వేట

ABN , First Publish Date - 2020-04-15T06:20:03+05:30 IST

యుద్ధం ఇట్లా మొదలవుతుందనుకోలేదు మనిషిని ఎరగా వేసిన వేట ఇంత బీభత్సంగా సాగుతుందనుకోలేదు ఆధిపత్యం కోసం అడుగులు పడుతున్న వేళ ఇప్పుడీ సూక్ష్మజీవి ఒక విశ్వవ్యాప్త సత్యం...

వేట

యుద్ధం ఇట్లా మొదలవుతుందనుకోలేదు

మనిషిని ఎరగా వేసిన వేట

ఇంత బీభత్సంగా సాగుతుందనుకోలేదు

ఆధిపత్యం కోసం అడుగులు పడుతున్న వేళ

ఇప్పుడీ సూక్ష్మజీవి ఒక విశ్వవ్యాప్త సత్యం

అప్పుడెప్పుడో యుద్ధ నియమాలన్నీ

అణు ధూళిలో

కలిసి పోయిన తర్వాత

భావి యుద్ధాలెట్లా ఉండబోతున్నాయో

ఊహించుకోవటానికిదొక ఉదాహరణ

దేహకణాల మధ్య విస్ఫోటనం జరుగుతుందని

క్షణాల మధ్య ఆత్మాహుతి

దళాలు మాటు వేస్తాయని

కలలో కూడా ఊహించలేదు

పద్నాలుగు రోజుల టైమ్

బాంబ్‌ను మోస్తూ

క్వారంటైన్లో ఎండుటాకుల 

మధ్య వెనక్కి నడుస్తూ

వసంతాన్ని కలగనటం అసాధ్యం

మరి ప్రేమించిన ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లటం...?

శరీరానికి మనసుకు మధ్య సంఘర్షణలో 

మనసుదే పైచేయి అవుతుందా?

విశ్వాన్ని ‘నో మ్యాన్స్ 

లాండ్’గా మార్చాలని చూస్తున్న

ఆఖరి సూక్ష్మజీవిని కూడా 

అంతం చేసి తీరుతామా?

ఈ ప్రశ్నల మధ్య ఒక్క 

‘అదృశ్యవాణి’ వినిపిస్తూ వుంది

‘అమాయకుడా! ఇది ప్రయోగం మాత్రమే’

అమ్మంగి వేణుగోపాల్

Updated Date - 2020-04-15T06:20:03+05:30 IST