పీడిత ప్రజల గొంతుక సదాలక్ష్మి

ABN , First Publish Date - 2020-12-25T06:09:22+05:30 IST

భారతదేశంలో కుల అంతరాలు, మహిళా సమస్యలు పరస్పర సంబంధం ఉన్నవని డాక్టర్ అంబేద్కర్ భావించారు. నిచ్చెన మెట్ల వ్యవస్థలో...

పీడిత ప్రజల గొంతుక సదాలక్ష్మి

సామాజిక పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు చిహ్నంగా నిలిచిన సదాలక్ష్మిని స్మరించుకోవడమంటే మహిళా ఉద్యమాలను, దళిత మహిళల పోరాట స్ఫూర్తిని గౌరవించుకోవడమే. సదాలక్ష్మి స్ఫూర్తితో సంపూర్ణ సామాజిక తెలంగాణ, సకల జనుల సంక్షేమ తెలంగాణ ఉద్యమ దిశగా బహుజన సమాజం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది.


భారతదేశంలో కుల అంతరాలు, మహిళా సమస్యలు పరస్పర సంబంధం ఉన్నవని డాక్టర్ అంబేద్కర్ భావించారు. నిచ్చెన మెట్ల వ్యవస్థలో అందరికంటే ఎక్కువ వివక్షకు, దోపిడీకి గురి అవుతున్నది దళితులు, మహిళలు. అందులో మరీ ముఖ్యంగా దళిత స్త్రీలు మరిన్ని వివక్షలకు గురవుతూ బాధితులుగా మొదటి వరుసలో ఉన్నారు. అసమానత, అంటరానితనం అడుగడుగునా పేరుకుపోయిన సమాజానికి తిరుగుబాటు సంకేతంగా బాబా సాహెబ్ ప్రేరణతో జీవిత పర్యంతమూ ఉద్యమించిన నాయకురాలు టీ.ఎన్. సదాలక్ష్మి.


మాదిగ ఉపకులమైన మెహతర్ కులంలో 1928 డిసెంబర్ 25 న సదాలక్ష్మి జన్మించారు. దళిత ఉద్యమ చరిత్రలో ఆ కాలం ‘రాడికల్ పిరియడ్ ఆఫ్ దళిత్’ గా పేరుగాంచింది. విద్య ప్రాధాన్యతను గుర్తించిన కుటుంబం కావడంతో సదాలక్ష్మిని ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని ప్రముఖ విద్యా సంస్థలో చదివించారు. సామాజిక వెనకబాటుతనం, ఆర్థిక సమస్యల ఆటుపోట్లను తట్టుకుని ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. 


1944 సెప్టెంబరులో ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డా. బి.ఆర్. అంబేడ్కర్‌ ప్రసంగం సదాలక్ష్మి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఆమె స్వయం కృషితో కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకురాలుగా ఎదిగి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1960 లో అసెంబ్లీ డిప్యూటి స్పీకర్‌గా, 1963 లో మంత్రిగా బడుగు బలహీన వర్గాల వికాసానికి కృషి చేశారు. బాబు జగ్జీవన్ రాం తో కలిసి దళితుల అభ్యున్నతి కోసం పనిచేశారు. 


