క్షమించు తల్లీ..

ABN , First Publish Date - 2020-10-04T08:17:25+05:30 IST

మా గుడిలో వినిపించే ధర్మం మా గుండె లోతుల్లో దొరకదు మా బడిలో నేర్పించే నిజం మా బతుకుల్లో గెలవదు...

క్షమించు తల్లీ..

మా గుడిలో వినిపించే ధర్మం

మా గుండె లోతుల్లో దొరకదు

మా బడిలో నేర్పించే నిజం

మా బతుకుల్లో గెలవదు

మా పెదాలపై దొర్లే న్యాయం

ఎంత వెతికినా కనపడదు!


పశువుల్లో అమ్మను జూసే మేం

అమ్మలను పశువుల్లా వేధిస్తాం

‘యత్ర నార్యంతు’ అన్న నోటితోనే

‘నస్త్రీ స్వాతంత్ర్యమర్హతీ’ అని ప్రకటిస్తాం


మా మెదళ్ల పుట్టిన విషబీజాలు

మా మొలల్లో మొలిచి

కా(మ)ళ సర్పాలై కబళిస్తే

మా అధికారం అడ్డుపెట్టి

న్యాయదేవత నడ్డి విరుస్తాం

గొంతు నొక్కుతాం


ఈ వేదభూమిలో స్రవించే మీ కన్నీళ్లు

ఈ కర్మభూమిలో దహించిన 

మీ ఆశల వేడిసెగలు 

ఎదల్ని తాకినప్పుడల్లా

గుండెలు రగిలి కారిన

రెండు కన్నీటిచుక్కల్ని దిగమింగి

మనసు రాయి చేసుకొని

మళ్లీ మా పనుల్లో పడతాం..


మా బతుకింతే..

మమ్మల్ని క్షమించు తల్లీ...!

మధుర శ్రీ

Updated Date - 2020-10-04T08:17:25+05:30 IST