విషసర్పంలా సోషల్ మీడియా

ABN , First Publish Date - 2020-05-29T05:51:02+05:30 IST

సమాజంలో విపరీత పోకడలతో విశృంఖల స్వభావంతో వారూ వీరూ అనే విచక్షణ లేకుండా విషాన్ని విరజిమ్ముతున్న విషసర్పం కోరలు పీకే ఓ ప్రయత్నానికి గౌరవ హైకోర్టు రంగంలోకి దిగింది...

విషసర్పంలా సోషల్ మీడియా

సోషల్ మీడియా దారుణ అకృత్యాలకు గురి అయిన మహిళను నేను. అసభ్య, అశ్లీల పదజాలంతో, ఫోటో మార్ఫింగ్‌లతో, నాకు మాత్రమే కాక నా కుటుంబ సభ్యుల కీర్తి ప్రతిష్ఠలకి, గౌరవ మర్యాదలకు తీవ్ర భంగం కలిగించింది సోషల్‌ మీడియా... ఉదయం లేచిన దగ్గర్నుంచి ఇంటికి తిరిగి వచ్చేవరకూ ప్రతిచోటా, ప్రతి పనిలోనూ ప్రభుత్వ నియంత్రణ మనకి కనిపిస్తూంటుంది. మరి సోషల్ మీడియా విషయంలో ఎందుకు ఉండదు? భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో, ప్రాథమిక హక్కు నెపంతో ఈ విషం చిమ్మేవారిని చిదిమేసేందుకు రాజ్యాంగాన్ని సవరించాలి.


సమాజంలో విపరీత పోకడలతో విశృంఖల స్వభావంతో వారూ వీరూ అనే విచక్షణ లేకుండా విషాన్ని విరజిమ్ముతున్న విషసర్పం కోరలు పీకే ఓ ప్రయత్నానికి గౌరవ హైకోర్టు రంగంలోకి దిగింది. అందుకు మొదట ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నిండు హృదయంతో అభినందనలు తెలపాలి. సామాన్యుడు సైతం తన అభిప్రాయాలను వ్యక్తీకరించటానికి లభించిన బృహత్తర వేదికను కొందరు స్వార్థపరులు, పైశాచిక ప్రవృత్తి కలవారు మలినం చేస్తున్నారు. విషతుల్యంగా మారుస్తున్నారు. సోషల్ మీడియా అంటేనే ఏవగింపు కలిగే వాతావరణాన్ని సృష్టించారు. వ్యక్తులను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బరితెగించి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే టార్గెట్ చేసే స్థాయికి వెళ్లటం మన రాజకీయ, అధికార వ్యవస్థ వైఫల్యం కాదా?


దారేపోయే సాటి మనిషిని పట్టుకుని అరేయ్! ఒరేయ్‌ అంటేనే పళ్లు రాలగొడతారు. అలాంటిది సమాజంలో గౌరవనీయ వ్యక్తులు, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఉద్దేశించి అసభ్యంగా, రాయటానికి అనుమతించని రీతిలో ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మన ప్రభుత్వాలు, చట్టాలు అచేతనంగా ఉన్నాయి. సోషల్ మీడియా మాటున దాగిన దుండగుల దుందుడుకుతనానికి కళ్లేలు వేయలేని దుస్థితిలో మన అధికార వ్యవస్థ ఉంది. ఈరోజు స్వయంగా ఉన్నత న్యాయస్థానం ఉరిమి చూసేసరికి, ఉగ్రనేత్రం తెరిచే సరికి వళ్లు విరుచుకుని చట్టాల దుమ్ము దులపటం మొదలుపెట్టారు. కానీ అనేక సంవత్సరాలుగా సోషల్‌ మీడియా బారిన పడిన ఎందరో సామాన్య మహిళలు, నాయకులు, సెలబ్రిటీలు తీరని మానసిక హింసకు గురయ్యారు.


అడపాదడపా కొందరిపై కొరడా తీయవచ్చు కాక మన పోలీసులు. కానీ ఇక్కడ ఇష్యూ ఎంతమంది బాధితులు అవుతున్నారు? ఎంతమందిపై చర్యలు తీసుకుంటున్నారు? అన్నది. వావివరసలు, సభ్యత, సంస్కారం మరిచి తమ ఒడిలో కూర్చుని కూయకూడని కూతలు కూస్తూంటే ఈ ట్విట్టర్‌, ఫేస్‌బుక్, వాట్సాప్ ఏం చేస్తున్నట్టు? వాటికి బాధ్యత లేదా? తమ కుటుంబ ఆడవారు అయితే ఒకరకంగా మిగతా ఆడవారు మాత్రం అంగట్లో బొమ్మల్లా భావిస్తూ విషం పూసిన బాణాలను తమ భుజాలపై నుంచి సమాజం మీదకు సంధిస్తున్న ఈ సంస్కార హీనులను జుట్టు పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి ఆ సంస్థలు వేడుక చూస్తున్నాయా? మొన్న ఏపీ హైకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. రాజకీయ స్వార్థం కోసమైనా పైశాచికానందం కోసమైనా సరే సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే ఎవ్వరినైనా సరే తాట తీయాల్సిందే. తోలు వలిచేయాల్సిందే. ఆ దిశగా అడుగేయాల్సిందే. అందరూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును సమర్థించాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, అవినీతిని ఎత్తి చూపే వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా భయంకరమైన కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేయటమే కాక అధికార పార్టీ మద్దతుదారులు సోషల్ మీడి యాలో వీరిని విపరీతంగా వేధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రూల్ ఆఫ్‌లా అనేది అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు, వారి మద్దతుదారులందరికీ ఒకే విధంగా, నిర్దిష్ట కాలపరిమితితో అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాను.


ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన ఆయుధం సోషల్ మీడియా. నిరుపేద అయినా, అత్యంత ధనికుడికి అయినా ఒక ఉచిత స్వతంత్ర ఆయుధం ఈ సోషల్ మీడియా. ఎన్నో దేశాల ప్రభుత్వాధినేతలు కూడా ప్రజలకు తమ భావాలను, పరిపాలన, ప్రజా సమస్యలను తెలిపి పాలనలో వారిని భాగస్వాములను చేయటానికి, ఎన్నికల సమయంలో ప్రజలకు మరింత చేరువ అవటానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు వార్తలను పేపర్ల ద్వారా ఎక్కువగా చదివే వారు కానీ ఇప్పుడు తగ్గిపోయింది.. ఎప్పటికప్పుడు వార్తలు క్షణాల్లో ప్రపంచం ముందు ఉంటున్నాయి. Electonic మీడియా powerfulగా మారిపోయింది. కానీ, చాలా దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో కూడా మీడియా ఛానళ్లు వాస్తవాలను ప్రజలకు అందించటంలో పక్షపాతాన్ని చూపిస్తున్నాయి ఎందుకంటే వాటిని నడిపే సంస్థలను కొన్ని బయటి శక్తులు ప్రలోభపెట్టడం వల్ల.


చాలా సందర్భాల్లో, సోషల్ మీడియా వీడియోలతో సహా వాస్తవాలను ఉచితంగా లక్షలాదిమందికి క్షణాల్లో చేరవేస్తోంది. ఈ బిజీ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ శరవేగంగా విస్తరిస్తోంది. నేటి యువతకు, ప్రజలకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతాకాదు... ప్రతి క్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ ఒడిసి పట్టుకుని... పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక క్షణక్షణం అప్‌డేట్‌లు చూడటం ఓ అలవాటుగా మారిపోయింది. మన మిత్రులు అలాగే బంధువులు దేశాలను దాటి ఎక్కడో నివసిస్తుంటారు. వారితో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్షణాల్లో వారినుంచి సమాచారం తెలుసుకోవచ్చు. ఫోటోస్, వీడియోస్, మెసేజ్‌లు అన్నీ వారితో షేర్ చేసుకోవచ్చు. ప్రపంచ జ్ఞానం, విద్య, ఆహ్లాదం, వినోదం, వైద్యం, విజ్ఞానం, దైనందిన ఎన్నో అంశాలు, పురాతన, ఆధునిక వస్త్ర, వ్యాపార, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఫ్యాషన్, ఆహార ఇతర ఎన్నో వేలాది అంశాలు దాదాపు ఉచితంగా, అతి తక్కువ సమయంలో ఈ రోజు ప్రజలకు అరచేతుల్లో అందిస్తున్నది ఈ సోషల్ మీడియా. కొత్త స్నేహాలు, పరిచయాలు, ఓదార్పులు, సంబరాలు ఇలా ప్రతీ అంశమూ లక్షలాది మందితో పంచుకుంటూ, ఈ భూమ్మీద ఏ మూలనుండి ఏ మూల వరకైనా, ఆనందమైనా, అన్యాయమైనా, అవినీతి అయినా, ఆవేదన అయినా ఇతరులతో పంచుకుంటున్నారు.


సోషల్ మీడియా ద్వారా సామాజిక వ్యవహారాలలో ప్రజలు భాగస్వాములు కావటం వల్ల, అనేక సమస్యలను చర్చించడం ద్వారా మనకు ఎన్నో సరికొత్త విషయాలు తెలుస్తాయి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునేందుకు సోషల్ మీడియానే ఉత్తమమైన మార్గం. ఆధ్యాత్మిక, వ్యక్తిగత, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నది సోషల్ మీడియా. అయితే, మితిమీరిపోతున్న సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడిన యూత్ చిన్నవయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా మరికొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత పుస్తకాలనే మరిచిపోయిందని ఒక అధ్యయనం తేల్చింది. ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు పుస్తకం అనే పదాన్నే మర్చిపోయారట. ఒకప్పుడు పుస్తకాల పురుగులుగా ఉండే యువత సోషల్ మీడియా విప్లవంతో ఆ పుస్తకాలనే పక్కనపెట్టేసి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లకు అతుక్కుపోయినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. రోజులో కనీసం 15 గంటలు వాట్సాప్, ఫేస్బుక్, tiktok, ట్విట్టర్, వీడియో గేమ్స్ లాంటివి ఆడుతూ గడిపేస్తూ, ఎంతో విలువైన సమయాన్ని, నిరర్థకంగా వృథా చేసుకుంటున్నారు. మితిమీరిన వాడకం వల్ల చదువులు నాశనం అయిపోవడం మాత్రమే కాక, విపరీతమైన పాశ్చాత్య ధోరణికి అలవాటుపడి, సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ, మానవ విలువలను మంటగలుపుతున్నారు. యువత, చెడు అలవాట్లకు బానిసలవటమే కాక, నలుగురితో పంచుకుంటూ, అసభ్య, అశ్లీల పద్ధతులకు దగ్గరవుతున్నారు. దీనివల్ల మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.


చాలా మంది పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు సైబర్ బుల్లింగ్ బాధితులయ్యారు. నకిలీ ఖాతాలతో వేధింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిల్ చేయటం, వారి కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్ఠను రోడ్డునపడేయటం, ఆర్థికంగా కూడా బెదిరింపులకు పాల్పడటం, సమాజంలో అసౌకర్యం, గందరగోళాన్ని సృష్టించడానికి బెదిరింపులు, బెదిరింపు సందేశాలు, పుకార్లను పంపుతున్నారు. వ్యక్తిగత డేటా, గోప్యతను హ్యాక్ చేయటం వ్యక్తిగత జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో, రాజకీయ, సినిమా రంగాలలో ఉన్న వ్యక్తుల ఖాతాలను హ్యాక్ చేసి లేదా అచ్చు అలాగే ఉన్న నకిలీ ఖాతాలను ఏర్పాటు చేసి, అశ్లీల, అసభ్య పోస్టులు వారి ఖాతాలో నుండి వారికే తెలియకుండా పోస్ట్ చేయడం ద్వారా సదరు ప్రముఖ వ్యక్తులను అపకీర్తి పాలయ్యేటట్టు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా దారుణ అకృత్యాలకు గురి అయిన మహిళను నేను. అసభ్య, అశ్లీల పదజాలంతో, ఫోటో మార్ఫింగ్ ‌లతో, నాకు మాత్రమే కాక నా కుటుంబ సభ్యుల కీర్తి ప్రతిష్ఠలకి, గౌరవ మర్యాదలకు తీవ్ర భంగం కలిగించింది సోషల్‌ మీడియా. ప్రపంచవ్యాప్తంగా సోషల్ సర్వీస్, డిసాస్టర్ మేనేజ్‌మెంట్‌, వ్యాపార రంగంలో నాకున్న పరువుని నడి రోడ్డున సోషల్ మీడియా plotformపై పెట్టి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రమైన మనోవేదనకు గురిచేసింది. రాజకీయాలలో ఉన్న నన్నే కాదు, ఎంతోమంది మహిళా ప్రజాప్రతినిధులను; వ్యాపార, సినిమా, సాఫ్్టవేర్‌, స్పోర్ట్స్... ఇలా అన్ని రంగాలలో ఉన్న మహిళలను, ఆఖరికి కాలేజీలకు వెళ్లే సామాన్య ఆడపిల్లలను కూడా సోషల్ మీడియాలో వేధిస్తున్నారు.


సోషల్ మీడియా అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైంది. సుమారు 30 కోట్లమంది భారతీయులు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారనేది ఒక అంచనా. ఇదే సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని హనీ ట్రాప్‌ ద్వారా భారత రక్షణ రహస్యాలను తెలుసుకోవటానికి జరిగిన కుట్రలను మనం చూశాం. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటే ఇవే మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింపచేయటం వలన స్థానిక భాష రాని బిచ్చగాళ్లను, వలస కార్మికులను జనం కొట్టి చంపిన చేదు అనుభవాలు ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఇంటికి తిరిగి వచ్చేవరకూ ప్రతిచోటా, ప్రతి పనిలోనూ ప్రభుత్వ నియంత్రణ మనకి కనిపిస్తూంటుంది. అలాంటిది ఇంత ముఖ్యమైన సోషల్ మీడియా విషయంలో ఎందుకు ఉండదు? దేశావసరాల కోసం రాజ్యాంగాన్ని వందసార్లు సవరించాము. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో, ప్రాథమిక హక్కు నెపంతో ఈ విషం చిమ్మేవారిని చిదిమేసేందుకు రాజ్యాంగాన్ని సవరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఎవరో బాధితులుగా మారి పోలీసులను ఆశ్రయించే వరకూ చట్టం చూస్తూ ఊరుకోకూడదు. మత విద్వేషాలు, అనైతిక, అసభ్య, అశ్లీల, అవమానకర పోస్టులు ఏది పెట్టినా చట్టమే దానిని పర్యవేక్షించి అలాంటి వారి అంతుచూసే రోజు రావాలి. అసలు అలాంటి వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలే అనుమతించని కఠిన చట్టాల కోసం సామాజిక మాధ్యమ బాధితులు ఎదురు చూస్తున్నారు.సాదినేని యామిని శర్మ

Updated Date - 2020-05-29T05:51:02+05:30 IST