సదాలక్ష్మి జీవితం ప్రతిక్షణం పోరాటమయమే. దళిత జాతి ఔన్నత్యం కోసం పోరాటాలు జరిపే సందర్భంలో అన్ని వివక్షలనూ ఎదుర్కొన్నారు. తెలంగాణ తొలి దశ పోరాటంలో సదాలక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనను మొదటినుంచి కాంక్షించిన అసలు సిసలు తెలంగాణ వాది ఆమె. ‘తెలంగాణ ప్రజా సమితి’ (టి.పి.యస్) స్థాపన, చైర్మన్‌గా మదన్‌మోహన్‌ నియామకం తెలంగాణ పోరాటంలో ఒక ముఖ్య ఘట్టం. 1969 ఉద్యమంలో ముఖ్య భూమికను పోషిస్తూ తెలంగాణ అంతటా పర్యటిస్తూ సామాన్య కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరినీ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో, దానికి నైతిక మద్దతును కూడగట్టడంలో తన శక్తికి మించిన కృషిచేశారు సదాలక్ష్మి. ఉద్యమ ఉధృతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసింది. ఆ సమయంలో హైదరాబాదుకు హుటాహుటిన చేరుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించడంలో సదాలక్ష్మి కీలక పాత్ర వహించారు. తరువాత ఉద్యమ సారథ్యం చెన్నారెడ్డి చేతికి పోవడం, ఆయన రాజకీయంగా రాజీపడటం, అనేకమంది విద్యార్ధులు చనిపోవడం సదాలక్ష్మిని తీవ్రంగా కలచివేసింది. అందుకే ఆమె ఆ తరువాత కాలంలో సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం గురించి తరుచూ గుర్తుచేస్తుండేవారు. సదాలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూనే దళిత ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాలలో మాల మాదిగల (మామా)తో కలిసి పాల్గొనేవారు. మాదిగ అస్తిత్వ రాజకీయ ఉద్యమాలలో భాగంగా తన గురువు ముదిగొండ లక్ష్మయ్య ప్రేరణతో దక్షిణ భారత మాదిగ ఉద్యమాన్ని నిర్మించి దానికి చారిత్రక ప్రాధాన్యతను కల్పించిన వారిలో సదాలక్ష్మి ప్రముఖులు. 


ఎస్సీ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ ఆవశ్యకతను తెలుపుతూ సదాలక్ష్మి 1972 లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు కి మెమోరాండమ్ ఇవ్వడంతో పాటు వర్గీకరణపై దళిత జాతికి అవగాహన కల్పించడంలో కొంత మేరకు విజయం సాధించారు. 1992లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన ‘ఆది జాంబవ అరుంధతి సభ’లో ఆమె ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణను డిమాండ్ చేశారు. వర్గీకరణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి సదాలక్ష్మి ఇంటినుండి అనేక ఉద్యమాలు జీవం పోసుకున్నాయి. ప్రకాశం జిల్లా ఈదుముడిలో 1994 జులై 7 న ఎమ్మార్పియస్ స్థాపన జరిగింది. ‘వర్గీకరణ అనేది కులాల మధ్య విభజన కాదు, 59 కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి పునాది. దళితులంతా వర్గీకరణ (హేతుబద్ధీకరణ)కు మద్దతు ఇవ్వడం ద్వారానే నిజమైన అంబేడ్కర్ వాదులుగా, వారసులుగా చరిత్రలో నిలిచిపోతాం’ అని సదాలక్ష్మి అన్నారు. 


దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం..ఇలా అనేక ప్రజా పోరాటాల్లో కొట్లాడిన గొంతుక సదాలక్ష్మి. సదాలక్ష్మి ప్రేరణతో మొత్తం దళిత సమాజం నేడు ఒక బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నది. స్త్రీ నాయకత్వాన్ని విస్మరిస్తున్న దళిత ఉద్యమ సంఘాలు సదాలక్ష్మి స్ఫూర్తితో స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తూ, ఆ దళిత స్త్రీల నాయకత్వంలో రాజకీయ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమ నాయకురాలు సదాలక్ష్మి జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ నైతిక బాధ్యత. అరవై ఏండ్ల రాష్ట్ర సాధన కల నెరవేరిన సందర్భంలో సామాజిక పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు చిహ్నంగా నిలిచిన సదాలక్ష్మిని స్మరించుకోవడమంటే మహిళా ఉద్యమాలను, దళిత మహిళల పోరాట స్ఫూర్తిని గౌరవించుకోవడమే. సదాలక్ష్మి స్ఫూర్తితో సంపూర్ణ సామాజిక తెలంగాణ, సకల జనుల సంక్షేమ తెలంగాణ ఉద్యమ దిశగా బహుజన సమాజం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది.

సిలపాక వెంకటాద్రి

(నేడు టి.ఎన్. సదాలక్ష్మి జయంతి)

Updated Date - 2020-12-25T06:09:22+05:30 IST