ఆత్మగౌరవమా నీవెక్కడ!!
ABN , First Publish Date - 2020-11-03T07:07:15+05:30 IST
ఆనాడు ఎన్టీఆర్ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని నినదిస్తూ, అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకొని అధికారంలోకి వచ్చిన తరువాత...
ఆనాడు ఎన్టీఆర్ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని నినదిస్తూ, అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకొని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదేస్ఫూర్తితో కొనసాగారు. విశ్వబ్రాహ్మణుల పంచవృత్తులను గుర్తించి ‘ఆదరణ’ వంటి పథకాలతో వారిని ఆదుకున్నారు. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్రను తెలుగుసినీ తెరపైకి ఎక్కించి విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. అన్ని కులాలు, వృత్తులు, సాంప్రదాయాలను అక్కున చేర్చుకొని అభిమానించారు. అందుకే అందరికీ దేవుడయ్యారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సైతం సాంప్రదాయాన్నీ, ఆధునికతనూ సమపాళ్ళలో జోడించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పాలనలో కూడా బీసీ, ఓసీలనే తేడాలు లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ సమంగా అందేందుకు కృషి జరిగింది. గత ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల్లో ప్రజలకు ధర్మదర్శనాలు అందించేవారు. తమను కలవడానికి వచ్చినవారితో, ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడుతూ వారు ఇచ్చిన డిమాండ్ల పత్రాలను స్వీకరించి పరిష్కారం నిమిత్తం తమ కార్యదర్శులకు అప్పచెప్పేవారు. వారి మంత్రివర్గ సహచరులూ ప్రజల విన్నపాలకు అందుబాటులో ఉండేవారు. కానీ, సబ్బండవర్ణాల సహకారంతో, ఆత్మబలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి ఆవేదనను పాలకులు వినడం లేదు. తమను ఆశీర్వదించే కులాలను, కొన్ని బీసీ కులాలను మాత్రమే అక్కునచేర్చుకొని మిగతావారిని అవమానపరుస్తున్నారు. దర్శనం ఇవ్వకుండా దూరం పెడుతున్నారు. విజ్ఞప్తులు ఇద్దామంటే ముఖ్యమంత్రి బయటకు రారు, ప్రజలను కలవరు, ధర్మదర్శనం ఉండదు. తలుపులు కొందరికి మాత్రమే తెరిచి ఉంటాయి. తెలంగాణ సాధనలో త్యాగాలు చేసినవారికి తప్పక న్యాయం చేస్తానని ప్రకటించిన అధినేతలు తమ హామీలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో తెలియదు. కేవలం రెండు మూడు బీసీ వర్గాలకు గౌరవం, రాజకీయ ఉపాధి లభించినంత మాత్రాన అన్ని బిసి వర్గాలకు ఆత్మగౌరవం దక్కినట్లు కాదు. తమదైన శైలిలో పాలకులు ప్రకటించిన ఆత్మగౌరవ భవనాలకు కూడా దిక్కులేకుండా పోయింది. సాంప్రదాయ వృత్తిదారులైన విశ్వబ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, రజక వంటి బీసీకులాలు అన్ని రంగాల్లో వెనక్కునెట్టివేయబడుతున్నారు. ఈ ఆరేళ్ళలో బీసీలకు ఒరిగిందేమిటో బీసీలు, ఉద్యోగసంఘాల నిర్వాహకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక పక్షానికో, రెండు పక్షాలకో కాక అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడే చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకుంటాడు.
చొల్లేటి కృష్ణమాచార్యులు
ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర
విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం