఆమె పార్టీలో మిగిలి ఉండటమే అనూహ్యం. 

కుమార్‌తో పెళ్ళి తర్వాత జయమ్మకు పాప పుట్టింది. పాపకు లక్ష్మి అని పేరు పెట్టారు. సంచార దళ జీవితంలో శిశువును పెంచడం సాధ్యం కాదు. ఏం చేద్దామన్న ప్రశ్న. కమిటీలో చర్చ జరిగింది. చివరికి పిల్లలు లేని సవర దంపతులకి లక్ష్మిని ఇచ్చేయాలన్న నిర్ణయం జరిగింది. అలా తొలిచూలు బిడ్డను అప్పజెప్పిన కన్నకడుపు జయమ్మది. ఆ పిల్లకు చదువుకునే అవకాశంలేదు. దట్టమైన కొండల మధ్య జీవితం. సవరల మధ్య సవరగా పెరిగి పెద్దదై సవర యువకుడిని పెండ్లి చేసుకున్నది. మళ్ళీ కొడుకు పుట్టినపుడూ ఎవరికో ఇచ్చేయడమే! అన్నట్లు ఆ పిల్లవాని పేరు తెలుసా? మల్లిఖార్జున్‌. భార్యాభర్తలిద్దరూ ఆ పేరును ఇష్టపడి కొడుక్కిపెట్టుకున్నారు.


కుమార్‌, జయమ్మల మార్గదర్శకత్వంలో కొండలోగాం, కొంకడపుట్టి, లొత్తూరు, అక్కుపల్లి దగ్గర దిబ్బలు, 300 ఎకరాల గిరిజనేతరుల భూములను గిరిజనులు, పేదలు సాధించుకొని నేటికీ అనుభవిస్తున్నారు. ఆ భూపోరాటాల క్రమంలోనే 1998 సెప్టెంబరు 10న కుమార్‌ ‘ఎదురు కాల్పుల’ కు గురయ్యాడు. అంతకు కొంతకాలం ముందు నుంచి జయమ్మ బహిరంగంగా ఉంటూ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. జీవితాంతం పార్టీలోనే ఉన్నారు. ప్రజల కోసం నిలబడే ఉన్నారు. విప్లవ లక్ష్యం కోసం చివరికంటా పోరాడిన శ్రీకాకుళం తొలితరం విప్లవ నాయకురాలు జయమ్మకు విప్లవ జోహార్లు. 


డాక్టర్‌ ముత్యం

(నేడు శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో జయమ్మ స్మారక సభ)

Updated Date - 2020-03-15T06:16:18+05:30 IST