సద్ధమ్మ విపంచి బోధ చైతన్య

ABN , First Publish Date - 2020-12-30T05:49:32+05:30 IST

ఆధునిక తెలుగు బౌద్ధలోకానికి ఆద్యుడు బోధ చైతన్య. బౌద్ధ మత సాహిత్య అనువాదకుడుగా సుప్రసిద్ధుడు. రచనలకు ధర్మ పరీమళాలు...

సద్ధమ్మ విపంచి బోధ చైతన్య

బోధ చైతన్య మహాపండితుడు. బౌద్ధ సాహితీ రసధుని. మిలింద ప్రశ్నలు, బుద్ధవచనం మొదలైన బౌద్ధ మత గ్రంథాలను అనువదించారు. బోధ చైతన్య చదునుచేసి, దుక్కిదున్ని, సాగుకు సిద్ధం చేసిన నేల మీదే నేడు ఎందరో బౌద్ధ రచయితలు తమ రచనల వ్యవసాయం సాగిస్తున్నారు.


ఆధునిక తెలుగు బౌద్ధలోకానికి ఆద్యుడు బోధ చైతన్య. బౌద్ధ మత సాహిత్య అనువాదకుడుగా సుప్రసిద్ధుడు. రచనలకు ధర్మ పరీమళాలు అద్దిన అద్భుత అనువాదకుడు. బోధ చైతన్య అసలు పేరు ఈశ్వరవాక రామలింగం. తమిళనాడులోని తెలుగు కుటుంబాలకి చెందిన వారు. 1946లో వేళూరు గ్రామంలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే సాగింది. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందారు. చిన్ననాటి నుంచి ధార్మిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో చెన్నైలోని రామకృష్ణ మఠంలో చేరారు. వేదాంతం, భారతీయ తత్త్వశాస్త్రం, పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని ఔపోసన పట్టారు. జర్మన్‌ తత్త్వవేత్త షోపెన్‌హార్‌ తత్త్వం అంటే ఆయనకు అమితాసక్తి. దాదాపు పద్నాలుగేళ్ళు రామకృష్ణ మఠంలో ఉన్నారు. ఆ సమయంలో పదేళ్ళు ‘రామకృష్ణ ప్రభ’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అనంతరం మదనపల్లికి వచ్చి జిడ్డు కృష్ణమూర్తి గారి రుషివ్యాలీ విద్యా సంస్థలో అధ్యాపకునిగా చేరి, మూడేళ్ళు పనిచేశారు. పిదప చాలా కాలం ఏర్పేడులోని వ్యాసాశ్రమంలో ఉన్నారు. అక్కడే ఉన్న విద్యాప్రకాశానంద గిరిస్వామి వారి శుకబ్రహ్మాశ్రమంలో కొంత కాలం వేదాంతాచార్యులుగా ఉన్నారు. 1988 నుంచి మూడేళ్ళు తిరుపతిలోని శ్రీ సోం ప్రకాశ్‌ విశ్వవిద్యాపీఠంలో ఉపాధ్యాయునిగా పని చేశారు. కడప దగ్గర ఆశ్రమంలో కొంతకాలం, గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కృష్ణా తీరాన ఉన్న హనుమాన్‌ పాలెం ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్పై ఉన్న బుద్ధవిహార్‌ నిర్మాణ సమయంలో ప్రధాన పాత్రపోషించారు.


బోధ చైతన్య అనేక మార్గాల్లో ఆధ్యాత్మిక అన్వేషణ చేశారు. మత గ్రంథాలను మధించారు. ఆయన మదిలో చెలరేగిన అనేక ప్రశ్నలకి సమాధానం బౌద్ధంలో దొరికింది. బౌద్ధ మత అధ్యయన ప్రభావంతో 1990 నుంచి జీవితాంతం బౌద్ధ ధమ్మ మార్గంలోనే ఉన్నారు. ప్రపంచ దుఃఖ నివారణకి బౌద్ధం తప్ప మరోమార్గం లేదని బోధ చైతన్య విశ్వసించారు. ఆ సత్యాన్నే లోకానికి చాటారు. ఆయన మొదటి బౌద్ధ రచన ‘జాతకమాల’ను తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు. చెన్నూరు ఆంజనేయరెడ్డి పరిచయంతో బోధ చైతన్య బౌద్ధ గ్రంథాలన్నీ ధర్మదీపం ఫౌండేషన్‌ వారే వెలువరించారు. బోధచైతన్య మహాపండితుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ధర్మ విజ్ఞాన గని. బౌద్ధసాహితీ రసధుని. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, పాళీ, తమిళ భాషల్లో దిట్ట. అతి సాధారణమైన జీవనం. కాషాయ చీవరాలు ధరించని భిక్షువు. రెండు జతల బట్టలు, ఒక చాప, రోజుకి గుప్పెడు శనగలు, కేవలం నాలుగు ఇడ్డెన్లతో జీవించిన సాధువు కాని సాధువు. సత్కార సన్మానాలకు ఆమడ దూరం. ఆయన పదికిపైగా బౌద్ధ మత గ్రంథాలను అనువదించినా అవన్నీ స్వేచ్ఛానువాదాలే! బోధ చైతన్య చదునుచేసి, దుక్కిదున్ని, సాగుకు సిద్ధం చేసిన నేల మీదే ఈనాడు ఎందరో బౌద్ధ రచయితలు తమ రచనల వ్యవసాయం సాగిస్తున్నారు. బౌద్ధరత్న శ్రీబోధచైతన్య తెలుగు బౌద్ధలోక దిక్సూచి! సద్ధమ్మ విపంచి!


గత పదేళ్ళుగా గూడేరు దగ్గరి కొమ్మనేటూరులోని యస్‌.ఆర్‌.శంకరన్‌ ట్రస్టు భవనంలో ఉంటున్న బోధ చైతన్య కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రతరం కావడంతో డిసెంబర్ 26న తిరుపతి స్విమ్స్ లో నిర్వాణం పొందారు (తుదిశ్వాస విడిచారు). ధమ్మపదం కథలు, జాతకమాల, లోకక్షేమ గాథలు, ప్రజ్ఞాపారమిత, మిలింద ప్రశ్నలు, జయమంగళం, శీలం-ధ్యానం, మహాపరిత్తం, బుద్ధవచనం, విమలకీర్తి నిర్దేశసూత్ర... వీరి బౌద్ధ రచనలు. ప్రతి పుస్తకం ఒక ఆణిముత్యమే! నిత్య పఠనీయమే!

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-12-30T05:49:32+05:30 IST