సంక్షేమ రాజ్యానికి నైపుణ్యాల బాట

ABN , First Publish Date - 2020-12-15T09:46:21+05:30 IST

అభివృద్ధి చెందిన దేశాలలో నిపుణ కార్మికుల కొరత అత్యధికంగా ఉండగా వర్ధమాన దేశాలలో అనిపుణ కార్మికులు అవసరాలకు మించి...

సంక్షేమ రాజ్యానికి నైపుణ్యాల బాట

‘సంక్షేమ రాజ్య వ్యవస్థ’ను నిర్మించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రేపటి పౌరులను సుశిక్షిత నిపుణులుగా తీర్చిదిద్దగల విద్యావ్యవస్థతోనే ఇది సాధ్యం. ఉపాధ్యాయుల సంక్షేమం కంటే విద్యార్థి శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చినప్పుడు మాత్రమే అటువంటి ఆదర్శ విద్యావ్యవస్థ విలసిల్లుతుంది. ఇది నిజమయినప్పుడు ప్రపంచానికి సామాన్య నిపుణులైన వెల్డర్లను మాత్రమే కాకుండా అధునాతన ప్రతిభాపాటవాల సాప్ట్‌వేర్ ప్రోగ్రామర్లను కూడా పెద్దసంఖ్యలో మనమే సమకూర్చగలుగుతాం.


అభివృద్ధి చెందిన దేశాలలో నిపుణ కార్మికుల కొరత అత్యధికంగా ఉండగా వర్ధమాన దేశాలలో అనిపుణ కార్మికులు అవసరాలకు మించి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సంపన్న దేశాలలో ఉన్నత పాఠశాల, ఆ పై స్థాయి విద్యార్హతలు గల నిపుణ కార్మికులు అవసరాల కంటే 8.5 కోట్ల మంది తక్కువగా ఉన్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్హతలు గల అనిపుణ కార్మికులు అవసరాలకు మించి 9.5 కోట్ల మంది అధికంగా ఉన్నారని మెక్ కిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్హతలు గల మన అనిపుణ కార్మికులకు అధునాతన వృత్తి నైపుణ్యాలను చేకూర్చిన పక్షంలో ప్రపంచదేశాలకు అవసరమైన నిపుణ కార్మికులను అత్యధిక సంఖ్యలో సమకూర్చగల సామర్థ్యం మనకు లభిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి. మనదేశంలో వెల్డర్ల కొరతను భర్తీ చేసేందుకు చైనా, రష్యా, తూర్పు యూరోపియన్ దేశాల నుంచి కనీసం 10,000 మంది వెల్డర్లను దిగుమతి చేసుకొంటున్నామని ఎస్. శ్రీనివాసన్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్ అధ్యక్షుడు) తెలిపారు. ఒకవైపు ప్రపంచానికి నిపుణ కార్మికులను సరఫరా చేయగల సామర్థ్యం మనకు ఉందని భావిస్తున్నాం. మరోవైపు వెల్డర్ల లాంటి సాధారణ నిపుణ కార్మికులను సైతం సొంతంగా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం! 


‘స్కిల్ డెవెలప్‌మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్ షిప్’ (ఎమ్ఎస్‌‌డిఇ) అనే ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. ప్రస్తుత విద్యావ్యవస్థలోని లొసుగులను అధిగమించి కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. అయితే 2020-–21 ఆర్థికసంవత్సరంలో ఎమ్‌ఎస్‌కి బడ్జెట్ ‌కేటాయింపులు కేవలం రూ.3000 కోట్లు కాగా విద్యా మంత్రిత్వశాఖకు కేటాయింపులు రూ.99,000 కోట్లు. అడవిలో రాజుకున్న మంటలను కేవలం మూడు బకెట్‌ల నీటితో ఆర్పగలమా? మరో ముఖ్యమైన విషయమేమిటంటే వెల్డర్లకు అధునాతన నైపుణ్యాలను సమకూర్చే విషయంలో ఎమ్‌డిఇ ఏమాత్రం శ్రద్ధాసక్తులు చూపడం లేదు. అధునాతన నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే అది ప్రాధాన్యమిస్తోంది. అమెజాన్, గూగుల్, అదాని, యుబెర్, మారుతి, మైక్రోసాఫ్ట్ మొదలైన కంపెనీలతో ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది మంచి పనే, సందేహం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా నర్సులు, టీచర్లు, ఫిజియోథెరపిస్టులు, అనువాదకులు మొదలైన నిపుణుల కొరతను భర్తీ చేయడం ఎలా సాధ్యపడుతుంది. ఎమ్ఎస్‌డిఇ అధికారుల కుమారులు, కుమార్తెలు వెల్డర్లు కావాలని, ఆశించరు కదా. కనుకనే ఆ మంత్రిత్వశాఖ అధునాతన నైపుణ్యాల అభివృద్ధి పైనే దృష్టిని కేంద్రీకరించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ మొదలైన కంపెనీలతోనే దాని ఒప్పంద వ్యవహారాలు అన్నీ సాగుతున్నాయి ఫలితంగా నైఫుణ్యాల అభివృద్ధి అనేది వెనక పట్టు పట్టింది. ప్రభుత్వ విద్యావ్యవస్థను సంస్కరించడం ఒక అసాధ్య కార్యమని ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు, మనదేశంలో అనేక రాష్ట్రాలు గుర్తించాయి. ఈ కారణంగానే అవి వోచర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రభుత్వం సమకూర్చే వోచర్లతో విద్యార్థి తాను కోరుకున్న విద్యాసంస్థలో విద్యాభ్యాసం చేయగల సదుపాయం లభిస్తుంది. ‘సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ’ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం హాంకాంగ్‌లో విద్యార్థులు చెల్లించే ఫీజులో కొంత భాగాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాలలో విద్యార్థులు ఎంచుకున్న విద్యాసంస్థకు నెలకు రూ.550 నుంచి రూ.1100 దాకా నేరుగా చెల్లిస్తోంది. ఫలితంగా ఆ పాఠశాలల్లో చదువును మధ్యలో ఆపివేసే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గణితశాస్త్ర బోధన బాగా మెరుగుపడింది. ఫిలిప్పీన్స్‌లో కూడా ఇటువంటి ఏర్పాటే ఉంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలను అమలుపరుస్తున్నాయి. ఆంగ్లం, గణితశాస్త్ర బోధనల్లో మెరుగైన ఫలితాలు సమకూరినట్టు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. ఒడిషాలో ఇటువంటి కార్యక్రమం అమలు ఫలితంగా ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల శాతం 64 నుంచి 75 శాతానికి పెరిగింది. ఉపాధ్యాయులు బోధించడానికి ఉత్సాహం చూపిన పక్షంలో నేర్చుకోవడానికి విద్యార్థులు సదా సంసిద్ధంగా ఉంటారనే విషయం ఈ అనుభవాల ద్వారా ధ్రువపడింది. మరి ఉపాధ్యాయులు తమకు సరైన వేతన భత్యాలు అందిన పక్షంలో విద్యార్థులకు మరింత మెరుగ్గా బోధించే విషయమై శ్రద్ధ చూపుతారని కూడా స్పష్టమయింది. మన దేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సగటు వేతనం రూ.6000 మించడం లేదు. అయితే రూ.60,000 నెలసరి వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ప్రైవేట్ ఉపాధ్యాయులే తమ విధులను ప్రశస్తంగా నిర్వహిస్తున్నారు. కనుకనే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలే విద్యార్థుల ఉత్తీర్ణతలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. 


మన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచాలంటే విద్యా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులలో పెనుమార్పులు జరగాలి. ప్రభుత్వ పాఠశాలలకు చేస్తున్న కేటాయింపులను సగానికి తగ్గించాలి. మిగతా సగాన్ని విద్యార్థి ఎంచుకున్న పాఠశాలలకు చెల్లించాలి. ఇలా జరిగినప్పుడు ఉపాధ్యాయులు తమ బోధనా విధులపై అమిత శ్రద్ధ చూపుతారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చూపితే విద్యార్థి ద్వారా లభించే సగం చెల్లింపులు వారికి సమకూరవు. ‘సంక్షేమ రాజ్య వ్యవస్థ’ను నిర్మించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రేపటి పౌరులను సుశిక్షిత నిపుణులుగా తీర్చి దిద్దగల విద్యావ్యవస్థతోనే ఇది సాధ్యం. ఉపాధ్యాయుల సంక్షేమం కంటే విద్యార్థి శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చినప్పుడు మాత్రమే అటువంటి ఆదర్శ విద్యావ్యవస్థ విలసిల్లుతుంది. రాజ్యాంగ నిర్దేశం నెరవేరుతుంది. ఇది నిజమయినప్పుడు ప్రపంచానికి సామాన్య నిపుణులైన వెల్డర్లను మాత్రమే కాకుండా అధునాతన ప్రతిభాపాటవాల సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లను కూడా ప్రపంచానికి పెద్ద సంఖ్యలో మనమే సమకూర్చగలుగుతాం.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Read more